IMD rain alert : ఇక దేశవ్యాప్తంగా భారీ వర్షాలు- అసోంలో వరద బీభత్సం! 47మంది మృతి..

Today rain : భారత్‌లో నైరుతి రుతుపవనాలు తీవ్రరూపం దాల్చాయి. గుజరాత్, మహారాష్ట్రల్లో అత్యంత భారీ వర్షాలు, ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు అసోం వరదల్లో మృతుల సంఖ్య 47కి చేరింది. వాతావరణ హెచ్చరికలకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 24, 2026, 13:35:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ఉధృతి తీవ్రస్థాయికి చేరింది. రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల పాటు వాయవ్య, మధ్య భారతదేశంతో పాటు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది. పశ్చిమ భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ వర్షపాతం నమోదు కావచ్చని, ఆకస్మిక వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

దేశవ్యాప్తంగా ఇక భారీ వర్షాలు! (AFP)
దేశవ్యాప్తంగా ఇక భారీ వర్షాలు! (AFP)

అయితే, దక్షిణాదిలోని ద్వీపకల్ప ప్రాంతాల్లో రాబోయే వారం రోజుల పాటు వర్షాల తీవ్రత తక్కువగానే ఉండవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

గుజరాత్‌కు రెడ్ అలర్ట్.. ఉత్తరాదిలో జల్లుల హోరు!

వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, గుజరాత్ పరిసర ప్రాంతాలు, ఆగ్నేయ రాజస్థాన్, మధ్య మహారాష్ట్రల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్‌లలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది.

పంజాబ్, హరియాణా, దేశ రాజధాని దిల్లీ, తూర్పు ఉత్తరప్రదేశ్‌లలో వర్షాల తీవ్రత పెరగనుంది.

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, విదర్భ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవులలో రాబోయే వారమంతా వర్షాలు ఉంటాయని అధికారులు వివరించారు.

అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు పడనున్నాయి.

ముంబై, గుజరాత్ జిల్లాలకు 'ఆకస్మిక వరద' హెచ్చరిక!

వర్షపాతం తీవ్రత దృష్ట్యా గుజరాత్, కొంకణ్-గోవా, మధ్య మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వచ్చే 24 గంటల్లో మోస్తరు నుంచి తీవ్రమైన ఆకస్మిక వరదల ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

వరద ముప్పు ఉన్న ప్రధాన ప్రాంతాలు:

మహారాష్ట్ర: ముంబై సిటీ, ముంబై సబర్బన్, ఠాణే, పాల్ఘర్, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్, నాసిక్, పుణే, సతారా, కొల్హాపూర్, అహిల్యనగర్, ధూలే, జలగావ్, నందూర్బార్.

గుజరాత్: అహ్మదాబాద్, సూరత్, వడోదర, భరూచ్, వల్సాద్ సహా డజనుకు పైగా జిల్లాలు.

మధ్యప్రదేశ్: ధార్, ఝాబువా, అలీరాజ్‌పూర్, బర్వానీ జిల్లాలు.

ఇప్పటికే నేల పూర్తిగా తడిసిపోవడంతో పాటు లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దక్షణ గుజరాత్, మధ్య మహారాష్ట్రలలో ఇటీవల 30 సెంటీమీటర్లకు పైగా అసాధారణ వర్షపాతం నమోదు కావడమే దీనికి ప్రధాన కారణం.

అసోంలో దారుణం: 47కి చేరిన మృతుల సంఖ్య!

మరోవైపు, అసోం రాష్ట్రంలో వరద పరిస్థితి అత్యంత విషాదకరంగా మారింది. శివసాగర్, చరాయ్‌దేవ్ జిల్లాల్లో మరో ఆరుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 47కు చేరింది.

ఇంకా 70 నుంచి 80 మంది వరకు గల్లంతయ్యారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏఎస్​డీఎంఏ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం:

13 జిల్లాల్లోని 37 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలో 7.21 లక్షల మందికి పైగా వరద ప్రభావానికి గురయ్యారు.

24,124 మంది బాధితులు ప్రభుత్వ పునరావాస కేంద్రాలలో తలదాచుకుంటున్నారు.

సుమారు 3.71 లక్షల పెంపుడు జంతువులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, అనేక జీవాలు కొట్టుకుపోయాయి.

25,375 హెక్టార్లలో పండిన పంట పొలాలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More