Hyderabad real estate : దక్షిణ భారత లగ్జరీ హౌసింగ్ ‘రారాజు’గా హైదరాబాద్! బెంగళూరుకు మించి సేల్స్..
దక్షిణ భారత లగ్జరీ హౌసింగ్ మార్కెట్‌లో హైదరాబాద్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 10 కోట్ల పైబడిన గృహాల అమ్మకాల్లో రూ. 8,562 కోట్ల రికార్డు నమోదు చేస్తూ బెంగళూరును వెనక్కి నెట్టింది.
Hyderabad vs Bengaluru real estate : దక్షిణాది రియల్ ఎస్టేట్ రంగంలో భాగ్యనగరం తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది! ముఖ్యంగా అత్యంత ఖరీదైన ఇళ్ల (అల్ట్రా-లగ్జరీ హౌసింగ్) విభాగంలో హైదరాబాద్ ఇప్పుడు అజేయమైన శక్తిగా అవతరించింది. ‘ఇండియా సోథెబీస్ ఇంటర్నేషనల్ రియల్టీ’, 'సీఆర్ఈ మ్యాట్రిక్స్' విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 10 కోట్లు అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసింది. అంతేకాదు ఈ విభాగంలో భాగ్యనగరం బెంగళూరుని దాటేసింది.

బెంగళూరు కంటే 4 రెట్లు అధికం!
గతంలో ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో బెంగళూరుకు గట్టి పోటీ ఇచ్చే హైదరాబాద్, లగ్జరీ ఇళ్ల విక్రయాల్లో ఇప్పుడు ఆ నగరాన్ని చాలా వెనక్కి నెట్టేసింది. నివేదిక ప్రకారం:
హైదరాబాద్: రూ. 8,562 కోట్ల విలువైన లగ్జరీ ఇళ్ల విక్రయాలు జరిగాయి.
బెంగళూరు: ఇక్కడ కేవలం రూ. 1,957 కోట్ల అమ్మకాలు మాత్రమే నమోదయ్యాయి.
అంటే బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.
హైదరాబాద్‌కు దక్కిన 'స్పేస్ అడ్వాంటేజ్'!
హైదరాబాద్ మార్కెట్ ఇంతగా పుంజుకోవడానికి ప్రధాన కారణం 'స్పేస్ ఆర్బిట్రేజ్' . అంటే ఒకే ధరకు ఇతర నగరాల కంటే హైదరాబాద్‌లో ఎక్కువ స్థలం లభిస్తోంది.
రూ. 10 కోట్లు పెడితే హైదరాబాద్‌లో సుమారు 6,210 చదరపు అడుగుల స్థలం వస్తుంది. అదే బెంగళూరులో కేవలం 3,930 చదరపు అడుగులు, చెన్నైలో 4,290 చదరపు అడుగులు మాత్రమే లభిస్తోంది.
బెంగళూరుతో పోలిస్తే ఇక్కడ దాదాపు 60 శాతం అదనపు స్థలం లభిస్తుండటమే సంపన్న కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది.
అపార్ట్‌మెంట్లు, విల్లాలు.. దేని వాటా ఎంత?
హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ అల్ట్రా-లగ్జరీ అమ్మకాల్లో 8,000 చదరపు అడుగుల కంటే పెద్దవిగా ఉన్న భారీ అపార్ట్‌మెంట్ల వాటానే 57 శాతం కావడం విశేషం. ఇక మిగిలిన 40 శాతం లావాదేవీల విలువ విల్లాలు మరియు రో-హౌస్‌ల ద్వారా సమకూరింది. ఐటీ కారిడార్లకు సమీపంలోని కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ వంటి ప్రాంతాలు ఈ విక్రయాలకు ప్రధాన కేంద్రాలుగా మారాయి.
కొనుగోలుదారులు ఎవరు?
ముఖ్యంగా స్టార్టప్ వ్యవస్థాపకులు, ఫార్మా రంగ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) హైదరాబాద్‌ను తమ నివాస కేంద్రంగా ఎంచుకుంటున్నారు. అంతర్జాతీయ పాఠశాలలు, మెరుగైన రోడ్డు నెట్‌వర్క్, మెట్రో విస్తరణ, కార్యాలయాలకు దగ్గరగా ఉండటం వంటి అంశాలు వీరి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
నిపుణుల విశ్లేషణ: మూడు నగరాలు - మూడు తీర్లు!
"దక్షిణ భారత లగ్జరీ హౌసింగ్ కథనం మూడు విభిన్న రూపాల్లో ఉంది. కోకాపేట వంటి చోట్ల భారీ స్థాయిలో లగ్జరీ పర్యావరణాన్ని నిర్మించే సామర్థ్యం హైదరాబాద్‌కు ఉంది. బెంగళూరులో కొత్త కారిడార్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, స్థల కొరత, ట్రాఫిక్ సమస్యలు ధరలను పెంచుతున్నాయి. చెన్నై మాత్రం ఇంకా సంప్రదాయ లగ్జరీకే పరిమితమైంది," అని ఇండియా సోథెబీస్ ఇంటర్నేషనల్ రియల్టీ సీఈఓ అశ్విన్ చద్దా పేర్కొన్నారు.
పెట్టుబడిదారులకు కీలక సూచన..
బెంగళూరులో ప్రస్తుతం అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో అక్కడ ధరలు స్థిరంగా లేదా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, హైదరాబాద్‌లో ఇళ్ల లభ్యత ఎక్కువగా ఉండటం వల్ల కొనుగోలుదారులు ధరల విషయంలో బేరమాడేందుకు ఎక్కువ అవకాశం ఉంది. అయితే పెట్టుబడి పెట్టేముందు కేవలం నగరాన్ని మాత్రమే కాకుండా, ఆయా ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలు, బిల్డర్ల ట్రాక్ రికార్డును పరిశీలించాలని వారు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


