Bayon vs Creta : బేయాన్ వర్సెస్ క్రెటా- ఏ హ్యుందాయ్ ఎస్​యూవీ కొంటే బెస్ట్?

హ్యుందాయ్ సంస్థ సబ్‌-కాంపాక్ట్ వెన్యూ, మిడ్‌సైజ్ క్రెటాల మధ్య సరికొత్త 'బేయాన్' ఎస్‌యూవీని అక్టోబర్ 26న విడుదల చేయనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, విశాలమైన కేబిన్, సీఎన్జీ ఆప్షన్‌తో వస్తున్న ఈ కారు క్రెటాతో ఎలా పోటీపడుతుందో ఇక్కడ చూసేయండి..

Published on: Oct 19, 2026, 12:21:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భారతీయ ఆటోమొబైల్ విపణిలో అత్యంత ప్రజాదరణ పొందిన 'హ్యుందాయ్' సంస్థ తమ వాహన శ్రేణిని మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే విపరీతమైన క్రేజ్ ఉన్న ‘వెన్యూ’, ‘క్రెటా’ కార్ల మధ్య ఉండే ఖాళీని భర్తీ చేసేందుకు 'హ్యుందాయ్ బేయాన్' ఎస్‌యూవీని సిద్ధం చేసింది. అక్టోబర్ 26, 2026న అధికారికంగా భారత రోడ్లపైకి రానున్న ఈ కారు ఇండియా-స్పెసిఫికేషన్లను కంపెనీ వెల్లడించింది.

హ్యుందాయ్ బేయాన్ వర్సెస్ క్రెటా.. ఏది బెస్ట్?
హ్యుందాయ్ బేయాన్ వర్సెస్ క్రెటా.. ఏది బెస్ట్?

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ప్రధాన నగరాల్లో మిడ్-సైజ్ ఎస్‌యూవీలకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ఈ తరుణంలో క్రెటా కంటే తక్కువ ధరలో, సరికొత్త ఫ్యూచరిస్టిక్ ఫీచర్లతో వస్తున్న బేయాన్ వాహనదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారు ఇప్పుడు క్రెటా తీసుకోవాలా లేక బేయాన్ కోసం వేచి చూడాలా అనే సందేహంలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది ఇక్కడ తెలుసుకోండి..

హ్యుందాయ్ బేయాన్ వర్సెస్ క్రెటా- డిజైన్, డైమెన్షన్స్..

హ్యుందాయ్ బేయాన్ ‘ఆర్ట్ ఆఫ్ స్టీల్’ డిజైన్ ఫిలాసఫీతో వస్తోంది. ఇది 4,245 ఎంఎం పొడవు, 1,810 ఎంఎం వెడల్పు, 1,565 ఎంఎం ఎత్తు, 2,600 ఎంఎం వీల్‌బేస్ కలిగి ఉంది. టక్సన్ కారును పోలిన ఫ్యూచరిస్టిక్ లుక్, స్లిమ్ ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌తో స్పోర్టీ క్రాసోవర్ డిజైన్‌ను అందిస్తోంది.

మరోవైపు హ్యుందాయ్ క్రెటా 4.3 మీటర్ల పొడవుతో సాంప్రదాయ బాక్సీ ఎస్‌యూవీ రూపంతో కనిపిస్తుంది. రోడ్డుపై గంభీరమైన ప్రెజెన్స్, ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్, ఎక్కువ కేబిన్ వెడల్పు కోరుకునే వారికి క్రెటా అనువుగా ఉంటుంది.

హ్యుందాయ్ బేయాన్ వర్సెస్ క్రెటా- ఏఐ టెక్నాలజీ, కేబిన్ ఫీచర్లు..

సాంకేతికత విషయంలో బేయాన్ ఒక అడుగు ముందే ఉందని చెప్పవచ్చు. ఇందులో రెండు 12.3-ఇంచుల కర్వ్‌డ్ స్క్రీన్ డిస్‌ప్లేలను అందించారు. భారతదేశంలో మొదటిసారిగా జెనరేటివ్ ఏఐ వాయిస్ అసిస్టెంట్‌ను హ్యుందాయ్ ఈ కారులోనే ప్రవేశపెడుతోంది. ఇంటర్నెట్ లేకపోయినా ఇది అనేక ప్రాంతీయ భాషల వాయిస్ కమాండ్లను అర్థం చేసుకుంటుంది.

క్రెటా విషయానికి వస్తే, ఇందులో రెండు 10.25-ఇంచ్ స్క్రీన్లు ఉన్నాయి. డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ డ్రైవర్ సీట్, వెనుక సీట్ల సన్‌షేడ్లు వంటి లగ్జరీ కంఫర్ట్ ఫీచర్లు ఇందులో లభిస్తాయి. రెండింటిలోనూ పనోరమిక్ సన్‌రూఫ్ కలదు.

హ్యుందాయ్ బేయాన్ వర్సెస్ క్రెటా- ఇంజిన్, గేర్‌బాక్స్..

హ్యుందాయ్ బేయాన్‌లో 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇచ్చారు. ఇది 115 పీఎస్ పవర్, 144 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, ఐవీటీ ఆటోమేటిక్ ఆప్షన్లలో లభిస్తుంది. అంతేకాకుండా, 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న కార్లలో కంపెనీ ఫిటెడ్ అండర్‌బాడీ సీఎన్జీ ఆప్షన్‌తో వస్తున్న మొదటి హ్యుందాయ్ కారు బేయాన్ కావడం విశేషం.

క్రెటాలో వేరియంట్ల ఆధారంగా మూడు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి: 1.5L పెట్రోల్ (115 పీఎస్), 1.5L టర్బో పెట్రోల్ (160 పీఎస్ - 7డీసీటీ), 1.5L డీజిల్ (116 పీఎస్ - 6ఎంటీ/6ఏటీ).

హ్యుందాయ్ బేయాన్ వర్సెస్ క్రెటా- సేఫ్టీ..

బేయాన్ కారును 5-స్టార్ క్రాష్ సేఫ్టీ రేటింగ్ లక్ష్యంగా హ్యుందాయ్ గ్లోబల్ కే-ఎన్‌హాన్స్​డ్​ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. లెవెల్-2 అడాస్ , 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ, టీపీఎంఎస్ వంటి భద్రతా ఫీచర్లను అందించారు.

క్రెటా కే2 ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది (గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 3-స్టార్ రేటింగ్). ఇందులో కూడా లెవెల్-2 అడాస్, 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు లభిస్తాయి.

హ్యుందాయ్ బేయాన్ వర్సెస్ క్రెటా- ఏది ఎంచుకోవాలి?

మీకు అత్యాధునిక ఏఐ సాంకేతికత, 12.3-ఇంచ్ కర్వ్‌డ్ డిస్‌ప్లేలు, సిటీలో సులువైన ప్రయాణం, సీఎన్జీ ఆప్షన్ కావాలనుకుంటే హ్యుందాయ్ బేయాన్ కోసం వేచి చూడడం మంచిది. క్రెటా కంటే తక్కువ ధరకు ప్రామాణిక అడాస్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఇందులో లభిస్తాయి.

అదేవిధంగా, పెద్ద కుటుంబానికి సరిపోయే ఎక్కువ సీటింగ్ స్పేస్, డీజిల్ లేదా హై-పవర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, సుదీర్ఘ ప్రయాణాలకు సౌకర్యం కావాలనుకునే వారికి హ్యుందాయ్ క్రెటా సరైన ఎంపిక.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More