IND vs ENG T20 : పసికూనల చేతిలో ఓడిపోయిన టీమిండియాకు కఠిన సవాలు! రేపటి నుంచే ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్..
IND vs ENG 1st T20 : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎంతో ఆసక్తి రేపుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జులై 1, 2026 నుంచి ప్రారంభం కానుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న టీమిండియాకు హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ కఠిన సవాలు విసిరేందుకు రెడీ అవుతోంది.
క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో హై-వోల్టేజ్ సిరీస్ సిద్ధమైంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జులై 1 నుంచి చెస్టర్-లీ-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ గ్రౌండ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ఇరు జట్లకు అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే 2028 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌తో పాటు, క్రికెట్ ఎంట్రీ ఇవ్వనున్న ఒలింపిక్ క్రీడలను దృష్టిలో ఉంచుకుని ఇరు జట్లు తమ కొత్త టీ20 సైకిల్ ప్రిపరేషన్స్‌ను వేగవంతం చేయనున్నాయి.

కాగా టీమిండియాకు ఈ సిరీస్ మరింత కీలకంగా మారనుంది! గత వారం పసికూన ఐర్లాండ్ చేతుల్లో దారుణ ఓటమి అనంతరం, తిరిగి ఫామ్‌లోకి వచ్చి, ఆ మచ్చను చెరిపేసుకునేందుకు భారత జట్టుకు ఇది మంచి అవకాశం.
ఐర్లాండ్‌తో ఓటమి అనంతరం ఇప్పుడు అందరి ఫోకస్ 15ఏళ్ల సూర్యవంశీపై పడింది. ఐర్లాండ్‌పై అతడిని ఆడించనుందుకు ఇప్పటికే టీమిండియా మేనేజ్మెంట్, కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌పై వైభవ్ సూర్యవంశీ ఆడటం ఖాయమని చాలా మంది భావిస్తున్నారు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్- కొత్త కెప్టెన్సీలో..
ప్రస్తుతం ప్రపంచ నంబర్ 1 టీ20 జట్టుగా ఉన్న భారత్.. ఐర్లాండ్ చేతిలో ఎదురైన ఘోర 0-2 ఓటమి షాక్ నుంచి తేరుకుని, ఇంగ్లాండ్ గడ్డపై సత్తా చాటాలని పట్టుదలతో ఉంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఈ జట్టులో వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ కీలక పాత్ర పోషించనున్నాడు. వీరితో పాటు సంజూ శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టుకు బలాన్ని ఇస్తున్నారు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్- రివేంజ్ మోడ్‌లో ఇంగ్లాండ్!
మరోవైపు హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2026 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ చేతిలో 7 పరుగుల తేడాతో ఓడిపోయి టైటిల్ రేసు నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్‌కు, సొంత గడ్డపై భారత్‌ను ఓడించి రివెంజ్ తీర్చుకునేందుకు ఇదొక సువర్ణావకాశం.
కెప్టెన్ బ్రూక్‌తో పాటు జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సామ్ కరన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఇంగ్లాండ్ జట్టులో ఉన్నారు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్- ఎక్కడ చూడవచ్చు?
భారతదేశంలోని క్రికెట్ ప్రేమికులు ఈ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌ని సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చు. అలాగే డిజిటల్ వినియోగదారులు సోనీ లివ్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్‌ను వీక్షించవచ్చు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్- షెడ్యూల్ ఇలా..
(భారత కాలమానం ప్రకారం)
| మ్యాచ్ | డేట్ | వేదిక | సమయం |
|---|---|---|---|
| మొదటి టీ20 | జులై 1 | రివర్‌సైడ్ గ్రౌండ్, చెస్టర్ లీ స్ట్రీట్ | రాత్రి 10 గంటలకు |
| రెండో టీ20 | జులై 4 | ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ గ్రౌండ్, మ్యాంచెస్టర్ | రాత్రి 7 గంటలకు |
| మూడొవ టీ20 | జులై 7 | ట్రెంట్ బ్రిడ్జ్, నాటిగ్హామ్ | రాత్రి 10 గంటలకు |
| నాల్గొవ టీ20 | జులై 9 | కౌంటీ గ్రౌండ్, బిస్టోల్ | రాత్రి 10 గంటలకు |
| ఐదొవ టీ20 | జులై 11 | ది రోజ్ బౌల్, సౌతాంప్టన్ | రాత్రి 7 గంటలకు |
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్- ఇరు జట్ల వివరాలు..
భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, సూర్యాంశ్ షెడ్గే, ప్రసిద్ధ్ కృష్ణ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివం దూబే, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.
ఇంగ్లాండ్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, జేమ్స్ కోల్స్, జోర్డాన్ కాక్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.
టీ20 సిరీస్ అనంతరం టీమిండియా ఇంగ్లాండ్‌తో 3 మ్యాచుల వన్డే సిరీస్ ఆడనుంది. అవి జులై 14, 16, 19 తేదీల్లో జరగనున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


