Ind vs Pak : క్రికెట్​ ఒక్కటే కాదు.. ఇతర స్పోర్ట్స్​లోనూ ఇండియాని ఓడించలేక అల్లాడిపోతున్న పాక్​!

భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య క్రీడా సమరం అంటే ఒకప్పుడు నరాలు తెగే ఉత్కంఠ ఉండేది. కానీ కాలక్రమేణా ఆ పరిస్థితి మారిపోయింది. క్రికెట్ నుంచి హాకీ వరకు అన్ని క్రీడల్లోనూ భారత్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తుంటే, పాకిస్థాన్ క్రీడారంగం మాత్రం పతనం దిశగా సాగుతోంది. గణాంకాలు కూడా ఇదే నిజాన్ని చెబుతున్నాయి.

Published on: Feb 17, 2026 6:01 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ల్లో సరదా, సరదా వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే పాకిస్థాన్‌తో “రైవల్రీ” గురించి గత సెప్టెంబరులో జరిగిన ఆసియా కప్ సందర్భంగా ఆయన చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు కేవలం జోక్ మాత్రమే కాదు, వాస్తవం!

ఆదివారం జరిగిన భారత్​- పాక్​ టీ20 మ్యాచ్​లో దృశ్యం..
ఆదివారం జరిగిన భారత్​- పాక్​ టీ20 మ్యాచ్​లో దృశ్యం..

"రెండు జట్ల మధ్య పోటీ గురించి పదేపదే అడగడం ఆపేయండి. నా ఉద్దేశంలో రెండు జట్లు ఒక 15-20 మ్యాచ్‌లు ఆడితే, అందులో ఫలితాలు 7-7 లేదా 8-7 గా ఉంటే దానిని అసలైన పోటీ అనవచ్చు. కానీ 13-0, 10-1 వంటి రికార్డులు ఉంటే దాన్ని ఏకపక్షం అనాలి తప్ప పోటీ అనలేం," అని సూర్యకుమార్ స్పష్టం చేశారు.

ఆదివారం కొలంబోలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌ మ్యాచ్​లోనూ భారత్ విజయం సాధించడంతో సూర్య మాటలు మరోసారి అక్షర సత్యాలయ్యాయి.

అయితే ఇది కేవలం క్రికెట్​కే పరిమితం కాలేదు! ఒకప్పుడు గట్టిపోటీని ఇచ్చి, “ఉత్కంఠ”కు మారుపేరైన ఇతర క్రిడల్లో కూడా ఇప్పుడు పాక్​ జట్టు పేలవ ప్రదర్శన చేస్తోంది.

ఇండియా వర్సెస్​ పాకిస్థాన్​​- అన్ని క్రీడల్లోనూ ఇదే పరిస్థితి..

క్రికెట్ విషయానికి వస్తే మైదానం వెలుపల భారీ స్థాయిలో హైప్ కనిపిస్తున్నప్పటికీ, మైదానంలో మాత్రం ఆట ఏకపక్షంగా సాగుతోంది. హాకీ, స్క్వాష్, టెన్నిస్.. ఇలా ఏ క్రీడ తీసుకున్నా ఫలితం భారత్ వైపే అన్నట్టుగా మారిపోయింది.

ఇండియా వర్సెస్​ పాకిస్థాన్​- మారిపోయిన కాలం..

ఒకప్పుడు ఇమ్రాన్ ఖాన్, జావేద్ మియాందాద్, వకార్ యూనిస్ వంటి దిగ్గజాలు.. మన కపిల్ దేవ్, గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌లకు ధీటుగా నిలిచేవారు. 1980, 90వ దశకాల్లో షార్జా వేదికగా జరిగే మ్యాచ్‌లు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేవి.

ఇక హాకీలో ధనరాజ్ పిళ్లై, షాబాజ్ అహ్మద్‌లు తమ స్టిక్స్‌తో మ్యాజిక్ చేస్తూ అద్భుతమైన పోటీని ఇచ్చేవారు. 2006లో లియాండర్ పేస్ నేతృత్వంలోని భారత టెన్నిస్ జట్టు, ఐసామ్ ఉల్ హక్ ఖురేషీ సారథ్యంలోని పాకిస్థాన్‌తో తలపడినప్పుడు ఆ ఉత్కంఠ మాటలకు అందేది కాదు.

కానీ ఇప్పుడు సీన్ మారింది! 2024లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన ద్వితీయ శ్రేణి భారత టెన్నిస్ జట్టు కూడా ఇస్లామాబాద్‌లో ఆతిథ్య జట్టును 4-0తో చిత్తు చేసింది. 40 ఏళ్లు పైబడిన ఐసామ్, అఖీల్ ఖాన్‌లే ఇప్పటికీ పాక్ తరఫున సింగిల్స్ ఆడాల్సి వస్తుందంటే అక్కడి క్రీడారంగం ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

ఇండియా వర్సెస్​ పాకిస్థాన్​- గణాంకాలు ఏం చెబుతున్నాయి?

క్రికెట్: వన్డేల్లో భారత్‌పై పాకిస్థాన్‌కు 73-58 ఆధిక్యం ఉన్నప్పటికీ, 2010 తర్వాత జరిగిన 18 మ్యచుల్లో భారత్ 14 గెలిచింది. టీ20ల్లో భారత్ 14-3 ఆధిక్యంలో ఉండగా, వరల్డ్ కప్‌ల్లో ఈ రికార్డు 8-1గా ఉంది.

హాకీ: గత దశాబ్ద కాలంగా పాకిస్థాన్ భారత్‌ను ఓడించలేకపోయింది. (2023 ఆసియా క్రీడల్లో భారత్ 10-2 ఓటమి మినహాయిస్తే)

నిపుణులు ఏమంటున్నారు?

భారత హాకీ దిగ్గజం ధనరాజ్ పిళ్లై ఈ అంశంపై స్పందిస్తూ.. "నేను పాకిస్థాన్‌తో 50కి పైగా మ్యాచ్‌లు ఆడాను. అప్పట్లో ప్రతి మ్యాచ్ ఒక యుద్ధంలా ఉండేది. ఆటగాళ్లలోనూ, ప్రేక్షకుల్లోనూ ఆ కసి కనిపించేది. కానీ ఇప్పుడు ఒక జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. పాకిస్థాన్‌లో క్రీడల పతనం దీనికి ప్రధాన కారణం. పాక్ క్రికెట్ కూడా వారి హాకీలాగే అంతరించిపోతుందేమోనని భయమేస్తోంది," అని ఆందోళన వ్యక్తం చేశారు.

ఒక్క అక్షర్ నదీమ్ మాత్రమే మినహాయింపు!

పాక్ క్రీడారంగం కుదేలవుతున్న వేళ, జావలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ మాత్రమే ఆ దేశానికి ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. నీరజ్ చోప్రాతో ఆయన సాగించే పోటీ క్రీడాభిమానులను అలరిస్తోంది. అయితే ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత నదీమ్ స్వయంగా మాట్లాడుతూ, పాకిస్థాన్‌లో కౌన్సిలింగ్, శిక్షణ సదుపాయాలు, ఆర్థిక సహాయం ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో వివరించారు.

మొత్తానికి, భారత్-పాకిస్థాన్ క్రీడా సమరాలు ఇప్పుడు కేవలం పేరుకే 'రైవల్రీ'గా మిగిలిపోయాయి. మైదానంలో మాత్రం భారత్ జైత్రయాత్ర నిరంతరాయంగా కొనసాగుతోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More