వెంటిలేటెడ్ సీట్లు ఉన్న టాప్- 6 ఎస్‌యూవీలు ఇవి- ధర రూ. 8.3 లక్షల నుంచే..
ఎండా కాలం సమీపిస్తున్న నేపథ్యంలో భారతీయులు తమ కార్లలో ఎక్కువగా కోరుకుంటున్న ఫీచర్ ‘వెంటిలేటెడ్ సీట్లు’! గతంలో లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ కంఫర్ట్ ఫీచర్.. ఇప్పుడు రూ. 13 లక్షల లోపు లభించే బడ్జెట్ ఎస్‌యూవీల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
భారతదేశంలో ఇంకొన్ని నెలల్లో వేసవి కాలం ప్రారంభంకాబోతోంది. ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో పెరుగుతాయో అని ఇప్పుడే భయం మొదలైంది. ఈ నేపథ్యంలో కార్లలో ప్రయాణించే వారికి ఏసీతో పాటు ‘వెంటిలేటెడ్ సీట్లు’ అవసరంగా మారుతున్నాయి. ఒకప్పుడు రూ. 25–30 లక్షల ఖరీదైన కార్లలో మాత్రమే కనిపించే ఈ ప్రీమియం ఫీచర్.. ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉండే కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోకి కూడా వచ్చేసింది.

మీరు కూడా వెంటిలేటెడ్ సీట్లు ఉన్న మంచి ఎస్‌యూవీని బడ్జెట్‌లో కొనాలి అని ప్లాన్ చేస్తుంటే, మీ కోసం మార్కెట్లో ఉన్న టాప్-6 ఆప్షన్లు ఇక్కడ ఇస్తున్నాము. చూసేయండి..
వెంటిలేటెడ్ సీట్లు ఉన్న టాప్-6 ఎస్‌యూవీలు ఇవి..
1. రెనాల్ట్ కైగర్-
ప్రస్తుతం భారతదేశంలో వెంటిలేటెడ్ సీట్లను అందిస్తున్న అత్యంత చవకైన కారు ఈ 'రెనాల్ట్ కైగర్'. ఇటీవల వచ్చిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో, దీని టాప్-ఎండ్ ‘ఎమోషన్’ ట్రిమ్‌లో ఈ ఫీచర్‌ను స్టాండర్డ్‌గా చేర్చారు. రూ. 10 లక్షల లోపు ధరలో ఈ సౌకర్యం ఉన్న ఏకైక కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇదే కావడం విశేషం.
వెంటిలేటెడ్ సీట్లు ఉన్న వేరియంట్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 8.37 లక్షలు.
2. కియా సోనెట్-
సాధారణ వినియోగదారులకు వెంటిలేటెడ్ సీట్లను పరిచయం చేసిన మొదటి బ్రాండ్లలో కియా మోటార్స్ ఒకటి. సోనెట్ మోడల్‌లో టర్బో-పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు గల టాప్ వేరియంట్లలో ఈ సౌకర్యం ఉంది. ప్రీమియం ఇంటీరియర్స్ కోరుకునే పట్టణ వాసులకు ఇది బెస్ట్ ఛాయిస్.
వెంటిలేటెడ్ సీట్లు ఉన్న వేరియంట్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 10.80 లక్షలు.
3. హ్యుందాయ్ వెన్యూ-
హ్యుందాయ్ తన సెకండ్ జనరేషన్ వెన్యూ టాప్ వేరియంట్లలో ఈ వెంటిలేటెడ్ సీట్ల ఫీచర్‌ని అందిస్తోంది. ఈ కారులో కేవలం సీట్లే కాదు.. లెవల్ 2 అడాస్ వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. టర్బో-పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది.
వెంటిలేటెడ్ సీట్లు ఉన్న వేరియంట్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 11.91 లక్షలు.
4. స్కోడా కైలాక్-
ఈ సెగ్మెంట్‌లోకి కొత్తగా వచ్చిన స్కోడా కైలాక్ తన ‘ప్రెస్టీజ్’ వేరియంట్‌లో వెంటిలేటెడ్ సీట్లను ఇస్తోంది. 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే ఈ కారులో మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
వెంటిలేటెడ్ సీట్లు ఉన్న వేరియంట్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 11.99 లక్షలు.
5. కియా సైరోస్-
కియా నుంచి వస్తున్న మరో కొత్త మోడల్ సైరోస్ ఎస్‌యూవీ. ఇది ఒక అడుగు ముందుకేసి ముందు సీట్లకు వెంటిలేషన్‌తో పాటు టాప్ వేరియంట్‌లో వెనుక సీటు బేస్‌ను కూడా ఈ సదుపాయాన్ని ఇస్తోంది. ఈ సెగ్మెంట్‌లో వెనుక సీటు కూలింగ్ ఉండటం చాలా అరుదు.
వెంటిలేటెడ్ సీట్లు ఉన్న వేరియంట్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 12.10 లక్షలు.
6. టాటా నెక్సాన్ -
టాటా నెక్సాన్ తన 'ఫియర్‌లెస్+ పీఎస్' ట్రిమ్‌లో ఈ ఫీచర్‌ను అందిస్తోంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పెట్రోల్, డీజిల్‌తో పాటు సీఎన్జీ వేరియంట్‌లో కూడా వెంటిలేటెడ్ సీట్లు ఇస్తున్న ఏకైక కారు నెక్సాన్ మాత్రమే.
వెంటిలేటెడ్ సీట్లు ఉన్న వేరియంట్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 12.17 లక్షలు.
"ఇకపై వెంటిలేటెడ్ సీట్ల కోసం మీ బడ్జెట్‌ను భారీగా పెంచుకోవాల్సిన అవసరం లేదు. బడ్జెట్ ఫ్రెండ్లీ రెనాల్ట్ కైగర్ నుంచి ఫీచర్ల రారాజు టాటా నెక్సాన్ వరకు.. మీకు నచ్చిన మోడల్‌ను తక్కువ ధరలోనే ఎంచుకోవచ్చు," అని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

E-Paper












