Honda bikes: క్రేజీ.. ఇండియాలో ఒకేసారి 10 మోడల్స్‌ని పరిచయం చేసిన హోండా! ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా..
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మార్కెట్లోకి ఒకేసారి 10 కొత్త ద్విచక్ర వాహనాలను ఆవిష్కరించింది. ఇందులో 7 పూర్తి కొత్త మోడళ్లు కాగా, 3 కొత్త రంగుల్లో రానున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
భారత టూవీలర్ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు జపాన్ దిగ్గజం హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. శుక్రవారం నాడు ఒకే వేదికపై ఏకంగా 10 కొత్త ద్విచక్ర వాహనాలను ఆవిష్కరించి ఆటోమొబైల్ రంగాన్ని ఆశ్చర్యపరిచింది. వీటిని త్వరలోనే దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

హోండాకు చెందిన ఈ 10 వాహనాల్లో 7 మోడళ్లు పూర్తి కొత్తవి కాగా, మిగిలిన 3 మోడళ్లు సరికొత్త కలర్ ఆప్షన్లతో రీఫ్రెష్డ్ వెర్షన్లుగా రానున్నాయి. అడ్వెంచర్ టూరర్లు, క్రూయిజర్లు, రోడ్‌స్టర్లు, మాక్సీ స్కూటర్లు, అలాగే ఈవీ మోడల్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. పర్యావరణ రక్షణను దృష్టిలో ఉంచుకుని కొత్త పెట్రోల్ మోడళ్లను ఈ85 ఎథనాల్ బ్లెండెడ్ ఇంధనంతో నడిచే 'ఫ్లెక్స్-ఫ్యూయెల్' ఇంజన్లతో తీసుకొస్తుండటం విశేషం.
హోండా ఆవిష్కరించిన ఆ 10 మోడళ్ల ప్రత్యేకతలు ఇవే..
1. హోండా ఏడీవీ 160..
ఈ హోండా ఏడీవీ 160 అర్బన్ అడ్వెంచర్ మాక్సీ-స్కూటర్. నగర ప్రయాణాలతో పాటు లాంగ్ రైడ్లకు అనువుగా ఉంటుంది. ఇందులో 160 సీసీ వాటర్-కూల్డ్ ఇంజన్ అమర్చారు. ఇది ఈ85 ఇంధనానికి సపోర్ట్ చేస్తుంది. ఈ సెగ్మెంట్లోనే అత్యధికంగా 8.1 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ, సీటు కింద 27 లీటర్ల భారీ స్టోరేజ్ స్పేస్ అందించడం దీని ప్రత్యేకత.
2. హోండా సీబీ 500..
రెట్రో డిజైన్, ఆధునిక సాంకేతికత కలయికతో వచ్చిన ఆకర్షణీయమైన రోడ్‌స్టర్ బైక్ ఇది. ప్రతిరోజూ సులభంగా వాడేందుకు అనువుగా దీనిని తీర్చిదిద్దారు. ఇందులో 501 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ విత్ ఆయిల్ కూలర్ ఇంజన్‌ను అందించారు. అలాయ్ వీల్, స్పోక్ ట్యూబ్‌లెస్, గ్రాఫిక్స్‌తో కూడిన స్పోక్ ట్యూబ్‌లెస్ అనే మూడు వేరియంట్లలో ఇది లభించనుంది.
3. హోండా సీబీ 350 సిరీస్..
క్లాసిక్ మోటార్ సైకిళ్లను ఇష్టపడే వారి కోసం హోండా తన సీబీ 350 సిరీస్‌ను సరికొత్త రంగుల్లో తీర్చిదిద్దింది. సీబీ350, సీబీ350సీ, సీబీ350ఆర్ఎస్ మోడళ్లు ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్లతో మరింత గ్రాండ్‌గా కనిపించనున్నాయి.
4. హోండా రెబెల్ 300..
ఎంట్రీ లెవల్ క్యాజువల్ క్రూయిజర్ ప్రియుల కోసం ఈ బైక్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో 286 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఈ మోడల్ స్టాండర్డ్ వేరియంట్‌తో పాటు రైడింగ్‌ను మరింత సులభతరం చేసే 'ఈ-క్లచ్' సాంకేతికత కలిగిన వేరియంట్‌లోనూ రానుంది.
5. హోండా రెబెల్ 500..
రెబెల్ 300 కంటే పై స్థాయిలో ఉండే లైఫ్‌స్టైల్ క్రూయిజర్ ఇది. ఇందులో శక్తివంతమైన 471 సీసీ లిక్విడ్-కూల్డ్, ట్విన్-సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు. ఇది కూడా స్టాండర్డ్, ఈ-క్లచ్ వేరియంట్లలో లభించనుంది.
6. హోండా ఎక్స్ఆర్ 300ఎల్..
ఆఫ్-రోడ్ సవాళ్లను తట్టుకుంటూనే, ప్రతిరోజు రోడ్లపై సులభంగా నడిపేందుకు అనువుగా ఈ డ్యూయల్-పర్పస్ అడ్వెంచర్ మోటార్ సైకిల్‌ను రూపొందించారు. ఇందులో 293.5 సీసీ ఎయిర్-కూల్డ్ విత్ ఆయిల్ కూలర్ ఇంజన్ ఉంది. తక్కువ బరువు, తేలికైన హ్యాండ్లింగ్ దీని సొంతం.
7. హోండా ఎక్స్ఆర్ 300 రాలీ..
సుదీర్ఘ ప్రయాణాలు చేసే టూరర్ ప్రియుల కోసం దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఎలాంటి కఠినమైన రహదారులనైనా, ఆఫ్-రోడ్ ట్రాక్స్‌నైనా సునాయాసంగా దాటగలిగే సామర్థ్యం దీనికి ఉందనడంలో సందేహం లేదు.
8. హోండా క్యూసీ3 ఎలక్ట్రిక్ స్కూటర్..
కుటుంబ అవసరాల కోసం, రోజూ ఆఫీసులకు వెళ్లేవారి కోసం హోండా తీసుకొచ్చిన ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. ఇందులో 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 151 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. కేవలం 2 గంటల 40 నిమిషాల్లో 80% వరకు ఛార్జింగ్ అవుతుంది. సీటు కింద 32 లీటర్ల పెద్ద స్టోరేజ్, స్మార్ట్ కీ సదుపాయం, కనెక్టెడ్ ఫీచర్లతో కూడిన 5-అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే దీని ముఖ్య ఆకర్షణలు.
ఈ మోడళ్ల స్థానిక ఉత్పత్తి భారతదేశంలో తమ ప్రయాణంలో ఒక మైలురాయి లాంటిదని హోండా సంస్థ పేర్కొంది. ఈ కొత్త బైకులు, స్కూటర్ల విడుదల తేదీలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఈ ఆవిష్కరణ పూర్తయినందున త్వరలోనే షోరూమ్‌లలో కస్టమర్ల కొనుగోలుకు ఇవి అందుబాటులోకి రానున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


