మహీంద్రా XUV 7XO ఫస్ట్ డ్రైవ్ రివ్యూ- ఈ ఫ్యామిలీ ఎస్యూవీ ఎలా ఉంది?
యూటిలిటీ వాహనాల రారాజు మహీంద్రా తన పాపులర్ ఎక్స్‌యూవీ700ని 'ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ'గా రీబ్రాండ్ చేసి, ఇటీవలే లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో హెచ్‌టీ ఆటోకి సంబంధించిన ఈ ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఎస్యూవీ ఫస్ట్ డ్రైవ్ రివ్యూని ఇక్కడ చూసేయండి..
యూటిలిటీ వాహనాల మార్కెట్లో తిరుగులేని నాయకుడిగా ఉన్న మహీంద్రా.. తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎక్స్‌యూవీ700ని సరికొత్త హంగులతో 'ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ' పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. గతంలో ఎక్స్‌యూవీ300ని '3ఎక్స్ఓ'గా మార్చిన తరహాలోనే, ఇప్పుడు 700 సిరీస్‌ను కూడా కొత్త నామకరణ వ్యూహంలోకి చేర్చింది. కేవలం పేరు మార్పు మాత్రమే కాదు.. ఈ కొత్త తరం ఎస్‌యూవీని పట్టణ ప్రాంత కుటుంబాలకు మరింత దగ్గర చేసేలా అత్యాధునిక ఫీచర్లతో తీర్చిదిద్దింది.

ఈ కారు పనితీరును స్వయంగా పరీక్షించడానికి హెచ్‌టీ ఆటో టీమ్‌ని జైసల్మేర్‌కు ఆహ్వానించింది మహీంద్రా. ఎడారి ప్రాంతంలోని క్లిష్టమైన దారుల్లో ఈ కారు ఎలా ప్రయాణించింది? ఇచ్చిన హామీలను నిజంగా నెరవేర్చిందా? మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఫస్ట్ డ్రైవ్ రివ్యూని ఇక్కడ తెలుసుకోండి..
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ లుక్స్..
ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఎస్యూవీ డిజైన్ విషయంలో మహీంద్రా పెద్దగా ప్రయోగాలు చేయకుండా, ఇప్పటికే విజయవంతమైన రూపాన్ని మరింత మెరుగుపరిచింది. మొదటి చూపులో ఇది ఎక్స్‌యూవీ700 లాగే అనిపించినా, నిశితంగా గమనిస్తే ముందు భాగంలో చాలా మార్పులు కనిపిస్తాయి.
హెడ్‌ల్యాంప్స్: డే-టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (డీఆర్ఎల్స్) ఇప్పుడు మరింత సన్నగా 'సీ' ఆకారంలోకి మారాయి. స్ప్లిట్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, కొత్త గ్రిల్ దీనికి మరింత స్టైలిష్ లుక్ ఇచ్చాయి.
బంపర్: బంపర్ కింద సిల్వర్ ఫినిషింగ్ ఉన్న స్కిడ్ ప్లేట్, క్యూబ్ ఆకారంలో ఉన్న ఫాగ్ ల్యాంప్స్ దీనికి దూకుడును జోడించాయి. అయితే ఈ ఐస్ క్యూబ్ ఆకారపు లైట్లు కాస్త 'ఓవర్'గా అనిపించే అవకాశం ఉంది.
అల్లాయ్ వీల్స్: పక్క నుంచి చూస్తే కొత్తగా వచ్చిన 19 ఇంచ్ బ్లాక్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ కారుకు ఒక గంభీరమైన రూపాన్ని ఇచ్చాయి.
రేర్: ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ రేర్లోని ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్‌ని ఎక్స్ఈవీ 9ఎస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ నుంచి తీసుకుననారు. ఇది హెక్సాగొనల్ లైటింగ్ పాటర్న్‌లో ఉంటుంది. రీడిజైన్ చేసిన బంపర్ మీద ఇది కనిపిస్తుంది. ఈ మార్పుతో ఎస్యూవీ రేర్ లుక్ మరింత మోడర్న్‌గా ఉంటుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఇంటీరియర్..
కారు లోపలికి అడుగుపెట్టగానే ఒక ప్రీమియం ఫీలింగ్ కలుగుతుంది. ఇంటీరియర్ కలర్ థీమ్‌ను 'లూమినా అండ్ చెస్ట్ నట్ బ్రౌన్' రంగులోకి మార్చారు. ఇది లోపల మరింత వెచ్చదనాన్ని, విలాసాన్ని ఇస్తుంది.
స్క్రీన్స్: డ్యాష్ బోర్డు మీద మూడు 12.3 ఇంచ్ డిజిటల్ స్క్రీన్స్ కళ్లను ఆకట్టుకుంటాయి. ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్స్ట్రు మెంట్ క్లస్టర్, ప్యాసింజర్ కోసం ప్రత్యేక డిస్ప్లే.. ఇవన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి.
ఆడియో: 1,400డబ్ల్యూ సామర్థ్యం గల 16 స్పీకర్ల హర్మాన్ కార్డన్ సిస్టమ్ ఇందులో ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో ఇది ఒక సినిమా థియేటర్ అనుభూతిని ఇస్తుంది.
సౌకర్యాలు: సెకండ్ రో ప్రయాణికుల కోసం వెంటిలేటెడ్ సీట్లు, సన్ బ్లైండ్స్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్పేస్ విషయంలో ఎలాంటి రాజీ లేదు. అయితే మూడొవ వరుసలో మాత్రం పొడవుగా ఉండేవారికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ- టెక్నాలజీ, సేఫ్టీ..
మహీంద్రా భద్రతకు ఎప్పుడూ పెద్దపీట వేస్తుంది. ఇందులో స్టాండర్డ్ ఫీచర్లుగా ఆరు ఎయిర్ బ్యాగులు, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఏబీఎస్, ఈఎస్‌సీ వంటివి ఉన్నాయి. హై-ఎండ్ వేరియంట్లలో నీ-ఎయిర్ బ్యాగ్, అడ్వాన్స్‌డ్ లెవల్ 2 అడాస్ సిస్టమ్ ఉన్నాయి. గట్టిగా నొక్కితే ఫ్లెక్స్ అవుతున్న సెంటర్ కన్సోల్ బటన్లు మినహా, లోపల మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ- పర్ఫార్మెన్స్..
ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఎస్‌యూవీలో ఉన్న అత్యంత ముఖ్యమైన మార్పు దాని ‘డావిన్సీ డ్యాంపర్స్’ సస్పెన్షన్. ఇది ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ విభాగంలో పరిచయం చేశారు. రోడ్డు మీద ఉండే గుంతలు, స్పీడ్ బ్రేకర్లను ఈ సస్పెన్షన్ ఎంత తేలికగా తీసుకుంటుందంటే.. మీరు కారులో ప్రయాణిస్తున్నట్లు కాకుండా గాలిలో తేలుతున్నట్లు ఉంటుంది.
ఇంజిన్: 2.2 లీటర్ల డీజిల్ ఇంజిన్ (182బీహెచ్పీ, 450ఎన్ఎం) పనితీరు అమోఘం. ఇంజిన్ శబ్దం ఏమాత్రం లోపలికి రాదు. ఆటోమేటిక్ గేర్ బాక్స్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ- ఫస్ట్ డ్రైవ్ రివ్యూ..
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ కేవలం పేరు మార్పు మాత్రమే కాదు, ప్రయాణ అనుభవాన్ని మార్చేసే కొత్త అస్త్రం! అద్భుతమైన సస్పెన్షన్, విలాసవంతమైన ఫీచర్లు దీని సొంతం. మార్కెట్లో దీనికి గట్టి పోటీ ఇచ్చే కారు మరొకటి లేదని చెప్పవచ్చు.
పాత వర్షెన్‌తో పోల్చితే కొత్త ఎస్‌యూవీతో మహీంద్రా ఒక మెట్టు పైకి ఎక్కిందనే చెప్పాలి. ఫీచర్ల పరంగా ఇది ‘బెటర్ ఎక్విప్డ్’ మాత్రమే కాదు, లుక్స్ పరంగా కూడా బెస్ట్! అన్నింటికన్నా ముఖ్యమైనది.. సంస్థ ఇందులో రైడ్ క్వాలిటీని మెరుగుపరచడం. ఫలితంగా రూ. 13.66 లక్షల నుంచి రూ. 24.11 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద ఇది వాల్యూ ఫర్ మనీగా అనిపిస్తుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


