హైదరాబాద్ రోడ్లకు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థల పేర్లు - సీఎం రేవంత్ కొత్త ఆలోచన...!

హైదరాబాద్ లోని ముఖ్యమైన రోడ్లపై నేతల పేర్లు కాకుండా గూగుల్, మెట్, టీసీఎస్ వంటి ప్రముఖ సంస్థల పేర్లు పెట్టే అవకాశం ఉంది. ఇదే విషయంపై ఆలోచన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో జరిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడారు.

Published on: Nov 13, 2025, 17:02:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా ఉంటుందన్నారు. దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత, వేగవంతమైన వృద్ధి రేటుతో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.

యూఎస్ - ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో సీఎం రేవంత్
యూఎస్ - ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో సీఎం రేవంత్

ఢిల్లీలో జరిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు–భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు (US-India Strategic Partnership Forum ) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణలో గత 35 ఏళ్లుగా కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు ప్రభుత్వాలకు సారథ్యం వహించినా, పెట్టుబడులకు మరియు పెట్టుబడిదారులకు అందరూ మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు.

భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ప్రధాన ద్వారం అని సీఎం రేవంత్ తెలిపారు. జీసీసీలకు (GCCs) గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. మహిళా సాధికారిత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, పట్టణాభివృద్ధితో పాటు మెరుగైన వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే తన ప్రథమ ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

గత 23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించారు. అద్భుతమైన మౌలిక వసతులతో 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ భారత్‌లోనే అత్యాధునిక నగరంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. మూసీ నది పునరుజ్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయ్, సియోల్ రివర్‌ఫ్రంట్‌ల మాదిరిగా హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని అన్నారు.

ట్రెండ్ మారుస్తాం - సీఎం రేవంత్

డ్రైపోర్ట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ORR–RRR మధ్య మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. చైనా ప్లస్ వన్ మోడల్‌కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. భారతదేశంలో రోడ్లకు ఎక్కువగా నేతల పేర్లు ఉంటాయని, హైదరాబాద్‌లో ఆ ట్రెండ్‌ను మార్చాలని తాము అనుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థల పేర్లను ఇవ్వాలన్న ఆలోచన ఉందని వ్యాఖ్యానించారు.

సదస్సు ప్రారంభంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ప్రదర్శించారు.దీనిపై టెక్ దిగ్గజం సిస్కో మాజీ సీఈఓ జాన్ ఛాంబర్స్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ పారదర్శకంగా, సాహసోపేతంగా, సాధించదగినదిగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలు, భవిష్యత్ ప్రాజెక్టులు, వాటి సామాజిక ప్రభావం ఎంతో ప్రేరణాత్మకంగా ఉన్నాయని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు USISPF సభ్యులలో అత్యధికులు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు హాజరవుతారని, తెలంగాణ విజన్‌ను దగ్గరగా తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నామని USISPF అధ్యక్షుడు డాక్టర్ ముఖేష్ ఆఘీ తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More