...
...
Next Story

Gurugram bike crash : రోడ్​ రేజ్ ఘటన.. మహిళా బైకర్​ని కారుతో ఢీకొట్టిన వ్యక్తి అరెస్ట్

గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డులో స్పోర్ట్స్ బైకర్‌ను కారుతో వెంటాడి ఢీకొట్టిన ఘటనలో ప్రధాన నిందితుడు కల్యాణ్ బైన్​స్లా పోలీసులు రాజస్థాన్‌లో అరెస్ట్ చేశారు. నెటిజన్ల ఆగ్రహం, వీడియో ఆధారాలతో పోలీసులు ఈ ఘటనను హత్యాయత్నం కేసుగా మార్చారు.

Published on: Sep 15, 2026, 12:20:08 IST
Advertisement

గురుగ్రామ్​లో తీవ్ర సంచలనం సృష్టించిన రోడ్ రేజ్ ఘటనలో హరియాణా పోలీసులు చర్యలు చేపట్టారు. స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న మహిళను కారుతో ప్రమాదకరంగా వెంటాడి ఢీకొట్టిన కేసులో ప్రధాన నిందితుడు కల్యాణ్ బైన్​స్లా రాజస్థాన్‌లో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

హత్యాయత్నం కేసుగా మార్పు..

గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసు నిందితుడు..
గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసు నిందితుడు..

ప్రారంభంలో గురుగ్రామ్ పోలీసులు ఈ ఘటనపై సాధారణ నిర్లక్ష్యపు డ్రైవింగ్ (సెక్షన్ 281), ఇతరుల ప్రాణాలకు ముప్పు తెచ్చే చర్యల (సెక్షన్ 125) కింద కేసు నమోదు చేశారు. అయితే సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పాటు నిందితుడి ఉద్దేశపూర్వక దాడిపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనితో బాధితురాలికి న్యాయం చేకూర్చే దిశగా గురుగ్రామ్ పోలీసులు కేసును తీవ్రంగా పరిగణించి, బీఎన్​ఎస్ సెక్షన్ 109 కింద 'హత్యాయత్నం' కేసుగా మార్చారు.

అసలు గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఏం జరిగింది?

ఆదివారం తెల్లవారుజామున 'సియా' అనే సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్ తన అప్రిలియా స్పోర్ట్స్ బైక్‌పై మిత్రులతో కలిసి గురుగ్రామ్​లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో ఒక తెలుపు రంగు మారుతీ సియాజ్ కారులో ఉన్న కొందరు వ్యక్తులు ఆమెను వేధించడం ప్రారంభించారు.

"కారులోని వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నారు. కారును నా బైక్ పక్కగా తెస్తూ ఆపమంటూ సైగలు చేశారు. నేను దూరంగా వెళ్లడానికి ప్రయత్నించినా, నన్ను అడ్డుకునేందుకు కారుతో నేరుగా బైక్‌ను ఢీకొట్టారు," అని బాధితురాలు సియా తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది.

అయితే ఈ ఆరోపణలను నిందితుడు కల్యాణ్ బైన్​స్లా తోసిపుచ్చాడు. "నేను నా కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్నాను. కావాలని బైక్‌ను ఢీకొట్టలేదు. బైక్ వేగం తగ్గించమని మాత్రమే సైగ చేశాను. సైడ్ మిర్రర్లు చూడకుండా ఆమె యూ-టర్న్ తీసుకోవడంతో అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆపితే అక్కడున్నవారు దాడి (లించింగ్) చేస్తారనే భయంతో పారిపోయాం," అని కల్యాణ్ చెప్పుకొచ్చాడు.

'పబ్లిసిటీ స్టంట్'- లాయర్ వింత వాదన

మరోవైపు నిందితుడి తరఫు న్యాయవాది వింత వాదనను తెరపైకి తెచ్చారు. "సదరు మహిళ సోషల్ మీడియా ఫాలోవర్లు, వ్యూస్ కోసమే ఈ విన్యాసాలు చేస్తోంది. పబ్లిసిటీ కోసమే రోడ్డుపై 140 నుంచి 170 కిలోమీటర్ల వేగంతో బైక్ నడుపుతూ వివాదం సృష్టిస్తోంది," అని బాధితురాలిపైనే ఆరోపణలు చేశారు.

బాధితురాలి ప్రశ్నాస్త్రాలు - కుటుంబ సభ్యుల ఆవేదన

లాయర్, నిందితుడి వ్యాఖ్యలపై బాధితురాలు తీవ్రంగా స్పందించింది. "మీకు నిజంగానే బాధ కలిగి ఉంటే, ప్రమాదం జరిగిన వెంటనే కారు ఆపి నాకు వైద్య సహాయం ఎందుకు అందించలేదు?" అని సూటిగా ప్రశ్నించింది.

“నేను నా పోరాటాన్ని ఆపను. నేను సమాజానికి ఒక ఉదాహరణగా ఉంటాను. నువ్వు క్రిమినల్​లా ఎక్కడ దాక్కున్నా సరే, బైకింగ్ కమ్యూనిటీ మొత్తం నాతో ఉందని గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా సరే, మహిళా బైకర్లను వేధించాలని ఆలోచిస్తున్న వారందరు భయపడేలా చేస్తాను,” అని సియా అన్నారు.

ఈ ఘటనతో తన సోదరి తీవ్ర మనోవేదనకు గురైందని, రోడ్డుపై మహిళా భద్రతకు ఇది పెద్ద సవాలని ఆమె సోదరుడు, తండ్రి వ్యాఖ్యానించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks