Bank fraud : ప్రముఖ బ్యాంకులో భారీ మోసం! రూ. 590 కోట్లు మాయం- ఉద్యోగులే..

చండీగఢ్‌లోని ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్ బ్రాంచ్‌లో రూ. 590 కోట్ల భారీ కుంభకోణం వెలుగుచూసింది. హరియాణా ప్రభుత్వ ఖాతాల్లోని నిధులను లక్ష్యంగా చేసుకుని నలుగురు బ్యాంక్ ఉద్యోగులు ఈ మోసానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Published on: Feb 22, 2026, 10:45:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చండీగఢ్‌లోని ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు ఏకంగా రూ. 590 కోట్ల మేర భారీ మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హరియాణా ప్రభుత్వ అనుబంధ ఖాతాలే లక్ష్యంగా ఈ అక్రమాలు జరిగినట్లు ఫిబ్రవరి 21న స్టాక్ ఎక్స్​ఛేంజీజీలకు సమర్పించిన నివేదికలో బ్యాంక్ అధికారికంగా వెల్లడించింది. ఈ మోసంలో బ్యాంకు ఉద్యోగులతో పాటు ఇతర వ్యక్తులు లేదా సంస్థల ప్రమేయం కూడా ఉండవచ్చని బ్యాంక్ భావిస్తోంది.

ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​లో రూ. 590 కోట్ల ఫ్రాడ్​! (Photographer: Dhiraj Singh / Bloomberg)
ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​లో రూ. 590 కోట్ల ఫ్రాడ్​! (Photographer: Dhiraj Singh / Bloomberg)

ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​- అసలు మోసం వెలుగులోకి వచ్చిందిలా..

హరియాణా ప్రభుత్వానికి చెందిన ఒక నిర్దిష్ట విభాగం, తమ ఖాతాను క్లోజ్ చేసి ఆ నిధులను వేరే బ్యాంకుకు బదిలీ చేయాలని కోరినప్పుడు ఈ భారీ కుంభకోణం బయటపడింది. ఆ ప్రక్రియలో భాగంగా, ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న బ్యాలెన్స్‌కు, బ్యాంక్ సిస్టమ్‌లో ఉన్న బ్యాలెన్స్‌కు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

దీనిని ప్రాథమికంగా పరిశీలించిన తర్వాత, ఫిబ్రవరి 18 నుంచి హరియాణా ప్రభుత్వానికి చెందిన మరికొన్ని విభాగాలు కూడా తమ ఖాతా బ్యాలెన్స్‌ల గురించి ఆరా తీశాయి. ఆ సమయంలో ప్రభుత్వం చెబుతున్న బ్యాలెన్స్‌కు, బ్యాంకులో ఉన్న వాస్తవ నిధులకు మధ్య తేడాలు స్పష్టంగా కనిపించాయి.

ఈ మొత్తం విలువ రూ. 590 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

కేవలం ఆ బ్రాంచ్‌కే పరిమితం!

ప్రాథమిక అంతర్గత సమీక్ష ప్రకారం.. ఈ మోసం చండీగఢ్ బ్రాంచ్‌లో ఉన్న హరియాణా ప్రభుత్వ అనుబంధ ఖాతాలకే పరిమితమైందని బ్యాంక్ స్పష్టం చేసింది. చండీగఢ్ బ్రాంచ్‌లోని మిగిలిన కస్టమర్లకు దీనితో ఎలాంటి సంబంధం లేదని, వారి నిధులు సురక్షితంగా ఉన్నాయని ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంకు తన నివేదికలో పేర్కొంది.

అయితే ఈ మోసం ఎప్పటి నుంచి జరుగుతోందనేది ఇంకా తెలియాల్సి ఉంది. దీనిని నిర్ధారించడానికి ఎక్స్​టర్నల్​ ఇండిపెండెట్​ ఎగ్జామినేషన్​అవసరమని బ్యాంక్ భావిస్తోంది.

నిందితుల ప్రమేయం:

ప్రాథమిక ఆధారాల ప్రకారం, చండీగఢ్ ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ బ్రాంచ్‌లో హరియాణా ప్రభుత్వ ఖాతాలను పర్యవేక్షించే నిర్దిష్ట ఉద్యోగులే ఈ పనికి ఒడిగట్టారు. ఈ క్రమంలో వారు ఇతర వ్యక్తులు లేదా సంస్థలతో చేతులు కలిపి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు దీనివల్ల బ్యాంకుపై పడే పూర్తి ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయడానికి క్లెయిమ్‌ల ధృవీకరణ, నిధుల రికవరీ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.

బ్యాంక్ తీసుకున్న కఠిన చర్యలు:

ఈ వ్యవహారాన్ని సీరియస్​గా తీసుకున్న ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్ యాజమాన్యం ఈ కింది చర్యలు చేపట్టింది:

సస్పెన్షన్: అనుమానితులుగా భావిస్తున్న నలుగురు అధికారులను విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు.

చట్టపరమైన చర్యలు: బాధ్యులైన ఉద్యోగులు, ఇతర వ్యక్తులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలతో పాటు సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు.

దర్యాప్తు సంస్థల రంగప్రవేశం: ఈ మోసంపై ఇప్పటికే రెగ్యులేటరీ సంస్థలకు సమాచారం అందించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలకు కూడా నివేదిస్తున్నారు. దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామని బ్యాంక్ తెలిపింది.

ఫొరెన్సిక్ ఆడిట్: లోతైన దర్యాప్తు కోసం ఒక ఏజెన్సీని నియమించి 'ఫొరెన్సిక్ ఆడిట్' జరిపించనున్నారు. అలాగే స్టాట్యూటరీ ఆడిటర్లకు కూడా ఈ మోసంపై సమాచారం ఇచ్చారు.

బోర్డు సమావేశాలు: ఫిబ్రవరి 20న 'స్పెషల్ కమిటీ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఫ్రాడ్స్' సమావేశమైంది. ఫిబ్రవరి 21న ఆడిట్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు ఈ విషయంపై పూర్తి వివరణ ఇచ్చారు.

రికాల్ రిక్వెస్ట్: అనుమానాస్పద ఖాతాలకు నిధులు బదిలీ అయిన ఇతర బ్యాంకులకు 'రికాల్ రిక్వెస్ట్' పంపారు. ఆయా ఖాతాల్లోని నిధులను స్తంభింపజేయాలని కోరారు.

ప్రశ్నలు- సమాధానాలు :-

ప్రశ్న- ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్‌లో నా వ్యక్తిగత సేవింగ్స్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా ఉంది. ఈ రూ. 590 కోట్ల మోసం వల్ల నా సొమ్ముకు ఏమైనా ముప్పు ఉందా?

సమాధానం-లేదు, మీ నిధులు పూర్తిగా సురక్షితం. బ్యాంక్ స్టాక్ ఎక్స్​ఛేంజీలకు సమర్పించిన అధికారిక నివేదిక ప్రకారం, ఈ మోసం కేవలం చండీగఢ్ బ్రాంచ్‌లోని హరియాణా ప్రభుత్వానికి చెందిన కొన్ని నిర్దిష్ట ఖాతాలకు మాత్రమే పరిమితమైంది. ఇతర సాధారణ కస్టమర్ల ఖాతాలపై దీని ప్రభావం ఏమాత్రం లేదని బ్యాంక్ స్పష్టం చేసింది. కాబట్టి వ్యక్తిగత ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ప్రశ్న- ఇలాంటి మోసాలు జరిగినప్పుడు ప్రభుత్వం లేదా బ్యాంక్ తీసుకునే తదుపరి చర్యలు ఏంటి?

సమాధానం- బ్యాంక్ ఇప్పటికే 'ఫొరెన్సిక్ ఆడిట్'కు ఆదేశించింది. దీని ద్వారా నిధులు ఎక్కడికి బదిలీ అయ్యాయో గుర్తిస్తారు. ఒకవేళ నిధులు ఇతర బ్యాంకులకు వెళితే, ఆయా ఖాతాలను స్తంభింపజేయాలని 'రికాల్ రిక్వెస్ట్' పంపుతారు. దర్యాప్తు సంస్థలు నిందితుల ఆస్తులను జప్తు చేయడం ద్వారా కూడా నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తాయి. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా అంతర్గత భద్రతా వ్యవస్థలను బ్యాంకులు మరింత పటిష్టం చేస్తాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More