...
...
Next Story

UAN Number Recovery : యూఏఎన్ నంబర్​ మర్చిపోయారా? ఇలా రికవర్ చేసుకోండి..

పీఎఫ్ ఖాతాదారులకు యూఏఎన్ నంబర్ ఎంతో కీలకం. ఒకవేళ మీరు మీ యూఏఎన్ మర్చిపోతే.. ఈపీఎఫ్‌ఓ పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా ఆధార్, పాన్ నంబర్లతో సులభంగా ఎలా రికవర్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jul 24, 2026, 09:10:27 IST
Advertisement

ఉద్యోగస్థులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసానిచ్చే అత్యంత ప్రజాదరణ పొందిన పొదుపు పథకాల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఒకటి. రోజూవారీ జీవితంలో ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాతో పెద్దగా పనిలేకపోయినా.. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నా, కొత్త కంపెనీకి పీఎఫ్ అకౌంట్ బదిలీ చేయాలన్నా, కేవైసీ వివరాలు నవీకరించాలన్నా లేదా విత్‌డ్రా క్లెయిమ్ చేయాలన్నా 'యూఏఎన్' నంబర్ తప్పనిసరి.

UAN తిరిగి పొందడం ఎలా?
UAN తిరిగి పొందడం ఎలా?

ఒకవేళ మీరు మీ యూఏఎన్ నంబర్‌ను మర్చిపోయినా లేదా పొరపాటున ఎక్కడైనా పోగొట్టుకున్నా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్​ఓ) తన అధికారిక మెంబర్ పోర్టల్, ఉమాంగ్ మొబైల్ యాప్ ద్వారా ఆధార్, పాన్ లేదా పీఎఫ్ మెంబర్ ఐడీ ఉపయోగించి యూఏఎన్ నంబర్‌ను తిరిగి పొందే సదుపాయాన్ని కల్పిస్తోంది.

అసలు యూఏఎన్ నంబర్ అంటే ఏంటి?

యూఏఎన్ అంటే.. 'యూనివర్సల్ అకౌంట్ నంబర్'. ఇది ఈపీఎఫ్‌ఓ ద్వారా ప్రతి ఉద్యోగికి కేటాయించే ప్రత్యేకమైన 12 అంకెల సంఖ్య. ఒక ఉద్యోగి తన కెరీర్‌లో ఎన్ని ఉద్యోగాలు మారినా, కంపెనీలు మారినా ఈ యూఏఎన్ నంబర్ మాత్రం మారదు, జీవితాంతం ఒకటే ఉంటుంది.

మీరు కొత్త ఉద్యోగంలో చేరిన ప్రతిసారీ సదరు యాజమాన్యం కొత్త పీఎఫ్ అకౌంట్‌ను క్రియేట్ చేస్తుంది. కానీ ఆ పీఎఫ్ ఖాతాలన్నీ మీ పాత యూఏఎన్ నంబర్‌కే అనుసంధానమవుతాయి. దీనివల్ల మీ పీఎఫ్ పొదుపు మొత్తాన్ని ఒకే గొడుగు కింద సులభంగా నిర్వహించుకోవచ్చు.

ఈపీఎఫ్‌ఓ పోర్టల్ ద్వారా యూఏఎన్ తిరిగి పొందడం ఎలా?

మీ పీఎఫ్ ఖాతాతో మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే, కేవలం కొన్ని సులభమైన దశల్లో మీ యూఏఎన్ తెలుసుకోవచ్చు:

మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, స్క్రీన్‌పై ఉన్న క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.

మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయాలి.

ఆ తర్వాత మీ పీఎఫ్ ఖాతాకు అనుసంధానమై ఉన్న వివరాలలో ఏదో ఒకదానిని (పాన్, ఆధార్ లేదా పీఎఫ్ మెంబర్ ఐడీ) ఎంచుకుని వివరాలు అందించాలి.

వివరాలు సరిపోయిన తర్వాత, మీ యూఏఎన్ నంబర్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. అంతేకాకుండా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా పంపడం జరుగుతుంది.

ఉమాంగ్ యాప్ ద్వారా పాత పీఎఫ్ నంబర్‌తో యూఏఎన్ రికవర్ చేయడం ఎలా?

మీకు ఆధార్, పాన్ వివరాలు గుర్తులేక, కేవలం పాత పీఎఫ్ నంబర్ మాత్రమే గుర్తుంటే.. ఉమాంగ్ యాప్ ద్వారా కూడా యూఏఎన్ రికవర్ చేసుకోవచ్చు:

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉమాంగ్ యాప్ ఓపెన్ చేసి ఈపీఎఫ్​ఓ అని సెర్చ్ చేయాలి.

Employee Centric Services విభాగంలోకి వెళ్లి, “Know Your UAN” పై ట్యాప్ చేయాలి.

మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా నమోదు చేసి, వచ్చిన ఓటీపీతో ప్రాసెస్ పూర్తి చేయాలి.

ఐడెంటిఫికేషన్ స్క్రీన్‌పై Member ID ని ఎంచుకోవాలి.

మీ పాత పీఎఫ్ నంబర్ (మెంబర్ ఐడీ), ఈపీఎఫ్‌ఓ రికార్డుల్లో ఉన్న విధంగా మీ పేరు, పుట్టిన తేదీ వివరాలను సరిగ్గా నమోదు చేయాలి.

చివరిగా Show My UAN పై క్లిక్ చేయాలి.

మీ యూఏఎన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది, మీ మొబైల్ నంబర్‌కు సందేశం రూపంలో వస్తుంది.

అయితే, ఈ రెండు విధానాల్లోనూ ఓటీపీ ఆధారిత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి, ఈపీఎఫ్‌ఓ రికార్డుల్లో మీ ప్రస్తుత మొబైల్ నంబర్ అప్‌డేట్ అయి ఉండటం అత్యంత ఆవశ్యకం.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe