HDFC Bank share price : 3 నెలల్లో 25శాతం పడిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్- ఇప్పుడు కొనొచ్చా?
HDFC Bank share price target : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 25శాతం మేర క్రాష్ అయ్యాయి. దీనికి కారణాలు ఏంటి? ఈ సంస్థ షేర్లను ఇప్పుడు కొనొచ్చా? నిపుణుల సూచనలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుతం వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. మార్చి 18, 2026న పార్ట్-టైమ్ చైర్మన్ అటాను చక్రవర్తి నైతిక, విలువల కారణాలను చూపుతూ ఆకస్మికంగా రాజీనామా చేయడంతో బ్యాంక్ షేర్లు గత కొన్ని వారాలుగా ఒత్తిడికి లోనవుతున్నాయి. అయితే, ఈ వివాదం అంతటితో ముగిసిపోలేదు. అదనపు టైర్-1 బాండ్లను తప్పుదోవ పట్టించేలా విక్రయించారనే ఆరోపణలపై మరో 12 మంది ఉన్నతాధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న వార్తలు ఇన్వెస్టర్లలో మరింత ఆందోళన కలిగించాయి.

అసలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఏం జరుగుతోంది?
బ్యాంక్ షేర్ల పనితీరుపై సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్, 'లైవ్‌లాంగ్ వెల్త్' వ్యవస్థాపకుడు హరిప్రసాద్ కె స్పందిస్తూ.. ఇది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మౌలిక సామర్థ్యం తగ్గడం వల్ల వచ్చిన సమస్య కాదని పేర్కొన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ విలీనం తర్వాత బ్యాంక్ ప్రస్తుతం ఒక ‘రీసెట్ ఫేజ్’లో ఉందని ఆయన వివరించారు. దూకుడుగా రుణాలను పెంచడం కంటే, బ్యాలెన్స్ షీట్‌ను క్రమబద్ధీకరించుకోవడానికి బ్యాంక్ ప్రాధాన్యత ఇస్తోంది. దీనివల్ల క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి పెరగడం, మార్జిన్లపై ఒత్తిడి రావడం వంటి కారణాలతో తాత్కాలికంగా లాభదాయకత తగ్గింది.
దీనికి తోడు, అకస్మాత్తుగా నాయకత్వం నుంచి ఒకరు వైదొలగడం సంస్థాగత ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కొంత దెబ్బతీసింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు, కరెన్సీ ఒత్తిడి, విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) నిధులను వెనక్కి తీసుకోవడం వంటి అంశాలు కూడా లార్జ్-క్యాప్ ఫైనాన్షియల్ షేర్లపై ప్రభావం చూపుతున్నాయి.
ఇన్వెస్టర్లకు ఇదొక ‘గోల్డెన్ ఛాన్స్’?
'బసవ్ క్యాపిటల్' కో-ఫౌండర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాజీ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ సందీప్ పాండే ప్రకారం.. ఒక పార్ట్-టైమ్ చైర్మన్ రాజీనామా చేసినంత మాత్రాన హెచ్‌డీఎఫ్‌సీ వంటి బలమైన సంస్థల పునాదులు మారవు. "ఆర్థిక కోణంలో చూస్తే ఏటీ-1 బాండ్ల వివాదం చాలా చిన్నది. ఇది బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌పై పెద్దగా ప్రభావం చూపదు. నిజానికి, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు తక్కువ ధరలో లభించడం అనేది దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు దొరికిన ఒక గొప్ప అవకాశం," అని ఆయన అభిప్రాయపడ్డారు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ ప్రైజ్ హిస్టరీ..
గురువారం ట్రేడింగ్ సెషన్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 751 వద్ద స్థిరపడింది. ఈ స్టాక్ ఐదురోజుల్లో 1.7శాతం, నెలరోజుల్లో 13.8శాతం మేర పతనమైంది. ఇక ఆరు నెలల్లో 22.85శాతం నష్టపోయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు.. ఈ ఏడాది ఇప్పటివరకు 24.5శాతం మేర డౌన్ అయ్యాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టార్గెట్ ఎంత?
టెక్నికల్ ఎనాలసిస్ ప్రకారం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు ప్రస్తుతం రూ. 740 నుంచి రూ. 750 వద్ద స్థిరపడటానికి ప్రయత్నిస్తున్నాయి. ఒకవేళ ఈ సపోర్ట్ గనుక విఫలమైతే, షేరు ధర రూ. 680 వరకు పడిపోయే ప్రమాదం ఉంది. అయితే సానుకూల పవనాలు వీస్తే షేరు ధర రూ. 800 నుంచి రూ. 820 రెసిస్టెన్స్‌ని తాకే అవకాశం ఉంది.
ఆర్థికంగా బలంగానే.. తాజా గణాంకాలు ఇవే..
శుక్రవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో బ్యాంక్ తన తాజా ఆర్థిక వివరాలను వెల్లడించింది:
అడ్వాన్సులు: మార్చి 2026 త్రైమాసికంలో సగటు అడ్వాన్సులు రూ. 29,644 బిలియన్లుగా నమోదయ్యాయి. ఇది గత ఏడాది మార్చి (రూ. 26,955 బిలియన్లు) తో పోలిస్తే 10.0% వృద్ధి.
డిపాజిట్లు: సగటు డిపాజిట్లు రూ. 28,511 బిలియన్లకు చేరుకున్నాయి (గత ఏడాది కంటే 12.8% పెరుగుదల).
కాసా డిపాజిట్లు: ఇవి ₹9,184 బిలియన్లుగా నమోదై, ఏడాది ప్రాతిపదికన 10.8% వృద్ధిని కనబరిచాయి.
ఈ గణాంకాలను బట్టి చూస్తే, వివాదాలు ఉన్నప్పటికీ బ్యాంక్ వ్యాపార వృద్ధి మాత్రం ఆశాజనకంగానే ఉందని స్పష్టమవుతోంది.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


