Honor X80 Pro Max : 11000ఎంఏహెచ్ బ్యాటరీతో హానర్ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్- ధర కూడా తక్కువే!
Honor X80 pro max : హానర్ సంస్థ సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తూ చైనాలో 'హానర్ ఎక్స్80 ప్రో మాక్స్' స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో ఇప్పటివరకు లేని విధంగా 11,000ఎంఏహెచ్ బ్యాటరీ, 10,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ గల డిస్‌ప్లేను అందించడం విశేషం.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘హానర్’ గ్లోబల్ మార్కెట్లో తన దూకుడును పెంచింది. చైనా మార్కెట్లో 'హానర్ ఎక్స్70 ప్రో మాక్స్' విడుదల చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే, మరో పవర్‌ఫుల్ మోడల్‌ను రంగంలోకి దించింది. అత్యంత భారీ ఫీచర్లతో కూడిన ‘హానర్ ఎక్స్80 ప్రో మాక్స్’ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రధానంగా బ్యాటరీ బ్యాకప్, డిస్‌ప్లే క్వాలిటీ విషయంలో సరికొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తోంది. హానర్ మొబైల్స్ చరిత్రలోనే అత్యంత భారీ సామర్థ్యం గల 11,000ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో అమర్చడం గమనార్హం. దీనితో పాటు ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా ఏకంగా 10,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇచ్చే ఫ్లాట్ డిస్‌ప్లేను ఇందులో జోడించారు. ఈ మొబైల్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

హానర్ ఎక్స్80 ప్రో మాక్స్- ధర, లభ్యత..
చైనా మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ వేరియంట్లను బట్టి విభిన్న ధరల్లో అందుబాటులోకి వచ్చింది.
8GB రామ్ + 128GB స్టోరేజ్ (బేస్ వేరియంట్): దీని ధర 1,999 యువాన్లు (మన కరెన్సీలో సుమారు రూ. 28,000)గా నిర్ణయించారు.
8GB రామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్: దీని ధర 2,199 యువాన్లు (సుమారు రూ. 31,000).
8GB రామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్: దీని ధర 2,499 యువాన్లు (సుమారు రూ. 35,000).
12GB రామ్ + 512GB స్టోరేజ్ (టాప్-ఎండ్ వేరియంట్): దీని ధర 2,799 యువాన్లు (సుమారు రూ. 39,000)గా ఉంది.
ఈ సరికొత్త ఎక్స్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ చైనాలో జూన్ 26 నుంచి హానర్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అమ్మకానికి రానుంది. ఈ ఫోన్‌ను లైట్నింగ్ రెడ్, మూన్‌లైట్ వైట్, మిస్టిక్ బ్లాక్, వైబ్రెంట్ ఆరెంజ్ వంటి ఆకర్షణీయమైన నాలుగు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.
హానర్ ఎక్స్80 ప్రో మాక్స్- అదిరిపోయే ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేసే ఈ హానర్ ఎక్స్80 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇందులో 6.8 ఇంచుల 1.5K (1,280×2,788 పిక్సెల్స్) ఎల్టీపీఎస్ అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 120హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, 3,840హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 1.07 బిలియన్ కలర్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. అంతేకాదు, మొబైల్ స్క్రీన్‌కు రక్షణగా అల్యూమినోసిలికేట్ గ్లాస్‌ను ఉపయోగించారు. నీటి వల్ల, ధూళి వల్ల ఫోన్ పాడవకుండా ఉండేందుకు ఈ ఫోన్‌కు ఐపీ68, ఐపీ69, ఐపీ69కే (IP68 + IP69 + IP69K) రేటింగ్‌లను ఇచ్చినట్లు కంపెనీ స్పష్టం చేసింది.
హానర్ ఎక్స్80 ప్రో మాక్స్- పవర్‌ఫుల్ ప్రాసెసర్, కెమెరా పర్ఫార్మెన్స్..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ సంస్థకు చెందిన ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 చిప్‌సెట్‌ను వాడారు. ఇందులో 2.6జీహెచ్‌జెడ్ క్లాక్ స్పీడ్‌తో పనిచేసే నాలుగు పర్ఫార్మెన్స్ కోర్లు, 2.0జీహెచ్‌జెడ్ స్పీడ్‌తో పనిచేసే నాలుగు ఎఫిషియెన్సీ కోర్లు ఉన్నాయి. గ్రాఫిక్స్ కోసం అడ్రినో 812 జీపీయూని అందించారు. యూజర్లు తమ అవసరాలకు తగినట్లుగా 12GB వరకు రామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఎంచుకోవచ్చు.
ఇక కెమెరా విభాగం విషయానికి వస్తే.. ఫోన్ వెనుక భాగంలో ఎఫ్/1.88 అపెర్చర్, ఓఐఎస్ (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరాను అమర్చారు. ఇది 10ఎక్స్ డిజిటల్ జూమ్ ఫీచర్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో ఎఫ్/2.0 అపెర్చర్‌తో కూడిన 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ ద్వారా యూజర్లు 4కే క్వాలిటీతో (30 ఎఫ్‌పీఎస్ వేగంతో) వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.
హానర్ ఎక్స్80 ప్రో మాక్స్- చార్జింగ్ ఫీచర్లు.. కనెక్టివిటీ..
ఈ హానర్ ఎక్స్80 ప్రో మ్యాక్స్ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీనే. ఇందులో అమర్చిన 11,000ఎంఏహెచ్ బ్యాటరీని వేగంగా చార్జ్ చేయడం కోసం 90డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు. దీనితో పాటు ఇతర పరికరాలను చార్జ్ చేసుకునేందుకు వీలుగా 27డబ్ల్యూ రివర్స్ వైర్డ్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.
కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 6.0, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, భారతీయ నావిగేషన్ సిస్టమ్ అయిన నావిక్ వంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు ఐఆర్ బ్లాస్టర్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి అన్ని ముఖ్యమైన సెన్సార్లను అందించారు. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఈ ఫోన్ కేవలం 8.08ఎంఎం మందం, సుమారు 203 గ్రాముల బరువు మాత్రమే ఉండటం విశేషం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


