...
...
Next Story

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఉద్యోగాల కోత.. ఏఐ విప్లవంతో 3,300కు ఉద్యోగుల తగ్గింపు

బ్యాంకింగ్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ వాడకం వేగంగా పెరుగుతోంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, 2025–26 ఆర్థిక సంవత్సరంలో తన మొత్తం ఉద్యోగుల సంఖ్యను 3,343 మేర తగ్గించుకుంది.

Published on: Jul 13, 2026, 12:17:03 IST
Advertisement

సాంకేతికత పెరుగుతుంటే మానవ వనరుల అవసరం తగ్గుతుందనే అంచనాలు నిజమవుతున్నాయి. దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కార్యకలాపాలలో ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకాన్ని భారీగా పెంచింది. ఈ ప్రభావంతో బ్యాంక్‌లో సిబ్బంది సంఖ్య తగ్గింది. 2026 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ మొత్తం 3,343 మంది ఉద్యోగులను తగ్గించుకున్నట్లు మనీకంట్రోల్ నివేదిక వెల్లడించింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఉద్యోగాల కోత.. ఏఐ విప్లవంతో 3,300కు ఉద్యోగుల తగ్గింపు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఉద్యోగాల కోత.. ఏఐ విప్లవంతో 3,300కు ఉద్యోగుల తగ్గింపు

మార్చి 31, 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొత్తం సిబ్బంది సంఖ్య 2,11,178కి పరిమితమైంది. అంతకుముందు ఏడాది మార్చి ముగింపు నాటికి ఈ సంఖ్య 2,14,521గా ఉండేది.

క్లరికల్, లోయర్ లెవెల్ ఉద్యోగాలపైనే ప్రభావం

ఈ ఉద్యోగాల తగ్గింపు ప్రధానంగా నాన్-సూపర్‌వైజరీ, క్లరికల్, సబార్డినేట్ విభాగాల్లోనే ఎక్కువగా కనిపించింది. గత ఆర్థిక సంవత్సరంలో (FY25) ఈ విభాగాల్లో 1,70,950 మంది పనిచేస్తుండగా, 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఆ సంఖ్య 1,62,797కి పడిపోయింది. అంటే దాదాపు 8,153 క్లరికల్, సపోర్ట్ స్టాఫ్ పోస్టులు తగ్గాయి. బ్యాక్ ఆఫీస్, రోజువారీ నిర్వహణ పనులను టెక్నాలజీతో వేగవంతం చేయడం (స్ట్రీమ్‌లైన్) వల్లే ఈ మార్పు జరిగింది.

సాంకేతికతను తాము ఉద్యోగులను తొలగించడానికి కాకుండా, వారి పనితీరును మెరుగుపరచడానికే వాడుతున్నామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది. హెచ్ఆర్ డిజిటల్ సొల్యూషన్స్‌లో ఏఐ సాంకేతికతను జోడించడం ద్వారా అంతర్గత ప్రక్రియలను సులభతరం చేస్తున్నామని వెల్లడించింది.

టెక్నాలజీతో మార్పు తప్పనిసరి: సీఈఓ

బ్యాంక్ ఎదుగుతున్న క్రమంలో ఉద్యోగులు కూడా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సి ఉంటుందని మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశిధర్ జగదీశన్ స్పష్టం చేశారు.

సాధారణ ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పటికీ, మేనేజ్‌మెంట్ స్థాయి పోస్టుల సంఖ్య మాత్రం పెరగడం విశేషం. మిడిల్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఉద్యోగుల సంఖ్య 9,159 నుండి 10,411కి చేరింది. జూనియర్ మేనేజ్‌మెంట్ ఉద్యోగులు 34,165 నుండి 37,708కి పెరిగారు. అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య కూడా 247 నుండి 262కి పెరిగింది. నిర్ణయాలు తీసుకునే ఉన్నత స్థాయి ఉద్యోగాలకు డిమాండ్ స్థిరంగా ఉందనే విషయాన్ని ఈ గణాంకాలు చూపుతున్నాయి.

అంతర్జాతీయంగానూ ఇదే ట్రెండ్

కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో ఈ మార్పులు ఊపందుకున్నాయి. రోజువారీ సాధారణ పనులను ఆటోమేట్ చేస్తూ, కీలకమైన కస్టమర్ సేవల వైపు సిబ్బందిని మళ్లిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏఐ వల్ల కొన్ని సాధారణ ఉద్యోగాల అవసరం తగ్గుతుందని, అదే సమయంలో ఉత్పాదకత పెరుగుతుందని జేపీ మోర్గాన్ చేజ్, సిటీ గ్రూప్, స్టాండర్డ్ చార్టర్డ్ వంటి అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాల అధినేతలు ఇదివరకే హెచ్చరించారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe