...
...
Next Story

250 జాబ్స్​కి అప్లై చేసిన IIM గ్రాడ్యుయేట్.. ఒక్క ఇంటర్వ్యూ కాల్​ కూడా రాలేదు!

దేశంలో జాబ్​ మార్కెట్​ పరిస్థితి ఎంత ఆందోళకనరంగా ఉందో వివరించే ఘటన ఇది! దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐఎం కోజికోడ్‌లో ఎంబీఏ పూర్తి చేసి, మూడేళ్ల అనుభవం ఉన్నప్పటికీ ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రావడం లేదని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Published on: Sep 21, 2026, 06:45:34 IST
Advertisement

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) నుంచి ఎంబీఏ పట్టా.. దానికి తోడు డేటా అనలిటిక్స్ విభాగంలో మూడేళ్ల ఎక్స్​పీరియెన్స్.. సాధారణంగా ఇలాంటి ప్రొఫైల్ ఉన్న అభ్యర్థులకు కంపెనీలు మంచి ప్యాకేజీతో ఎదురొచ్చి ఉద్యోగం ఇస్తాయని భావిస్తారు. కానీ, ప్రస్తుతం కార్పొరేట్ రంగంలో కనిపిస్తున్న మందగమనం ఈ అంచనాలను పూర్తిగా తలకిందులు చేస్తోంది! 250కి పైగా కంపెనీలకు దరఖాస్తు చేసినప్పటికీ తనకు ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదని ఐఐఎం కోజికోడ్ గ్రాడ్యుయేట్ ఒకరు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న తీవ్ర ఆవేదన ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తోంది.

250 దరఖాస్తులు.. జీరో ఇంటర్వ్యూ కాల్స్!

'250 జాబ్స్​కి అప్లై చేసినా.. ఒక్క కాల్ కూడా రాలేదు!'
'250 జాబ్స్​కి అప్లై చేసినా.. ఒక్క కాల్ కూడా రాలేదు!'

ఎంబీఏ పూర్తయిన తర్వాత తనకు వచ్చిన 'జెన్‌మ్యాన్' అనే సంస్థలోని ఉద్యోగం నచ్చకపోవడంతో సదరు అభ్యర్థి వేరే కంపెనీకి మారాలని ప్రయత్నాలు ప్రారంభించారు. లింక్డ్‌ఇన్, నౌకరీ, ఐఐఎం జాబ్స్ వంటి ప్రముఖ పోర్టళ్లతో పాటు కంపెనీల హెచ్ఆర్‌లు, రిక్రూటర్లకు నేరుగా ఈమెయిళ్లు (కోల్డ్ ఈమెయిలింగ్) పంపారు. రోజులు గడుస్తున్నా దాదాపు 250కి పైగా అప్లికేషన్లకు అధిక భాగం తిరస్కరణలే ఎదురయ్యాయి. మిగిలిన చాలా కంపెనీల నుంచి అసలు ఎలాంటి స్పందనా రాలేదు!

"ఇంజినీరింగ్ పూర్తి చేసి, మూడేళ్లు డేటా అనలిటిక్స్‌లో పనిచేశాను. ఇటీవల ఐఐఎం కోజికోడ్‌లో ఎంబీఏ పూర్తి చేశాను. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నచ్చక వేరే కంపెనీకి మారడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నాను. 250 దరఖాస్తులు దాటినా ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదు. మెజారిటీ కంపెనీలు తిరస్కరించాయి, మిగిలిన వాటి నుంచి అసలు సమాధానమే లేదు," అని ఆ అభ్యర్థి రెడిట్ వేదికగా తన ఆవేదనను వెళ్లగక్కారు.

ఏటీఎస్ స్కోర్ ఉన్నా దక్కని ప్రాధాన్యం!

ప్రస్తుతం చాలా కంపెనీలు అభ్యర్థుల దరఖాస్తులను ఆటోమేటిక్‌గా వడపోసేందుకు 'అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్' (ఏటీఎస్) అనే ఏఐ టూల్స్ వాడుతున్నాయి. తన రెజ్యూమ్ ఫార్మాటింగ్ లేదా కీవర్డ్స్‌లో ఏమైనా లోపాలు ఉన్నాయేమోనని సదరు అభ్యర్థి పలు ఏటీఎస్ చెకర్ల ద్వారా తనిఖీ చేయగా, ప్రతిసారీ 75 శాతానికి పైగా స్కోరు వచ్చింది. అంటే ఫార్మాట్ సరిగ్గానే ఉన్నప్పటికీ, హెచ్ఆర్‌ల నుంచి కనీస స్పందన రాకపోవడం అతడిని మరింత గందరగోళంలోకి నెట్టింది.

కలవరపెడుతున్న ఐటీ మందగమనం, ఏఐ ప్రభావం!

గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, కంపెనీలు వ్యయ నియంత్రణ పాటించడం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత వేగంగా అందుబాటులోకి రావడం వల్ల కొత్త ఉద్యోగాల కల్పన గణనీయంగా తగ్గిపోయిందని రిక్రూట్‌మెంట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు ఎంబీఏ పూర్తయిన తర్వాత తాజా అనుభవం లేకపోవడం కూడా సదరు అభ్యర్థికి ఇంటర్వ్యూ కాల్స్ రాకపోవడానికి ఒక కారణం కావచ్చునని భావిస్తున్నారు.

ఐఐఎం లాంటి ప్రీమియం విద్యాసంస్థల్లో చదివిన అభ్యర్థులే ఒక ఇంటర్వ్యూ కాల్ కోసం ఇన్ని అవస్థలు పడుతుంటే, సాధారణ కళాశాలల గ్రాడ్యుయేట్ల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

అయితే, ప్రస్తుత కష్టకాలంలో ఓర్పుతో పాటు నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవడం ఒక్కటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks