పిల్లల చేతుల్లో పెనుభూతం: సైబర్ ప్రపంచంలో చిన్నారులపై పెరుగుతున్న నేరాలను ఎలా ఎదుర్కోవాలి?
ఇల్లు, పరిసర ప్రాంతాలు, బడి, ప్రయాణం వంటి ప్రదేశాల్లో మన పిల్లలకు ముప్పు వాటిల్లకుండా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాం. అయితే గత దశాబ్దంగా పిల్లలకు ఒక కొత్త ప్రమాద ప్రదేశం చాలా వేగంగా విస్తరిస్తోంది. అదే సైబర్‌స్పేస్. దీనిపై సీఆర్‌వై సంస్థ సౌత్ రీజియన్ రీజనల్ డైరెక్టర్ జాన్ రాబర్ట్స్ విశ్లేషణ.
మన సమాజంలో పిల్లల భద్రత గురించి ఆందోళనలు సాధారణంగా పిల్లలు తిరుగాడే భౌతిక ప్రదేశాల చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. అయితే ఇప్పుడు సైబర్ స్పేస్ రూపంలో ప్రమాదం పొంచి ఉంది.

ఈ ఆందోళనకరమైన ధోరణి అధికారిక గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) 2017 నుంచి ‘పిల్లలపై సైబర్ నేరాలు’ అనే ప్రత్యేక విభాగం కింద క్రోడీకరిస్తోంది. ఆ సమాచారాన్ని చైల్డ్ రైట్స్ అండ్ యు (సీఆర్‌వై) సంస్థ విశ్లేషించగా.. దేశవ్యాప్తంగా ఈ నేరాలు 2017 నుంచి 2024 మధ్య ఎనిమిదేళ్లలో దాదాపు ఇరవై రెట్లు పెరిగాయని తేలింది.
పిల్లలపై సైబర్ నేరాలు 2017లో కేవలం 88 కేసులు నమోదు కాగా.. అవి ఏటేటా పెరుగుతూ 2023 నాటికి 1902కు చేరాయి. అయితే ఆ మరుసటి ఏడాది.. అంటే 2024లో ఈ కేసుల సంఖ్య 1753కు తగ్గింది. 2024లో ఈ నేరాల సంఖ్య 2023 కంటే తగ్గినప్పటికే.. 2017 సంఖ్యతో పోలిస్తే ఇంకా 20 రెట్లు ఎక్కువే. దీనిని కేసులు తగ్గుముఖం పట్టాయని కాకుండా.. మొత్తంగా పెరుగుతున్న ధోరణిలో తాత్కాలిక హెచ్చుతగ్గులుగా చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఈ కేసుల సంఖ్య ఎలా ఉంటుందనేది పరిశీలించాలి.
సీఎస్ఏఎం కేసులదే సింహ భాగం...
పిల్లలపై సైబర్ నేరాల సంఖ్య కన్నా మరింత ఆందోళనకరమైన విషయం.. ఆ నేరాల స్వభావం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 67బి కిందకు వచ్చే ‘సైబర్ పోర్నోగ్రఫీ - పిల్లలను లైంగికంగా, అశ్లీలంగా చిత్రీకరించే చిత్రాలను ఆన్లైన్లో పెట్టటం, ప్రచురించటం’ కేసుల సంఖ్య – పిల్లలపై సైబర్ నేరాల కింద నమోదైన అన్ని కేసులలో 60 నుండి 80 శాతం వరకు ఉంది. అయితే ఈ కేసులను పోర్నోగ్రఫీ అని కాకుండా ‘పిల్లలపై లైంగిక వేధింపుల సామగ్రి (చైల్డ్ సెక్స్యువల్ అబ్యూజ్ మెటీరియల్ – సీఎస్ఏఎం) అని వర్ణించాలని సుప్రీంకోర్టు ఇటీవల నిర్దేశించింది.
ఈ సీఎస్ఏఎం కేసుల సంఖ్య 2017లో దేశవ్యాప్తంగా కేవలం 7 మాత్రమే ఉండగా.. 2024 నాటికి 1,099 కి పెరిగిపోయాయి. అంటే ఈ కేసులు ఎనిమిదేళ్లలో 157 రెట్లు పెరిగాయి. అంతేకాదు.. 2020 నుంచి 2024 వరకూ పిల్లలపై మొత్తం సైబర్ నేరాలలో సీఎస్ఏఎం కేసుల వాటా 60 నుంచి 80 శాతం మధ్య కొనసాగుతున్నాయి.
సైబర్ బెదిరింపులు, ఆన్లైన్లో వెంటబడటం, గేమింగ్‌కు సంబంధించిన బలవంతపు వసూళ్లు తదితర నేరాలు కూడా జరుగుతున్నా.. అవి ద్వితీయ స్థాయిలోనే ఉంటున్నాయి. చిన్నారుల లైంగిక దోపిడీ, వేధింపుల మెటీరియల్ ఉత్పత్తి, ప్రచురణ, ప్రసారం అతిపెద్ద సమస్యగా ఉంది.
ఈ విషయంలో లింగపరమైన గణాంకాలకు మరింత ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతం, సైబర్ నేరాలకు సంబంధించి వయసు, లింగం ఆధారంగా విభజించిన గణాంకాలను అధికారిక రికార్డులు ప్రచురించడం లేదు. పోక్సో చట్టం కింద నమోదైన ఆఫ్‌లైన్ పిల్లలపై లైంగిక హింస కేసుల్లో ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం.. చిన్నారులపై అత్యాచారం కేసుల్లో దాదాపు 99 శాతం బాధితులు బాలికలే. అయితే, అందుబాటులో ఉన్న సమాచారం.. పోక్సో నేరాలను, పిల్లలపై సైబర్ నేరాలను వేర్వేరుగా వర్గీకరిస్తోంది కానీ.. ఇవి రెండూ కలగలిసిన నేరాలు ఎంత మేరకు ఉన్నాయనే వివరాలు లేవు. దీనివల్ల బాలికలపై ఈ కేసుల భారాన్ని అంచనా వేయడం కష్టమవుతోంది.
దక్షిణాదిలో పిల్లలపై సైబర్ నేరాలు
అధిక అక్షరాస్యత, పటిష్టమైన పౌర మౌలిక సదుపాయాలు ఉండటం వల్ల సామాజిక సూచికల్లో సాపేక్షంగా భద్రమైన ప్రదేశమని పరిగణించే దక్షిణ భారతదేశం కూడా ఈ ధోరణికి మినహాయింపు కాదు. వాస్తవానికి.. కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలు పిల్లలపై సైబర్ నేరాల కేసుల్లో ఇప్పుడు దేశంలో అగ్రగామి రాష్ట్రాల సరసన నిలుస్తున్నాయి.
కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ – ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో కేసులు పెరుగుతూ వస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది. 2017లో ఈ ఐదు రాష్ట్రాలూ కలిపి పిల్లలపై సైబర్ నేరాల సంఖ్య కేవలం నాలుగు మాత్రమే ఉండగా... 2023 నాటికి అది 944కు పెరిగింది. ఆ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం 1,902 కేసులు నమోదవగా అందులో దాదాపు సగం కేసులు ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయి.
కర్ణాటకలో 2017లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ 2023 నాటికి ఏకంగా 363 కేసులకు పెరిగింది. అయితే.. 2024లో గణనీయంగా 96 కేసులకు తగ్గాయి. ఈ రాష్ట్రంలో సీఎస్ఏఎం సంబంధిత కేసులు 2017లో సున్నా గా ఉంటే.. 2023లో 341కు పెరిగాయి.
కేరళ కూడా అదే మార్గంలో నడిచింది. పిల్లలపై సైబర్ నేరాల సంఖ్య 2017లో సున్నా నుంచి 2023లో 443 కు పెరిగి, 2024లో 166 కు తగ్గింది. 2023లో కేరళలో 342 సీఎస్ఏఎం కేసులు నమోదయ్యాయి.
తమిళనాడులో ఈ కేసుల పెరుగుదల నెమ్మదిగా అయినా స్థిరంగా సాగింది. 2017లో మూడు కేసుల నుంచి 2024లో 52కు చేరింది. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఇదే అత్యధిక సంఖ్య.
తెలంగాణ కూడా 2017లో సున్నా కేసుల నుంచి 2024లో 72 కేసులకు పెరిగింది. ఈ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు ఇదే అత్యధిక సంఖ్య.
ఆంధ్రప్రదేశ్ 2017లో ఒక కేసు నుంచి 2022లో గరిష్టంగా 124 కేసులకు పెరిగింది. ఈ రాష్ట్రంలో 2024లో 55 కేసులు నమోదయ్యాయి.
ఈ ఐదు రాష్ట్రాల్లో ఉమ్మడిగా పిల్లలపై సైబర్ నేరాల సంఖ్య మొత్తం 2023లో 944 నుంచి 2024లో 441కు తగ్గింది. ఈ తగ్గుదల దేశవ్యాప్త కేసుల సంఖ్యలో (2023 లో 1902 నుంచి 2024లో 1753 కేసులకు తగ్గాయి) కూడా ప్రతిఫలిస్తోంది.
అయితే.. ఈ కేసుల తగ్గుదలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎన్సీఆర్బీ గణాంకాలు పోలీసులు నివేదించి నమోదు చేసిన కేసులను మాత్రమే ప్రతిబింబిస్తాయి. పిల్లలకు జరుగుతున్న ఆన్లైన్ హానిని అవి కచ్చితంగా నిర్ధారించలేవు.
పిల్లలపై సైబర్ నేరాల్లో అత్యధికంగా ఉన్న సీఎస్ఏఎం కేసులను పరిశీలిస్తే.. 2024లో కేరళ 90 కేసులతో దేశంలో నాలుగో స్థానంలో, కర్ణాటక 77 కేసులతో ఐదో స్థానంలో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ (38), తమిళనాడు (20) తొమ్మిది, పది స్థానాల్లో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ (265), రాజస్థాన్ (171), దిల్లీ (149) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
నగర స్థాయి గణాంకాలు మరిన్ని వివరాలను జోడిస్తున్నాయి. 2024లో బెంగళూరులో 23 సీఎస్ఏఎం కేసులు నమోదయ్యాయి. ఈ నగరం దిల్లీ (149 సీఎస్ఏఎం) తర్వాత దేశంలో రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లో ఒక కేసు నమోదవగా, చెన్నై, కొచ్చి నగరాల్లో ఒక్కటి కూడా నమోదు కాలేదు. నగరాల మధ్య ఈ వ్యత్యాసాలు.. అవగాహన, పోలీసు సామర్థ్యం, ఫిర్యాదు చేయడానికి కుటుంబాల సంసిద్ధత తదితర అంశాల్లో తేడాలను సూచించవచ్చు.
జటిల సమస్యలు...
ఎన్సీఆర్బీ గణాంకాలు పోలీసులు నమోదు చేసిన కేసులను మాత్రమే సూచిస్తాయి. సామాజిక కళంకమనే భయం, ఫిర్యాదు యంత్రాంగాలపై పిల్లల్లోనూ తల్లిదండ్రుల్లోనూ అవగాహన తగినంతగా లేకపోవడం, ఈ నేరాల సున్నితత్వం... ఇవన్నీ కేసులు నమోదు తక్కువగా ఉండడానికి దోహదం చేస్తుండవచ్చు. మహిళలపై నేరాల విషయంలో ఇలా జరుగుతుండవచ్చునని ఎన్సీఆర్బీ స్వయంగా అంగీకరించింది. పిల్లలకు సంబంధించిన కేసుల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశముంది.
చిన్నారులపై సైబర్ నేరాల ముప్పును రెండు మౌలిక అంశాలు జటిలం చేస్తున్నాయి. మొదటిది, భద్రతా మౌలిక సదుపాయాల కంటే వేగంగా సైబర్ స్పేస్ అందుబాటు పెరిగింది: వయో పరిమితి నిబంధనలు ఉన్న సామాజిక మాధ్యమ వేదికల్లో ప్రాథమిక పాఠశాల వయసు పిల్లలు కూడా క్రియాశీలంగా ఉన్నట్లు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ వేదికల్లోని వయసు నిర్ధారణ వ్యవస్థలు ఆచరణలో పని చేయడం లేదని ఇది రుజువు చేస్తోంది.
రెండోది, పిల్లలకు స్మార్ట్ ఫోన్లు చేరినంత విస్తృతితో వారికి డిజిటల్ అక్షరాస్యత అందటం లేదు: కౌమారదశలో ఉన్నవారిలో దాదాపు అందరికీ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉన్నప్పటికీ, దేశంలోని పాఠశాలల్లో మూడో వంతు కంటే తక్కువ మాత్రమే ప్రస్తుతం ఏదైనా అధికారిక డిజిటల్ అక్షరాస్యత లేదా ఆన్లైన్ భద్రతా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దీనివల్ల ఎక్కువ మంది పిల్లలు సరైన పర్యవేక్షణ, తగిన సంసిద్ధత లేకుండా ఆన్లైన్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.
చట్టాలు, చర్యలు బలంగా ఉన్నా...
పిల్లలపై సైబర్ నేరాల విషయంలో భారతదేశంలో చట్టపరమైన స్పందన బలోపేతమైంది. పోక్సో చట్టానికి 2019లో చేసిన సవరణలు చిన్నారులతో కూడిన అశ్లీల సామగ్రిని నిల్వచేయడం నేరంగా పరిగణిస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67బి అటువంటి సామగ్రిని ప్రసారం చేయడాన్ని లేదా వెతకడాన్ని శిక్షార్హం చేస్తోంది.
2024లో సుప్రీంకోర్టు, సీఎస్ఏఎంను వ్యక్తిగతంగా చూడటం లేదా కలిగి ఉండటం నేరమేనని స్పష్టంచేసింది. అలాగే నేరం స్వభావాన్ని మరింత ఖచ్చితంగా ప్రతిబింబించేలా అధికారిక పరిభాషను ‘బాలల అశ్లీలత’ నుంచి ‘బాలల లైంగిక దోపిడీ, వేధింపు సామగ్రి’ (సీఎస్ఈఏఎం)గా మార్చాలని సూచించింది.
మైనర్లను లక్ష్యంగా చేసుకున్న ప్రకటనలను డిజిటల్ పర్సనల్ డేటా పరిరక్షణ చట్టం – 2023 నియంత్రిస్తోంది. అటువంటి ప్రకటనలకు తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి అని, ఆ సమ్మతి కూడా వారు తెలిపారని నిర్ధారించగలగే ఉండాలని కూడా ఈ చట్టం నిర్దేశిస్తోంది.
సైబర్ భద్రతపై అవగాహన ఎంత?
కేంద్ర ప్రభుత్వ సంస్థలు సైబర్ భద్రతపై అవగాహనను, సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించడానికి పలు కార్యక్రమాలను చేపట్టాయి. సమాచార భద్రత విద్య, అవగాహన (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ - ఐఎస్ఈఏ) కార్యక్రమం ప్రజల్లో సైబర్ పరిశుభ్రతను ప్రోత్సహిస్తుంది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఇన్) పిల్లల ఆన్లైన్ భద్రతపై మార్గదర్శకాలతో సహా క్రమం తప్పకుండా భద్రతా సూచనలు జారీ చేస్తుంది.
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ రూపొందించిన ‘ప్రజ్ఞాత మార్గదర్శకాలు (2020)’ సురక్షిత ఆన్లైన్ అభ్యాసానికి ఒక విధానాన్ని అందిస్తున్నాయి. సీబీఎస్ఈ, ఎన్‌సీఈఆర్‌టీలు.. ఉపాధ్యాయ శిక్షణ, సైబర్ సెక్యూరిటీ హ్యాండ్‌బుక్, స్కూల్ సైబర్ క్లబ్‌లు, డిజిటల్ భద్రతపై పాఠ్యాంశాలతో ఈ వ్యవస్థను మరింత విస్తరించాయి. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా సైబర్ భద్రత, పిల్లల రక్షణపై మార్గదర్శకాలను రూపొందించింది.
దక్షిణాది రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి?
పోలీసు, శాంతిభద్రతలు రాష్ట్ర జాబితాలో ఉన్నందువల్ల.. నేరాల నివారణ, దర్యాప్తు, విచారణలో ప్రాథమిక బాధ్యత రాష్ట్రాలదే. పిల్లలపై సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ఐదు దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేక విభాగాలు, సామాజిక చైతన్యం, డిజిటల్ సాధనాల మేళవిస్తూ స్పందించాయి.
కేరళ సైబర్‌డోమ్ వ్యవస్థ ఆన్లైన్లో బాలలను దోపిడీ చేయడాన్ని ట్రాక్ చేస్తుంది. తద్వారా ఆపరేషన్ పి-హంట్ పేరుతో.. సీఎస్ఏఎం డౌన్లోడ్ చేసేవాళ్లని, పంపిణీచేస్తున్న వారిపై వివిధ సంస్థలు ఉమ్మడిగా దాడులు చేయటం జరుగుతోంది. ఈ చర్యలకు తోడు కిడ్ గ్లోవ్ ప్రాజెక్ట్, లిటిల్ కైట్స్ వంటి అవగాహన కార్యక్రమాలనూ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా స్కూల్ ఐటీ క్లబ్‌ల్లో సైబర్-భద్రతా మాడ్యూళ్లను చేర్చింది.
తెలంగాణ రాష్ట్రం సైబ్‌హెర్ (CybHER) కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులపై దృష్టి పెడుతోంది. ప్రత్యేక ‘సైబర్ కాంగ్రెస్’ నమూనాతో విద్యార్థి ‘సైబర్ అంబాసిడర్లను’, ఉపాధ్యాయులను శిక్షణను ఇస్తోంది. ఈ కార్యక్రమం అమలును.. రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన ‘ఉమన్ సేఫ్టీ వింగ్’తో పాటు, ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ల ద్వారా సమన్వయం చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 ఏళ్ల లోపు మైనర్లకు సామాజిక మాధ్యమాల్లో ప్రవేశాన్ని వారి వయసుకు తగ్గట్లు పరిమితులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది. వారి వయసు ధృవీకరణ కోసం డిజిలాకర్ ‘ఏజ్ టోకెన్లను’ వినియోగించాలని యోచిస్తోంది. అలాగే రాష్ట్రానికి చెందిన ఏపీ సైబర్ గార్డ్.. ఏఐ ట్రాకింగ్ సాధనాలు, ప్రత్యేక విభాగాలు, సైబర్ వార్ రూమ్‌ను కలుపుకుంటూ పనిచేస్తోంది. రాష్ట్రంలో డిజిటల్ పర్యవేక్షణను ఎమర్జెన్సీ హెల్ప్లైన్లతో అనుసంధానిస్తూ.. మహిళలు, పిల్లలను రక్షించడం లక్ష్యంగా శక్తి (SHAKTHI) భద్రతా వ్యవస్థను అమలు చేస్తోంది.
కర్ణాటక కూడా 16 ఏళ్ల లోపు వయసు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించడం, పిల్లలకు సురక్షితమైన స్క్రీన్-టైమ్ విధానాలను ప్రతిపాదిస్తోంది. రాష్ట్రంలోని సీఈఎన్ (సైబర్, ఎకనామిక్స్ అండ్ నార్కోటిక్స్) పోలీస్ స్టేషన్ల వ్యవస్థ, కేంద్రీకృత సైబర్ కమాండ్ సెంటర్.. సీఎస్ఏఎంను ట్రాక్ చేసి తొలగించడానికి అధునాతన ఫోరెన్సిక్స్ సాంకేతికతలను వినియోగిస్తున్నాయి. అలాగే ‘డిజిటల్ నాగరిక్’ కార్యక్రమం ద్వారా.. డేటా గోప్యత, సురక్షిత బ్రౌజింగ్‌పై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో అవగాహన పెంపొందిస్తోంది.
తమిళనాడులో..
తమిళనాడులో ‘అగల్ విళక్కు’ (మార్గదర్శక దీపం) కార్యక్రమం.. స్కూల్ స్థాయి సైబర్ క్లబ్‌ల మద్దతుతో డిజిటల్ భద్రత అంశాన్ని పాఠ్యాంశాలతో జోడిస్తోంది. సైబర్ బెదిరింపులు, సైబర్ గ్రూమింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తోంది. పోలీస్ విభాగంలోని ‘సైబర్ క్రైమ్ వింగ్’ ఎమర్జెన్సీ హెల్ప్లైన్ల మద్దతుతో సీఎస్ఈఏఎంను ట్రాక్ చేసి తొలగిస్తోంది. ప్రత్యేకంగా ‘సైబర్ స్ట్రీట్’ శిబిరాల ద్వారా సామాజిక అవగాహనను పెంపొందిస్తోంది.
మూడు నమూనాలు...
పిల్లలపై సైబర్ నేరాల విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రతిస్పందనలో మూడు విధానాలు విశిష్టంగా నిలుస్తున్నాయి. ఒకటి.. తెలంగాణ సైబర్ కాంగ్రెస్, తమిళనాడు సైబర్ క్లబ్‌లు, కేరళ లిటిల్ కైట్స్ వంటి విద్యార్థి-అంబాసిడర్ నమూనాలు విజయవంతమైన ఫలితాలిస్తున్నాయి. ఎందుకంటే తమకు ఎదురయ్యే సైబర్ గ్రూమింగ్ లేదా సైబర్ బెదిరింపుల గురించి పెద్దలు, అధికారులకు చెప్పటంకంటే.. ఈ అంశాల్లో అవగాహన, శిక్షణ పొందిన తమ సహ విద్యార్థులకు తెలియజేయడానికి పిల్లలు మరింత సానుకూలంగా ఉంటారు.
కేరళలో సైబర్‌డోమ్, ఆపరేషన్ పి-హంట్ విధానం.. సాంకేతిక నిఘా, డీప్-వెబ్ పర్యవేక్షణ, ఆటోమేటెడ్ హాష్-మ్యాచింగ్‌ను వినియోగిస్తూ.. ఫిర్యాదుల కోసం ఎదురుచూడకుండానే సీఎస్ఏఎం వినియోగదారుల అరెస్టులకు వీలు కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ శక్తి భద్రతా వ్యవస్థ వంటివి పిల్లలు ఫిర్యాదు చేయడాన్ని సులభం చేస్తాయి.
అంతరాన్ని పూడ్చడం ఎలా?
ప్రభుత్వాలు ఈ చర్యలు చేపడుతున్నప్పటికీ.. సీఎస్ఏఎం సమస్య పెరుగుతూనే ఉంది. అంతేకాక, డిజిటల్ ముద్రలను పూర్తిగా తొలగించటం కష్టతరం. దీనివల్ల పిల్లలు పదేపదే హానికి గురవుతారు. ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్నంత వేగంగా సైబర్ భద్రతా చర్యలు పెరగడం లేదు. ఈ అంతరాన్ని పూడ్చాలంటే ప్రభుత్వం, సైబర్ వేదికలు, పాఠశాలలు, కుటుంబాల మధ్య సమన్వయంతో సమగ్రమైన కార్యాచరణ అవసరం.
సోషల్ మీడియా వేదికలకు కూడా సమానమైన బాధ్యత ఉంటుంది. కనీస వయసు పరిమితి కంటే చాలా తక్కువ వయసున్న పిల్లలు ఇప్పటికే సోషల్ మీడియాలో యాక్టివ్ ఖాతాలను కలిగి ఉన్నారని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వయసు నిర్ధారణ వ్యవస్థలను స్వతంత్రంగా సమీక్షించాల్సిన అవసరముంది. పిల్లల ఇంటర్నెట్ వినియోగం మీద చాలావరకు పర్యవేక్షణ ఉండదనేది కనిపిస్తున్న వాస్తవం. దీనికి తగినట్లుగా.. యాప్‌లోని భద్రత, నివేదన, ఫిర్యాదు సాధనాలను కూడా పిల్లలు స్వయంగా ఉపయోగించగలిగేలా సరళతరం చేయాలి.
పాఠశాలల్లో నిర్మాణాత్మక డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాలు ప్రస్తుతం చాలా తక్కువ స్కూళ్లకే పరిమితంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాలను అన్ని స్కూళ్లకూ విస్తరించాలి. చిన్నారులు ఆన్లైన్ దోపిడీకి గురవడాన్ని గుర్తించేలా.. వారి కుటుంబాలకు చైల్డ్‌లైన్ 1098, పోక్సో ఇ-బాక్స్, 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ ఉపయోగించేలా అవగాహన కల్పించేలా.. ఉపాధ్యాయులకు, కౌన్సెలర్లకు తగిన శిక్షణ అందించడం అవసరం. అలాగే చాలావరకు అవగాహన కార్యక్రమాలు ప్రస్తుతం 14-16 ఏళ్ల వయసు బృందాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఆ వయసుకన్నా చాలా ముందు నుంచే పిల్లలకు వారి వయసుకు తగిన సైబర్ భద్రత అవగాహన అందించే కార్యక్రమాలను అమలు చేయాలి.
మరీ ముఖ్యంగా.. పిల్లలను ప్రతి రోజూ కనిపెట్టుకుని సంరక్షించే వారిలో ముందు వరుసలో ఉండేది వారి తల్లిదండ్రులు, సంరక్షకులు. వారు తమ పిల్లల ఆన్లైన్ అనుభవాల గురించి బహిరంగంగా.. పిల్లలను తప్పుపట్టని లేదా శిక్షించని రీతిలో సంభాషించగలగడం ముఖ్యం. దీనివల్ల పిల్లలు తమకు ఇబ్బందికరమైన లేదా దోపిడీకి గురిచేయగల సైబర్ సంభాషణలను, పరిణామాలను దాచిపెట్టకుండా వెల్లడించే అవకాశం పెరుగుతుంది.
సీఆర్‌వై ‘టింగ్ టాంగ్’ క్యాంపెయిన్
ఈ నేపథ్యంలో.. గత 47 ఏళ్లుగా పిల్లల హక్కుల కోసం పనిచేస్తున్న భారతీయ స్వచ్ఛంద సంస్థ సీఆర్‌వై – చైల్డ్ రైట్స్ అండ్ యూ – ఈ ఏడాది సైబర్ భద్రత అంశంపై క్యాంపెయిన్ చేపట్టింది. పిల్లలకు సురక్షితమైన డిజిటల్ ప్రపంచం కోసం ‘ఆన్లైన్లో ఉన్నప్పుడు రెండుసార్లు ఆలోచించండి’ అనే నినాదంతో ఆగస్టు 12వ తేదీన ఈ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఫోన్లో అలర్ట్ నోటిఫికేషన్ శబ్దాన్ని గుర్తుచేస్తూ.. ‘టింగ్ టాంగ్’ అనే పేరుతో విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. ఆన్లైన్లో ఏదైనా చేసే ముందు ఆగమని చెప్తూ అంతర్లీనంగా మోగే చిన్న అలర్ట్ బెల్.
‘నమ్మే ముందు టింగ్ టాంగ్. క్లిక్ చేసే ముందు టింగ్ టాంగ్. షేర్ చేసే ముందు టింగ్ టాంగ్.’ అన్నది ఈ క్యాంపెయిన్ సందేశం.
ప్రతి చిన్నారికీ సురక్షితమైన ఆన్లైన్ వ్యవస్థలను నిర్మించడంలో.. పిల్లలు, పెద్దలు, సంరక్షకులు, విద్యావేత్తలు, వలంటీర్లు, పాఠశాలలు, సమాజాలు, అధికారులు, ప్రభుత్వ భాగస్వాములు, డిజిటల్ వేదికలు, ప్రభావశీలురు.. అందరి పాత్రా చాలా అవసరం. వారందరినీ ఈ క్యాంపెయిన్‌లో భాగస్వామ్యం చేస్తోంది. ప్రతి ఒక్కరూ ఇందులో పాలుపంచుకోవాలని సీఆర్‌వై కోరుతోంది.
రచయిత:
జాన్ రాబర్ట్స్,
రీజనల్ డైరెక్టర్,
సీఆర్‌వై – చైల్డ్ రైట్స్ అండ్ యు –
సౌత్ రీజియన్
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


