మైక్రో ఎస్‌యూవీ వార్: టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ Vs హ్యుందాయ్ ఎక్స్టర్- ఏది బెస్ట్?
భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత ఆదరణ పొందుతున్న మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ మరింత పెరిగింది. కొత్త ఫీచర్లు, పవర్‌ఫుల్ టర్బో ఇంజిన్‌తో వచ్చిన 2026 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్, హ్యుందాయ్ ఎక్స్టర్కు ఏ స్థాయిలో సవాల్ విసురుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
భారతదేశ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు సరికొత్త ఊపునిస్తూ 'టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్' మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన బెస్ట్ సెల్లింగ్ మోడల్‌ను టాటా మోటార్స్ సరికొత్త డిజైన్, హై-టెక్ ఫీచర్లతో ముస్తాబు చేసింది. అయితే, ఈసారి పంచ్‌లో ప్రధాన ఆకర్షణ దాని 'టర్బో-పెట్రోల్' ఇంజిన్. ఈ క్రమంలో, మొదటి నుంచి గట్టి పోటీ ఇస్తున్న హ్యుందాయ్ ఎక్స్టర్తో పోలిస్తే, కొత్త పంచ్ ఏ మేరకు మెరుగ్గా ఉందో ఇక్కడ తెలుసుకోండి..

2026 టాటా పంచ్ వర్సెస్ హ్యుందాయ్ ఎక్స్టర్- రోడ్డుపై ఎవరి హవా?
కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను చూస్తే, అది పక్కా ఎస్‌యూవీ లుక్‌తో మరింత మస్క్యులర్‌గా కనిపిస్తుంది. దీని ఫ్రంట్ గ్రిల్, బంపర్ డిజైన్, కొత్త 'ట్రైల్‌క్రెస్ట్' అలాయ్ వీల్స్ కారుకు ఒక అగ్రెసివ్ లుక్‌ను ఇచ్చాయి. పొడవు విషయానికొస్తే, పాత మోడల్ కంటే ఇది 49 ఎంఎం పెరిగి 3,876 ఎంఎంకి చేరింది. వెడల్పు 1,742 ఎంఎం, ఎత్తు 1,615 ఎంఎం ఉండటంతో రోడ్డుపై ఈ మైక్రో ఎస్‌యూవీ చాలా బ్రాడ్‌గా కనిపిస్తుంది.
మరోవైపు హ్యుందాయ్ ఎక్స్టర్ డిజైన్ కొంచెం ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. హెచ్-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ దీనికి ప్రత్యేక గుర్తింపునిస్తాయి. ఎక్స్టర్ పొడవు 3,815 ఎంఎం, వెడల్పు 1,710 ఎంఎం. అయితే ఎత్తులో (1,631 ఎంఎం) పంచ్ కంటే ఎక్స్టర్ కొంచెం ఎక్కువే. వీల్‌బేస్ విషయంలోనూ 2,450 ఎంఎంతో ఎక్స్టర్ స్వల్పంగా ముందుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. పంచ్ వెడల్పుగా ఉండి మంచి రోడ్ ప్రజెన్స్ ఇస్తుంటే, హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్‌యూవీ పొడవుగా అనిపిస్తుంది.
2026 టాటా పంచ్ వర్సెస్ హ్యుందాయ్ ఎక్స్టర్- ఇంజిన్ పర్ఫార్మెన్స్..
పర్ఫార్మెన్స్ విషయంలో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ తన ప్రత్యర్థుల కంటే ఒక అడుగు ముందే ఉంది! సాధారణ పెట్రోల్, సీఎన్జీ వెర్షన్లతో పాటు ఈసారి ఇందులో కొత్తగా 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను తీసుకొచ్చారు. ఇది వేగంతో పాటు మంచి పవర్‌ను ఇస్తుంది.
డ్రైవింగ్ ఎంజాయ్ చేసే వారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది.
హ్యుందాయ్ ఎక్స్టర్ విషయానికొస్తే, ఇది కేవలం నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌పైనే ఆధారపడింది. ఇది సిటీ డ్రైవింగ్‌కు, మైలేజీకి ప్రాధాన్యతనిచ్చే వారికి బాగుంటుంది కానీ, పంచ్ టర్బో ఇంజిన్ ఇచ్చే పవర్‌ను ఇది అందుకోలేదు.
| స్పెసిఫికేషన్లు | పంచ్ 1.2 లీటర్ పెట్రోల్ | పంచ్ 1.2 ఐసీఎన్జీ | పంచ్ 1.2 టర్బో పెట్రోల్ | ఎక్స్టర్ 1.2 పెట్రోల్ | ఎక్స్టర్ 1.2 సీఎన్జీ |
|---|---|---|---|---|---|
| ఇంజిన్ టైప్ | 1.2లీ ఎన్ఏ రెవొట్రాన్ | 1.2లీ ఎన్ఏ రెవొట్రాన్ ఐసీఎన్జీ | 1.2లీ టర్బో పెట్రోల్ | 1.2లీ ఎన్ఏ కప్పా | 1.2లీ ఎన్ఏ కప్పా సీఎన్జీ |
| డిస్ప్లేస్మెంట్ | 1199 సీసీ | 1199 సీసీ | 1199 సీసీ | 1197 సీసీ | 1197 సీసీ |
| మ్యాక్స్ పవర్ | 87.8 పీఎస్ @ 6,000 ఆర్పీఎం | 73.4 పీఎస్ (సీఎన్జీ) / 87.8 పీఎస్ (పెట్రోల్) | 120 పీఎస్ @ 5,500 rpm | 83 పీఎస్ @ 6,000 ఆర్పీఎం | 69 పీఎస్ @ 6,000 ఆర్పీఎం |
| మ్యాక్స్ టార్క్ | 115 ఎన్ఎం @ 3,250 ఆర్పీఎం | 103 ఎన్ఎం (సీఎన్జీ) / 115 ఎన్ఎం (పెట్రోల్) | 170 ఎన్ఎం @ 1,750–4,000 ఆర్పీఎం | 113.8 ఎన్ఎం @ 4,000 ఆర్పీఎం | 95 ఎన్ఎం @ 4,000 ఆర్పీఎం |
| ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ | 5ఎంటీ, 5ఏఎంటీ | 5ఎంటీ, 5ఏఎంటీ | 6ఎంటీ | 5ఎంటీ, 5ఏఎంటీ | 5ఎంటీ |
2026 టాటా పంచ్ వర్సెస్ హ్యుందాయ్ ఎక్స్టర్- ఇంటీరియర్..
కారు లోపల చూస్తే, పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఒక టెక్నాలజీ హబ్‌లా కనిపిస్తుంది. 10.25 ఇంచు హెచ్‌డీ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా 'బ్లైండ్ స్పాట్ మానిటరింగ్', 65డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్, వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్ వంటివి టాప్ ఎండ్ వేరియంట్లలో లభిస్తాయి.
హ్యుందాయ్ ఎక్స్టర్లో 8 ఇంచు టచ్‌స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నప్పటికీ, పంచ్‌లో ఉన్న భారీ టచ్‌స్క్రీన్, అత్యాధునిక కనెక్టెడ్ ఫీచర్ల ముందు ఈ ఎస్‌యూవీ కొంచెం వెనుకబడినట్లే కనిపిస్తుంది.
2026 టాటా పంచ్ వర్సెస్ హ్యుందాయ్ ఎక్స్టర్ ప్రాక్టికాలిటీ..
లగేజ్ స్పేస్ విషయంలో ఎక్స్టర్ (391 లీటర్లు) పంచ్ (366 లీటర్లు) కంటే స్వల్పంగా మెరుగ్గా ఉంది. అయితే, టాటా తన 'ట్విన్ సిలిండర్' టెక్నాలజీ ద్వారా సీఎన్జీ వేరియంట్‌లోనూ 210 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తూ ప్రాక్టికాలిటీని కాపాడుకుంది.
2026 టాటా పంచ్ వర్సెస్ హ్యుందాయ్ ఎక్స్టర్- ఇద్దరూ మొనగాళ్లే!
భద్రత విషయంలో రెండు సంస్థలు ఎక్కడా తగ్గలేదు. పంచ్ ఫేస్‌లిఫ్ట్, ఎక్స్టర్ ఎస్‌యూవీ రెండింటిలోనూ 6 ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తున్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), హిల్ హోల్డ్ కంట్రోల్ వంటివి రెండు కార్లలోనూ ఉన్నాయి. అయితే పంచ్‌లో అదనంగా ఉన్న హిల్ డిసెంట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా డ్రైవర్లకు కొండ ప్రాంతాల్లో, ఇరుకైన సందుల్లో డ్రైవింగ్ చేయడం సులభతరం చేస్తాయి.
"కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ శక్తివంతమైన ఇంజిన్, అదిరిపోయే ఫీచర్లతో సెగ్మెంట్ లీడర్‌గా ఎదగడానికి సిద్ధమైంది. అయితే, హ్యుందాయ్ ఎక్స్టర్ తన బడ్జెట్ ధర, స్మూత్ డ్రైవింగ్, బ్రాండ్ వ్యాల్యూతో ఇప్పటికీ బలమైన పోటీదారుగానే ఉంది," అని ఆటో నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో మీకు పవర్, లుక్స్ ముఖ్యం అనుకుంటే 2026 టాటా పంచ్ బెస్ట్ ఛాయిస్. అలా కాకుండా సిటీ డ్రైవింగ్, మైలేజీ కావాలనుకుంటే ఎక్స్టర్ వైపు చూడొచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


