...
...
Next Story

Electric car : 500 కి.మీ రేంజ్​తో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు- లాంచ్ ఎప్పుడు?

భారత ఈవీ మార్కెట్లో ఆధిపత్యం సాధించేందుకు హ్యుందాయ్ భారీ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. 500 కిలోమీటర్లకు పైగా రేంజ్, అధునాతన లెవల్-2 అడాస్ సాంకేతికతతో కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2026 చివరి త్రైమాసికంలో భారత మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Published on: Aug 29, 2026, 06:46:11 IST
Advertisement

భారత ఆటోమొబైల్ రంగాన్ని తీవ్రంగా ఆకర్షిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగంలో దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్ చక్రం తిప్పేందుకు సిద్ధమైంది. సగటు భారత వినియోగదారుడి బడ్జెట్​కి అందుబాటులో ఉండేలా, సరికొత్త సాంకేతికతతో కూడిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2026 చివరి త్రైమాసికం (క్యూ4)లో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సంస్థ వెల్లడించింది. కేవలం ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించేలా ఈ వాహనాన్ని డిజైన్ చేస్తున్నారు.

భారతీయ రోడ్లకు తగినట్లుగా..

హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..
హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..

ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విదేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకోకుండా, పూర్తిగా భారతీయ కస్టమర్ల అవసరాలు, స్థానిక రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా తయారు చేస్తున్నారు. భారత మార్కెట్‌లో దూసుకుపోతున్న టాటా పంచ్ ఈవీ వంటి మైక్రో ఎస్‌యూవీల విభాగానికి గట్టి పోటీ ఇచ్చేలా దీని ధరను నిర్ణయించనున్నారు. హ్యుందాయ్ విక్రయిస్తున్న క్రెటా ఈవీ కంటే దిగువ స్థానంలో ఈ మోడల్ నిలవనుంది.

సాంకేతికపరంగా ఈ ఎలక్ట్రిక్ కారులో హ్యుందాయ్ సరికొత్త ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ‘ప్లియోస్’ టెక్నాలజీని అందిస్తోంది. దీనికి తోడు ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచే లెవల్-2 అడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)ను ఇందులో అమర్చనున్నారు. భద్రతకు, డ్రైవింగ్ అనుభవానికి ప్రాధాన్యమిచ్చే నేటి యువతరానికి ఈ ఫీచర్లు బాగా ఆకట్టుకోనున్నాయి.

2030 నాటికి 26 కొత్త మోడళ్లు.. క్రెటా హైబ్రిడ్ కూడా!

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రాక హ్యుందాయ్ సుదీర్ఘ వ్యూహంలో ఒక భాగం మాత్రమే. 2030 నాటికి భారత్‌లో 26 కొత్త కార్లు/ అప్‌డేటెడ్ మోడళ్లను ప్రవేశపెట్టాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ జాబితాలో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, ఎక్స్​టెండెడ్ రేంజ్ ఈవీ రకాలు ఉన్నాయి.

భారత తయారీ సామర్థ్యంపై హ్యుందాయ్ గట్టి నమ్మకం ఉంచింది. 2030 నాటికి భారతదేశంలో తమ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని మరో 3.20 లక్షల యూనిట్లు పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఏటా 11 లక్షల వాహనాలను ఉత్పత్తి చేస్తున్న ఈ ప్లాంట్ల సామర్థ్యం త్వరలోనే మరిన్ని యూనిట్లకు విస్తరించనుంది.

వాహనాల తయారీకి అవసరమైన విడిభాగాలను 90 శాతం వరకు భారత్‌లోనే స్థానికంగా కొనుగోలు చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 1,400 కంటే ఎక్కువ స్థానిక సరఫరాదారులు, 900 మందికి పైగా భారతీయ ఇంజనీర్లతో కంపెనీ ముందుకు సాగుతోంది. ఇక్కడ తయారు చేసిన వాహనాలను మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా దేశాలకు ఎగుమతి చేయనున్నారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా తమ మొత్తం విక్రయాల్లో 60 శాతం విద్యుత్ వాహనాలే ఉండేలా హ్యుందాయ్ గ్లోబల్ విజన్‌ను ఖరారు చేసింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks