...
...
Next Story

Viral video : కొండచరియలతో పాటు కొట్టుకుపోయిన బైకర్! మైండ్​ బ్లాక్ అయ్యే వీడియో..

Arunachal Pradesh landslide : అరుణాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్డు దాటుతున్న ఓ బైకర్, క్షణాల వ్యవధిలో కొండచరియలు విరిగిపడటంతో బైక్‌తో పాటు కొట్టుకుపోయాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రమాదం నుంచి అతడు ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతమనే చెప్పాలి.

Published on: Jun 30, 2026, 06:43:14 IST
Advertisement

నెటిజన్ల గుండెలు ఆగిపోయేలా చేసే ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈశాన్య భారత రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడి ఒక బైకర్ మోటార్ సైకిల్‌తో సహా కిందకు కొట్టుకుపోయిన దృశ్యం సామాజిక మాధ్యమాలను కుదిపేస్తోంది. అయితే అంత పెద్ద ప్రమాదం జరిగినా, ఆ బైకర్‌కు కనీసం చిన్న గాయం కూడా కాకుండా ప్రాణాలతో బయటపడటం చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అసలేం జరిగింది? వైరల్​ వీడియోలో ఏముంది?

అరుణాచల్​ ప్రదేశ్​ వైరల్​ వీడియో..
అరుణాచల్​ ప్రదేశ్​ వైరల్​ వీడియో..

ఈ భయంకరమైన ఘటన జూన్ 28న లోయర్ సియాంగ్ జిల్లాలోని ‘సిజి’ ప్రాంతంలో జరిగింది. గత కొన్ని రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న రుతుపవన వర్షాల కారణంగా కొండ ప్రాంతాల్లోని రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైరల్ అవుతున్న వీడియోలో.. సదరు బైకర్ కొండ అంచున బురదతో నిండిన అత్యంత ఇరుకైన, ప్రమాదకరమైన రోడ్డుపై నెమ్మదిగా బైక్‌ను ముందుకు పోనిస్తూ కనిపిస్తాడు.

కాగా ఆ బైకర్ రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలోనే, పైనున్న కొండ ఒక్కసారిగా కుప్పకూలింది. క్షణాల వ్యవధిలో టన్నుల కొద్దీ మట్టి, బండరాళ్లు భారీ శబ్దంతో కిందకు జారిపడ్డాయి. ఆ వేగానికి రోడ్డుతో పాటు బైకర్, అతని బైక్ కూడా కొండచరియల శిథిలాల మధ్య ఇరుక్కుని వేగంగా కిందకు కొట్టుకుపోయాయి. ఆ కొండచరియలు నేరుగా కింద ప్రవహిస్తున్న ‘సిజి నది’లోకి పడటంతో ఒక్కసారిగా బురద, ధూళి మేఘాలు ఆకాశాన్ని కమ్మేశాయి.

ఈ విజువల్స్ చూసిన నెటిజన్లు ఆ బైకర్ బతికాడంటే నమ్మలేకపోతున్నారు! ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఒక యూజర్, కొండచరియలు విరిగిపడటంతో సిజి నది ప్రవాహం కూడా కాసేపు స్తంభించిపోయిందని పేర్కొన్నారు. "ఇలాంటి ప్రమాదం నుంచి గాయాలు కూడా కాకుండా బయటపడ్డాడంటే.. అతడు వెంటనే ఒక లాటరీ టికెట్ కొనుక్కోవడం మంచిది," అంటూ అతని అదృష్టాన్ని నెటిజన్లు ఆశ్చర్యంగా ప్రస్తావిస్తున్నారు.

సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న వీడియోని ఇక్కడ చూడండి :

కొండ ప్రాంతాల ప్రయాణికులకు హెచ్చరిక..

ఈశాన్య భారతదేశంలోని కొండ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా మట్టి లూజ్ అయిపోయి ఎప్పుడు ఏ క్షణంలో కొండలు విరిగిపడతాయో ఊహించడం అసాధ్యం. సాధారణంగా సాగిపోయే ప్రయాణం ఒక్క సెకనులో ప్రాణాంతకంగా ఎలా మారుతుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక పెద్ద ఉదాహరణ. తెలుగు రాష్ట్రాల నుంచి అసోం, అరుణాచల్ ప్రదేశ్ వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లేవారు వర్షాకాలంలో ఇలాంటి రూట్లలో ప్రయాణించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండటం అవసరం.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks