Hyderabad : ట్రాఫిక్ ఫ్రీ నగరంగా హైదరాబాద్.. సిటీలో మల్టీ లెవెల్ పార్కింగ్
Traffic Free Hyderabad : ట్రాఫిక్ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌ను తయారుచేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కీలకమైన ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఉపరితల రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్‌లను ఏర్పాటు చేయనున్నట్టుగా వెల్లడించారు.
ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్(CURE) మొత్తంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన Standing Committee on Housing and Urban Affairs సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆధునీకరణ, నగరీకరణతో సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించడానికి ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి సమావేశంలో ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పెరుగుతున్న నగరీకరణ వల్ల సమీప భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కీలకమైన ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఉపరితల రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్‌ల వంటి మూడు విధానాల్లో ట్రాఫిక్‌కు సులభతరమైన రవాణా మార్గాలను కల్పించే విధానాన్ని ఎంచుకున్నామని తెలిపారు.
'ట్రాఫిక్ నియంత్రణ కోసం కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే చేపడితే సరిపోదు. బహుళ విధానాల్లో రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు నగరంలో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం.' అని రేవంత్ రెడ్డి వివరించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని CURE, PURE, RARE విభాగాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్‌గా గుర్తించామని పేర్కొన్నారు. ఓఆర్ఆర్ బయట నుంచి రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతం పెరి అర్బన్ రీజియన్ ఎకానమి(PURE) ప్రాంతంగా ప్రధానంగా మాన్యూఫ్యాక్చర్ సెక్టార్‌గా గుర్తించామని తెలిపారు.
ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు బయట ఉన్న రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ(RARE)గా వ్యవసాయం, దానిక అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు సీఎం. 'రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం #TelanganaRising2047 మాస్టర్ ప్లాన్‌ను ఇప్పటికే ఆవిష్కరించుకున్నాం. లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. కాలుష్య కోరల నుంచి హైదరాబాద్‌ను కాపాడటానికి మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు నగర సంస్కృతికి అనుసంధానించబోతున్నాం. నగరంలో కాలుష్య నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాం. హైదరాబాద్‌లో ఆర్టీసీలో ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నాం. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఆటోలకు ఉచితంగా #Retrofitting చేయించి ఈవీ వాహనాలుగా మార్చాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం.' అని ముఖ్యమంత్రి చెప్పారు.
హైదరాబాద్ నగర తాగునీటి సరఫరా, పట్టణాభివృద్ధి, మూసీ పునరుద్ధరణ తదితర అంశాలపై ప్రభుత్వ ప్రణాళికలను సమావేశంలో ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్టాండింగ్ కమిటీకి వివరించారు. నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా ప్రభుత్వం స్టాండింగ్ కమిటీకి విజ్ఞప్తి చేసింది.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు చేపట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయమని స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్‌తో పాటు ఇతర సభ్యులు అభివర్ణించారు. హైదరాబాద్ నగర జీవన స్థితిగతులను మెరుగుపరిచే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు దేశంలోనే మొదటిదని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ నగర ప్రజలకు ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టును చేపట్టడంపై ఈ సందర్భంగా కమిటీ.. ముఖ్యమంత్రి అభినందించింది. దీంతో పాటు రాష్ట్రంలో మహిళాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కమిటీ ప్రశంసించింది. అంతకుముందు సమావేశం ప్రారంభంలో స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌తో పాటు సభ్యులను ముఖ్యమంత్రి సత్కరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదగడానికి అనుగుణంగా సమగ్ర ప్రణాళికలతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్‌ను స్టాండింగ్ కమిటీ సభ్యులకు అందజేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


