ICICI Bank credit card : ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు.. ఈ బెనిఫిట్స్ బంద్!
దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ తన క్రెడిట్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు తీసుకువస్తోంది. నవంబర్ 25 నుంచి దశలవారీగా కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ప్రీమియం కార్డులపై ఉచిత బీమా రక్షణ, ఐనాక్స్ సినిమా ఆఫర్లను బ్యాంకు నిలిపివేస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి..
మీరు ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? అయితే మీ కార్డు వాడకం, ఛార్జీలు, ఉచిత ప్రయోజనాలకు సంబంధించి రాబోయే కొద్ది వారాల్లో కీలక మార్పులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. దేశంలోనే రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన ఐసీఐసీఐ, తన క్రెడిట్ కార్డుల నిబంధనలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 15, 2026 మధ్య దశలవారీగా ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రీమియం, రిటైల్, బిజినెస్, కార్పొరేట్ విభాగాల్లోని వివిధ క్రెడిట్ కార్డులపై ఈ మార్పులు ప్రభావం చూపనున్నాయి.

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లోని ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, తరచూ విమాన ప్రయాణాలు చేసేవారు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులను విస్తృతంగా వాడుతుంటారు. వారాంతాల్లో ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లలో ఉచిత సినిమా టికెట్లు పొందడం నుంచి విదేశీ ప్రయాణాల్లో ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఉచిత ప్రమాద బీమా రక్షణ వరకు ఎన్నో సదుపాయాలను వినియోగదారులు ఆస్వాదిస్తున్నారు.
అయితే వినియోగదారుల సేవలను మరింత క్రమబద్ధీకరించడం, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంతో బ్యాంకు ఇప్పుడు ఆరు ప్రధాన మార్పులను తీసుకువస్తోంది. దీనివల్ల కొందరు వినియోగదారులు కార్డు రీప్లేస్‌మెంట్, ప్రయారిటీ పాస్ సేవలకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుండగా, మరికొందరు ఇప్పటివరకు పొందుతున్న ఉచిత బీమా, సినిమా ప్రయోజనాలను కోల్పోనున్నారు.
మూడు దశల్లో అమలు.. తేదీల వారీగా మార్పులు ఇలా!
ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటించిన ఈ ఆరు కీలక మార్పులు ఒకేసారి కాకుండా మూడు వేర్వేరు తేదీల్లో అమల్లోకి వస్తాయి. మొదటి రెండు మార్పులు మరో పది రోజుల్లో అంటే నవంబర్ 25 నుంచి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత డిసెంబర్ 11న మరో రెండు సవరణలు అమల్లోకి వస్తాయి. చివరగా మిగిలిన నాలుగు ఉచిత ప్రయోజనాల రద్దు నిర్ణయాలు డిసెంబర్ 15 నుంచి వర్తిస్తాయి.
రోజువారీ కార్డు సేవల విషయంలో వినియోగదారులపై ఆర్థిక భారం పడనుంది. కార్డు పోయినా లేదా పాడైనా కొత్త కార్డు తీసుకునేందుకు చెల్లించే రీప్లేస్‌మెంట్ ఛార్జీలు పెరగనున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో లాంజ్ సదుపాయం కోసం ఉపయోగించే ‘ప్రయారిటీ పాస్’ సేవలపై కొత్త రుసుములను బ్యాంకు ప్రవేశపెడుతోంది. మీరు ఎంచుకున్న కార్డు రకం, దానికి వర్తించే నిబంధనల ఆధారంగా సాధారణ సేవల ఖర్చు పెరిగే అవకాశం ఉంది.
ప్రీమియం కార్డులపై ఉచిత బీమా రక్షణకు కోత
డిసెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్న మార్పుల విషయంలో ప్రీమియం, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుదారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ కార్డులను ఎంచుకోవడానికి ప్రధాన కారణమైన కొన్ని విలువైన ఉచిత ప్రయోజనాలను బ్యాంకు నిలిపివేస్తోంది.
ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్, టైమ్స్ బ్లాక్, ఎమరాల్డ్ ప్రైవేట్, ఎమరాల్డ్, డయామంట్, సఫైరో, రూబిక్స్ క్రెడిట్ కార్డులపై ఇప్పటివరకు అందిస్తున్న ఉచిత విమాన ప్రమాద బీమా, సంబంధిత బీమా కవరేజీలను ఐసీఐసీఐ బ్యాంకు నిలిపివేస్తోంది.
అలాగే, ఏ కారణంతోనైనా ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే వర్తించే 'క్యాన్సిలేషన్ ఫర్ ఎనీ రీజన్' బీమా కవర్‌ను కూడా ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్, టైమ్స్ బ్లాక్, ఎమరాల్డ్, ఎమరాల్డ్ ప్రైవేట్ కార్డుల నుంచి తొలగిస్తోంది. వీటికి అదనంగా, పరాక్రమ్, పరాక్రమ్ సెలెక్ట్ కార్డుదారులు తమ కార్డులపై లభించే ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా, విమాన ప్రమాద బీమా రక్షణను కోల్పోనున్నారు.
ఐనాక్స్ సినిమా ఆఫర్లకు మంగళం!
సినిమా ప్రియులకు కూడా ఐసీఐసీఐ బ్యాంకు షాక్ ఇచ్చింది. ఎంపిక చేసిన తొమ్మిది రకాల క్రెడిట్ కార్డులపై అందిస్తున్న ఉచిత ఐనాక్స్ సినిమా టికెట్ ప్రయోజనాలను డిసెంబర్ 15 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కోరల్, రూబిక్స్, ఎక్స్‌ప్రెషన్స్, మేక్‌మైట్రిప్ వంటి ప్రాచుర్యం పొందిన కార్డులు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ప్రయోజనాలను క్రమం తప్పకుండా ఉపయోగించుకునే కస్టమర్లకు ఇకపై తమ క్రెడిట్ కార్డుల ద్వారా లభించే మొత్తం విలువ తగ్గే అవకాశం ఉంది.
కార్డుదారులు ఇప్పుడు ఏం చేయాలి?
మారుతున్న నిబంధనల నేపథ్యంలో ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుదారులు ఆయా తేదీల కంటే ముందే తమ కార్డు వేరియంట్‌కు సంబంధించిన సవరించిన నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించాలి. కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే ఈ మార్పులు వర్తిస్తాయని గానీ, ఇప్పటికే ఉన్న ఉచిత బీమా రక్షణ యథావిధిగా కొనసాగుతుందని గానీ అపోహ పడకూడదు.
ఒకవేళ మీరు ప్రయాణాల సమయంలో క్రెడిట్ కార్డు ద్వారా వచ్చే ఉచిత ప్రమాద బీమాపైనే ఆధారపడి ఉంటే, డిసెంబర్ 15 తర్వాత ప్రత్యామ్నాయంగా ప్రత్యేక బీమా పాలసీ తీసుకోవాలా వద్దా అన్నది సమీక్షించుకోవడం మంచిది. ఎలాంటి సందేహాలు, గందరగోళానికి తావులేకుండా బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ లేదా కస్టమర్ కేర్ ద్వారా తాజా వివరాలను తెలుసుకోవాలి. తద్వారా మీ నెలవారీ బడ్జెట్, క్రెడిట్ కార్డు ఖర్చులు, వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలను ముందుగానే సర్దుబాటు చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


