పర్సనల్ లోన్ తీసుకునే ముందు కచ్చితంగా పరిగణించాల్సిన 5 అంశాలు..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు కచ్చితంగా పరిగణించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఫాలో అయితే మీ మీద ఆర్థిక భారం తగ్గుతుంది. ఆ అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశంలో పర్సనల్ లోన్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, సరైన రుణాన్ని ఎంచుకోవడం మీ ఆర్థిక పరిస్థితిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. రుణగ్రహీతలు.. వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, రుణగ్రహీత ప్రొఫైల్, కనీస అర్హత వంటి అనేక అంశాలను జాగ్రత్తగా పరిశీలించడం చాలా అవసరం. వివిధ లోన్ ఆప్షన్స్‌ని పోల్చి చూసేటప్పుడు మీరు ఖచ్చితంగా పరిగణించాల్సిన ఐదు కీలక అంశాలను ఇక్కడ తెలుసుకోండి.

పర్సనల్ లోన్- ఈ 5 విషయలు గుర్తుపెట్టుకోండి..
1. వడ్డీ రేటు, మొత్తం వ్యయం
పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు గణనీయంగా మారుతుంటాయి. ఇది ప్రధానంగా వ్యక్తి క్రెడిట్ స్కోరు, తిరిగి చెల్లించే సామర్థ్యం, గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించిన చరిత్ర వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
కేవలం ప్రధాన వడ్డీ రేట్లే కాకుండా, రుణగ్రహీతలు ప్రాసెసింగ్ ఫీజులు, ముందస్తు చెల్లింపు ఛార్జీలు, ఫోర్‌క్లోజర్ జరిమానాలు వంటి అనుబంధ ఛార్జీలను కూడా పరిగణించాలి. ఇవి రుణం తుది అసలు వ్యయాన్ని గణనీయంగా మారుస్తాయి.
2. ఫీజులు, హిడెన్ ఛార్జీలు
రుణదాతలు సాధారణంగా మొత్తం రుణ మొత్తంలో 0.5% నుంచి 5% వరకు ప్రాసెసింగ్ ఫీజుతో పాటు జీఎస్టీని వసూలు చేస్తారు.
మీరు నిర్ణీత గడువు కంటే ముందే పర్సనల్ లోన్ని తిరిగి చెల్లిస్తే, కొన్ని ఆర్థిక సంస్థలు 2% నుంచి 5% వరకు జరిమానాలను విధిస్తాయి.
పర్సనల్ లోన్ ఈఎంఐ చెల్లింపులు తప్పితే అదనపు ఫీజులు, చట్టపరమైన సమస్యలు, తీవ్ర పరిస్థితుల్లో బలవంతపు రికవరీ చర్యలు వంటి వాటితో మీ క్రెడిట్ స్కోరు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
3. రుణగ్రహీత ప్రొఫైల్, అర్హత
మంచి క్రెడిట్ హిస్టరీ, 750 కంటే ఎక్కువ అధిక క్రెడిట్ స్కోరు ఉంటే, మీకు మెరుగైన వడ్డీ రేట్లు లభించే అవకాశాలు పెరుగుతాయి.
రుణదాతలు దరఖాస్తుదారుల రుణానికి-ఆదాయ నిష్పత్తిని విశ్లేషిస్తారు. సాధారణంగా, 35% లేదా అంతకంటే తక్కువ డీటీఐ ఉన్న దరఖాస్తులు సులభంగా ఆమోదం పొందే అవకాశం ఉంది.
జీతం పొందే ఉద్యోగులు లేదా స్థిరమైన పని రికార్డు ఉన్నవారికి సాధారణంగా అనుకూలమైన నిబంధనలు లభిస్తాయి.
4. రుణ మొత్తం, టెన్యూర్
ఎక్కువ కాలవ్యవధి ఉంటే ఈఎంఐ తగ్గుతుంది, కానీ మొత్తం వడ్డీ చెల్లింపు పెరుగుతుంది. అదే తక్కువ కాలవ్యవధి అయితే నెలవారీ చెల్లింపు పెరుగుతుంది, కానీ మొత్తం వ్యయం తగ్గుతుంది.
ఎక్కువ రుణ మొత్తాలకు రుణదాతల విధానాలు, రిస్క్ అంచనా ఆధారంగా వడ్డీ రేట్లలో కొంత వ్యత్యాసం ఉండవచ్చు.
5. ముందస్తు చెల్లింపులు, సౌలభ్యం, రుణదాతతో సంబంధం
ముందస్తు చెల్లింపు గురించి మీ రుణదాతతో ముందుగా స్పష్టంగా చర్చించండి. పాక్షికంగా లేదా పూర్తిగా ముందస్తు చెల్లింపుకు అనుమతి ఉందో లేదో తనిఖీ చేయండి. మొత్తం వ్యయంపై స్పష్టమైన అవగాహన కోసం దానితో అనుబంధించిన ఫీజులను కూడా తెలుసుకోండి.
మీకు ఏదైనా ఆర్థిక సంస్థలో పొదుపు ఖాతా లేదా జీతం ఖాతా ఉంటే, మీరు వారిని సంప్రదించి, మెరుగైన నిబంధనలు, షరతుల కోసం చర్చలు జరపవచ్చు.
ఫోర్‌క్లోజర్ నిబంధనలు: రుణాన్ని త్వరగా చెల్లించాలనుకుంటే, ఎటువంటి అధిక ఛార్జీలు లేకుండా మొత్తం రుణాన్ని పూర్తిగా మూసివేయవచ్చో లేదో తెలుసుకోవడానికి మీ రుణదాతను సంప్రదించండి.
పర్సనల్ లోన్‌తో ముడిపడి ఉన్న నష్టాలు ఏమిటి?
అన్ని పర్సనల్ లోన్సలో కొన్ని అంతర్గత నష్టాలు ఉంటాయి. అవి: అధిక వడ్డీ రేట్లు, అప్పుల ఉచ్చులో పడే ప్రమాదం, క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం, దాగి ఉన్న ఛార్జీలు, సులభంగా ఆమోదం లభిస్తున్నందున అవసరానికి మించి అప్పు తీసుకునే అవకాశం. రుణగ్రహీతలు ఈ నష్టాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధృవీకరించిన ఆర్థిక సలహాదారుని సంప్రదించిన తర్వాత సరైన శ్రద్ధ వహించాలి.
చివరిగా.., వివిధ వ్యక్తిగత రుణ ఆఫర్‌లను పోల్చడం అనేది కేవలం అతి తక్కువ వడ్డీ రేట్లను కనుగొనడం మాత్రమే కాదు. వాస్తవానికి, ఇది రుణ మొత్తం వ్యయం, మీ ఆర్థిక ప్రొఫైల్, మొత్తం రుణ నిర్మాణం మీ తిరిగి చెల్లించే సామర్థ్యంతో ఎలా సరిపోతుందో అనే అంశాలను అర్థం చేసుకోవడం. ఈ ఐదు ముఖ్యమైన అంశాలను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా, దేశంలోని రుణగ్రహీతలు మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలరు.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. పర్సనల్ లోన్ తీసుకోవడం రిస్కీ అని గుర్తుపెట్టుకోండి.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


