...
...
Next Story

Car buying guide : కొత్త కారు డెలివరీ తీసుకుంటున్నారా? ఈ చెక్‌లిస్ట్ పాటించకపోతే నష్టపోవడం ఖాయం!

Car delivery tips : కారు కొనడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక తీపి జ్ఞాపకం. అయితే, షోరూమ్ నుంచి కారును బయటకు తీసే తొందరలో చాలామంది ‘ప్రీ-డెలివరీ ఇన్‌స్పెక్షన్’ అనే కీలకమైన ప్రక్రియను విస్మరిస్తుంటారు. అది సరైనది కాదు. అందుక పీడీఐ వివరాలను ఇక్కడ తెలుసుకుని, మీ కారు డెలివరీ సమయంలో చెక్​ చేసుకోండి..

Published on: Apr 28, 2026, 09:58:23 IST
Advertisement

New Car Delivery Checking tips : లక్షల రూపాయలు వెచ్చించి కొనే కారు పక్కాగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అయితే కారును డెలివరీ తీసుకునే ముందు కొన్ని రకాల చెకింగ్స్​ చేయడం ఉత్తమం. వాటినే ప్రీ-డెలివరీ ఇన్​స్పెక్షన్ (పీడీఐ) అని అంటారు. పెయింట్‌లో గీతలు ఉన్నాయా? ఎలక్ట్రికల్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తోందా? లేదా ఏదైనా మెకానికల్ సమస్య ఉందా? అని తనిఖీ చేయడం ఇందులో భాగం. కారు రిజిస్ట్రేషన్ కాకముందే కస్టమర్ ఈ తనిఖీలో పాల్గొనడం అత్యంత ముఖ్యం.

ఎక్స్‌టీరియర్ చెకింగ్: వెలుతురులో చూడండి..

కారు డెలివరీ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి.. (AI Generated Image)
కారు డెలివరీ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి.. (AI Generated Image)

కారును ఎప్పుడూ మంచి వెలుతురు ఉన్న చోట పార్క్ చేయించి తనిఖీ చేయాలి.

బాడీ అండ్ పెయింట్: కారు చుట్టూ తిరుగుతూ స్క్రాచ్‌లు, డెంట్‌లు లేదా పెయింట్ తేడాలు ఉన్నాయో లేదో చూడండి. డోర్లు, బోనెట్, డిక్కీ సరిగ్గా తెరుచుకుంటున్నాయో, మూతపడుతున్నాయో చెక్ చేయండి.

లైట్లు అండ్ గ్లాస్: హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్‌లు, ఇండికేటర్లు, ఫాగ్ ల్యాంప్స్‌ను టెస్ట్ చేయండి. విండ్‌షీల్డ్ లేదా విండో గ్లాసులపై ఏవైనా పగుళ్లు ఉన్నాయో లేదో గమనించండి.

టయర్లు: స్పేర్ టయర్‌తో సహా అన్ని టయర్లు కొత్తవిగా ఉన్నాయా? ట్రెడ్ డెప్త్ సరిగ్గా ఉందా? అని చూడండి. జాక్, టూల్‌కిట్ వంటివి డిక్కీలో ఉన్నాయో లేదో సరిచూసుకోండి.

ఇంటీరియర్ చెకింగ్: సౌకర్యం ముఖ్యం

క్యాబిన్ లోపల ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి.

డ్యాష్‌బోర్డ్ అండ్ సీట్లు: డ్యాష్‌బోర్డ్ మెటీరియల్‌పై గీతలు లేకుండా చూడండి. సీట్ కవర్లు, మ్యాట్‌లపై ఎలాంటి మరకలు లేదా చిరుగులు ఉండకూడదు. మ్యాట్‌ల కింద నీటి తేమ ఉందేమో చెక్ చేయండి (ఇది లీకేజీని సూచిస్తుంది).

ఫీచర్లు: ఏసీ కూలింగ్ సరిగ్గా ఉందా? పవర్ విండోస్ సాఫీగా పనిచేస్తున్నాయా? స్టీరింగ్ తిప్పినప్పుడు ఏవైనా శబ్దాలు వస్తున్నాయా? అని గమనించండి.

ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్పీకర్లు, ఛార్జింగ్ పోర్ట్‌లు, వైర్‌లెస్ ఛార్జర్, హారన్, వైపర్లను తనిఖీ చేయండి. బోనెట్ తెరిచి బ్యాటరీ టెర్మినల్స్ వద్ద తుప్పు పట్టకుండా చూసుకోండి. అలాగే ఇంజిన్ ఆయిల్, కూలెంట్, బ్రేక్ ఫ్లూయిడ్, పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్, విండ్‌షీల్డ్ వాషర్ ఫ్లూయిడ్ తగినంత స్థాయిలో ఉన్నాయో లేదో డీలర్ సమక్షంలో చెక్ చేయండి.

డాక్యుమెంటేషన్ చెకింగ్: కాగితాలు పక్కాగా ఉండాలి

కారుతో పాటు ఈ కింది పత్రాలను నిశితంగా పరిశీలించండి:

ఇన్వాయిస్‌లో ఛాసిస్ నంబర్, ఇంజిన్ నంబర్ కారుపై ఉన్న నంబర్లతో మ్యాచ్ అవ్వాలి.

ఆర్‌టీఓ పత్రాలు, బీమా పాలసీ, పేమెంట్ రశీదులు.

వారంటీ సర్టిఫికేట్, ఓనర్స్ మాన్యువల్, సర్వీస్ బుక్‌లెట్, పొల్యూషన్ సర్టిఫికేట్ (పీయూసీ).

టెస్ట్ డ్రైవ్ చేయడం మర్చిపోవద్దు..

అన్నీ చూసిన తర్వాత డీలర్‌షిప్ ఎగ్జిక్యూటివ్‌తో కలిసి చిన్న టెస్ట్ డ్రైవ్ చేయండి. గేర్‌బాక్స్ పనితీరు, బ్రేకింగ్, సస్పెన్షన్, కారు నడుపుతున్నప్పుడు వచ్చే శబ్దాలను గమనించండి. ఏవైనా లోపాలు కనిపిస్తే వెంటనే డీలర్ దృష్టికి తీసుకెళ్లి, అవి సరిచేసిన తర్వాతే సంతకం చేయండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks