Hyundai EV : 500 కి.మీ రేంజ్​తో హ్యుందాయ్ కొత్త ఈవీ- అత్యంత చౌకైనది!

భారత ఈవీ మార్కెట్లో పట్టు సాధించేందుకు హ్యుందాయ్ మోటార్స్ సరికొత్త ప్లాన్లతో దూసుకొస్తోంది. క్రెటా ఈవీ కంటే తక్కువ ధరలో, 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ (రేంజ్) ఇచ్చే సరికొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది.

Published on: Jul 18, 2026, 11:37:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) హవా రోజురోజుకూ పుంజుకుంటోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ తన ఈవీ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేయడానికి ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఒక సరికొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత్‌లో లాంచ్ చేయడానికి సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఈ కారు దేశీయ రోడ్లపై పలుమార్లు టెస్టింగ్ చేస్తూ కనిపించింది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం.. త్వరలో రాబోతున్న ఈ ఈవీ, ప్రస్తుతం ఉన్న 'క్రెటా ఎలక్ట్రిక్' కంటే కింది విభాగంలో ఉండనుంది. అంటే, హ్యుందాయ్ బ్రాండ్ నుంచి రాబోయే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇదే అయ్యే అవకాశం ఉంది. ఈ సరికొత్త ఈవీ.. కార్ ప్రియులకు 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో అందుబాటులోకి రానుంది. అత్యాధునిక టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో రాబోతున్న ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని సమాచారం.

హ్యుందాయ్ కొత్త ఈవీ ఎలా ఉంటుంది? (Representative Image)
హ్యుందాయ్ కొత్త ఈవీ ఎలా ఉంటుంది? (Representative Image)

హ్యుందాయ్ కొత్త ఈవీ- రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు..

హ్యుందాయ్ తీసుకురాబోయే ఈ కొత్త కాంపాక్ట్ ఈవీ, ఇటీవల మార్కెట్లో సందడి చేసిన కియా సైరోస్ ఈవీ ప్లాట్‌ఫారమ్‌ను పంచుకోనుందని సమాచారం. అదే కనుక నిజమైతే, ఈ ఎస్‌యూవీ 42 kWh, 51.4 kWh సామర్థ్యం గల రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభించనుంది. ఇందులో పెద్ద బ్యాటరీ ప్యాక్ ద్వారా సింగిల్ ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని, చిన్న బ్యాటరీ ప్యాక్ ద్వారా దాదాపు 440 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుందని టాక్ నడుస్తోంది. దీని టాప్ వేరియంట్లలో డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది. దీనివల్ల లాంగ్ డ్రైవ్స్ వెళ్లే వాహనదారులకు ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ప్రయాణం మరింత సులువుగా మారుతుంది.

హ్యుందాయ్ కొత్త ఈవీ- సరికొత్త లుక్, అదిరిపోయే డిజైన్..

టెస్టింగ్ సమయంలో లీకైన చిత్రాలను గమనిస్తే హ్యుందాయ్ ఈ కారుకు సరికొత్త ఐడెంటిటీని ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏదో ఒక పెట్రోల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చకుండా, దీనిని ప్రత్యేకమైన డిజైన్‌తో రూపొందిస్తున్నారు. హ్యుందాయ్ గ్లోబల్ ఈవీ మోడళ్ల తరహాలోనే ఇది కూడా మంచి హైట్ కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారులో స్ల్పిట్ ఎల్‌ఈడీ లైటింగ్, బాడీలో కలిసిపోయే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, రూఫ్ రైల్స్, వెనుక వైపు రూఫ్ స్పాయిలర్, గాలి ఒత్తిడిని తట్టుకునే ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్ మరియు నిలువుగా ఉండే రిఫ్లెక్టర్లను అమర్చారు. ఇవన్నీ కారుకు అద్భుతమైన స్పోర్టీ లుక్‌ను ఇస్తున్నాయి.

హ్యుందాయ్ కొత్త ఈవీ- లగ్జరీ ఇంటీరియర్, ప్రీమియం ఫీచర్లు

ఈ కారు ఇంటీరియర్ వివరాలను కంపెనీ అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. అయినప్పటికీ, క్యాబిన్ చాలా ప్రీమియం లుక్‌తో రాబోతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

“ఈ సరికొత్త కాంపాక్ట్ ఈవీ టాప్ వేరియంట్లలో 12.3-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందుబాటులో ఉంటాయి,” అని ఆటోమొబైల్ వర్గాలు పేర్కొన్నాయి.

దీనితో పాటు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఓవర్-ది-ఎయిర్ (ఓటీఏ) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు ఉండనున్నాయి. ప్రయాణాన్ని మరింత సుఖమయం చేయడానికి వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి క్రేజీ ఫీచర్లు కూడా ఇందులో జతచేయనున్నారు.

హ్యుందాయ్ కొత్త ఈవీ- సేఫ్టీలో అదరహో, అడాస్ టెక్నాలజీ..

భద్రత విషయంలోనూ హ్యుందాయ్ ఎలాంటి రాజీ పడటం లేదు. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారులో పటిష్టమైన సేఫ్టీ ప్యాకేజీని అందిస్తున్నారు. హై-ఎండ్ వేరియంట్లలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (లెవల్ 2 అడాస్) ఉండబోతోంది. దీంతో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, బ్యాటరీ వేడిని నియంత్రించే థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, బ్రేక్ వేసినప్పుడు పవర్ జనరేట్ చేసే రీజెనరేటివ్ బ్రేకింగ్, కనెక్టెడ్ ఛార్జింగ్ ఫంక్షన్లు కూడా ఇందులో ఉండనున్నాయి.

హ్యుందాయ్ కొత్త ఈవీ- మార్కెట్లో పోటీ ఎవరితో?

భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత హ్యుందాయ్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి గట్టి పోటీ ఎదురుకానుంది. ముఖ్యంగా టాటా నెక్సాన్ ఈవీ, టాటా పంచ్ ఈవీ, మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఈవీ, కియా సైరోస్ ఈవీ వంటి పాపులర్ మోడళ్లతో ఇది తలపడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ, 500 కిలోమీటర్ల రేంజ్, రెండు బ్యాటరీ ఆప్షన్లు, మెరుగైన ఫీచర్లు ఉండటం వల్ల వేగంగా ఎదుగుతున్న భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో హ్యుందాయ్ కొత్త కారు గేమ్ ఛేంజర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఈ కొత్త ఈవీ పేరు, లాంచ్ సహా ఇతర వివరాలను హ్యుందాయ్ రానున్న రోజుల్లో రివీల్ చేసే అవకాశం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More