GTA 6 : జీటీఏ 6కి క్రేజ్ మామూలుగా లేదుగా! 1బిలియన్ డాలర్ల ప్రీ-ఆర్డర్ల సునామీ..
ప్రపంచ గేమింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6’ విడుదలకు ముందే చరిత్ర సృష్టించింది. నవంబర్ 19న ఈ గేమ్ రిలీజ్ కానుండగా, ప్రీ-ఆర్డర్ల ద్వారానే 1 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని దాటేసింది. అంతేకాదు గేమ్ ఆడేందుకు అమెరికాలో చాలా మంది నవంబర్ 19న సెలవులు పెట్టేస్తున్నారట!
గేమింగ్ రంగంలో ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాస్తూ 'గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6' సంచలనాల సునామీ సృష్టిస్తోంది. రాక్‌స్టార్ గేమ్స్ రూపొందించిన ఈ యాక్షన్-అడ్వెంచర్ గేమ్ నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే రిలీజ్‌కు ముందే ప్రీ-ఆర్డర్ల రూపంలో ఏకంగా 1 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.9,300 కోట్లు) మైలురాయిని దాటి గేమింగ్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది.
డిసెంబర్‌లో విడుదల కానున్న హాలీవుడ్ భారీ చిత్రం 'అవెంజర్స్: డూమ్స్‌డే' స్థాయిలో ఈ జీటీఏ 6 గేమ్‌పై క్రేజ్ నెలకొంది. హైదరాబాద్, బెంగళూరు వంటి ఐటీ నగరాల్లోని యువత నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది గేమర్ల వరకు అందరూ నవంబర్ 19 కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే చరిత్రలోనే అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ లాంచ్‌గా జీటీఏ 6 నిలవనుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
డిజిటల్ స్టోర్లలో ఆల్-టైమ్ రికార్డు
మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ సెన్సార్ టవర్ అంచనాల ప్రకారం.. ప్లేస్టేషన్ 5 (పీఎస్5), ఎక్స్‌బాక్స్ సిరీస్ X|S కన్సోల్స్‌పై ఇప్పటివరకు కోటి (10 మిలియన్లు) కాపీలకు పైగా ప్రీ-ఆర్డర్లు నమోదయ్యాయని నవంబర్ 11న 'ది వాషింగ్టన్ పోస్ట్' ఈ గణాంకాలను ప్రచురించింది. ఇవి కేవలం మార్కెట్ అంచనాలు మాత్రమే. రాక్‌స్టార్ గేమ్స్ లేదా దాని మాతృసంస్థ టేక్-టూ ఇంటరాక్టివ్ ఇంకా అధికారిక లెక్కలను బయటపెట్టలేదు!
మరోవైపు, తమ డిజిటల్ స్టోర్ల చరిత్రలోనే అత్యధిక ప్రీ-ఆర్డర్లు సాధించిన గేమ్ ఇదేనని సోనీ, మైక్రోసాఫ్ట్ సంస్థలు వేర్వేరుగా ప్రకటించాయి. "ప్రీ-ఆర్డర్లు మా ప్రాథమిక అంచనాలను ఎప్పుడో దాటేశాయి," అని టేక్-టూ సీఈఓ స్ట్రాస్ జెల్నిక్ ఆనందం వ్యక్తం చేశారు.
జీటీఏ 6 గేమ్ ఆడేందుకు సెలవులు!
GTA 6 విడుదల తేదీ కార్పొరేట్ ఆఫీసుల్లోని సెలవుల ప్రణాళికలను సైతం మార్చేస్తోంది! నవంబర్ 19 గురువారం కావడంతో, గురు, శుక్రవారాలు సెలవు పెట్టి శని, ఆదివారాలతో కలిపి నాలుగు రోజుల పాటు నాన్‌స్టాప్ గేమింగ్ మారథాన్ చేయాలని గేమర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. హెచ్ఆర్ సాఫ్ట్‌వేర్ సంస్థ బాంబూహెచ్ఆర్ అక్టోబర్ 22న విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 2024, 2025 సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది నవంబర్ 19న సెలవు దరఖాస్తులు దాదాపు 13 శాతం పెరిగాయి.
అమెరికాలో సర్వే చేసిన వేతన ఉద్యోగుల్లో 18 శాతం మంది లాంచ్ రోజున గేమ్ ఆడేందుకు సెలవు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉత్సాహాన్ని గమనించిన ప్రముఖ టెక్ సంస్థ లాజిటెక్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. లాంచ్ రోజున తమకు నచ్చిన గేమ్స్ ఆడుకునేందుకు ఉద్యోగులకు ప్రత్యేకంగా ఒక రోజు సెలవు ప్రకటించింది. శాన్ జోస్ ప్రధాన కార్యాలయం నుంచి తమ గేమింగ్ విభాగం ప్రత్యక్ష ప్రసారం (లైవ్ స్ట్రీమింగ్) నిర్వహించనుంది.
ప్రీ-లోడింగ్ షురూ.. పాత ఎక్స్‌బాక్స్ వన్‌లోనూ ఆడొచ్చు!
ఇప్పటికే గేమ్ ప్రీ-ఆర్డర్ చేసుకున్న డిజిటల్ వినియోగదారుల కోసం నవంబర్ 10 నుంచి 'ప్రీ-లోడింగ్' సదుపాయాన్ని రాక్‌స్టార్ అందుబాటులోకి తెచ్చింది. బాక్స్‌లలో కోడ్ రూపంలో కొనుగోలు చేసిన వారు, ఆ కోడ్‌లను ఉపయోగించి గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుత తరం కన్సోల్స్‌పై ఈ గేమ్ 30 ఎఫ్‌పీఎస్ వద్ద రన్ అవుతుందని డెవలపర్లు ధృవీకరించారు. పీఎస్5 ప్రో వెర్షన్ కోసం ప్లేస్టేషన్ స్పెక్ట్రల్ సూపర్ రిజల్యూషన్, రే-ట్రేస్డ్ షాడోస్ వంటి అధునాతన ఫీచర్లను జతచేశారు.
ఖరీదైన కొత్త కన్సోల్స్ లేని వారికి మైక్రోసాఫ్ట్ తీపి కబురు చెప్పింది. నవంబర్ 19 తెల్లవారుజామున 1 గంట (ఈటీ) నుంచి 'ఎక్స్‌బాక్స్ క్లౌడ్ గేమింగ్' ద్వారా పాత ఎక్స్‌బాక్స్ వన్ కన్సోల్‌లోనూ జీటీఏ 6 ఆడవచ్చని నవంబర్ 10న ప్రకటించింది. ఎక్స్‌బాక్స్ వన్ యూజర్లు గేమ్‌ను డౌన్‌లోడ్ చేయకుండానే, ఎక్స్‌బాక్స్ సిరీస్ S గ్రాఫిక్స్ సెట్టింగ్స్‌తో క్లౌడ్ ద్వారా స్ట్రీమింగ్ చేస్తూ ఆడుకోవచ్చు. దీనికితోడు, గేమ్ పాస్ సబ్‌స్క్రిప్షన్ లేకపోయినా, ఎంపిక చేసిన దేశాల్లో నవంబర్ 11 నుంచి క్లౌడ్ గేమింగ్ ప్లేటైమ్‌ను విడిగా కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది. అయితే ఇందుకు ముందుగా గేమ్ కొనుగోలు చేయడం తప్పనిసరి.
పీసీ వెర్షన్ త్వరలోనే వస్తుందా? ఏఐ ఎఫెక్ట్ ఏంటి?
సాధారణంగా రాక్‌స్టార్ సంస్థ తన గేమ్‌లను ముందుగా కన్సోల్స్‌లో విడుదల చేసి, ఏడాది తర్వాత పీసీ వెర్షన్‌ను తీసుకొస్తుంది. ప్రస్తుతం నవంబర్ 19న పీఎస్5, ఎక్స్‌బాక్స్ సిరీస్ X/S వెర్షన్లు మాత్రమే వస్తున్నాయి. పీసీ విడుదల తేదీపై ఇంకా స్పష్టత లేదు. అయితే జనరేటివ్ ఏఐ కారణంగా రాక్‌స్టార్ తన పీసీ విడుదల ప్రణాళికలను మార్చుకునే అవకాశం ఉందని రాక్‌స్టార్ నార్త్ మాజీ టెక్నికల్ డైరెక్టర్ ఒబ్బే వెర్మెజ్ అభిప్రాయపడ్డారు.
రాక్ పేపర్ షాట్‌గన్ పత్రికతో ఆయన మాట్లాడుతూ, ఏఐ టూల్స్ సాయంతో డెవలపర్లు పీఎస్5 వెర్షన్‌ను అనధికారికంగా పీసీలోకి మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. "అనధికారిక వెర్షన్లు అధికారిక గేమ్ అంత నాణ్యతతో ఉండకపోయినా, అవి మార్కెట్లోకి వస్తే రాక్‌స్టార్ అమ్మకాలపై దెబ్బ పడుతుంది. అందుకే కన్సోల్, పీసీ వెర్షన్లను ఒకేసారి విడుదల చేయడం తెలివైన నిర్ణయం అవుతుంది," అని ఒబ్బే వెర్మెజ్ పేర్కొన్నారు.
ఏదేమైనా, నవంబర్ 19న మొదలయ్యే జీటీఏ 6 జాతర గేమింగ్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించడం ఖాయంగా కనిపిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


