పెట్రోల్, డీజిల్ కోసం కంగారు పడొద్దు.. మన దగ్గర 'ఫుల్' స్టాక్ ఉంది: కేంద్రం కీలక ప్రకటన!

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందనే ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దేశవ్యాప్తంగా తగినంత నిల్వలు ఉన్నాయని, ఎవరూ కంగారు పడి కొనుగోలు (Panic Buying) చేయవద్దని సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Published on: Mar 14, 2026 5:52 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, దేశంలో ఇంధన సరఫరాపై నెలకొన్న నీలినీడలను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. భారత్‌లో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

హైదరాబాద్ లో పెట్రోల్ బంక్ వద్ద బారులు తీరిన ఆటోలు (PTI)
హైదరాబాద్ లో పెట్రోల్ బంక్ వద్ద బారులు తీరిన ఆటోలు (PTI)

కంగారు పడి నిల్వ చేయకండి

అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరా ఆగిపోతుందనే భయంతో చాలామంది పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఒక అడ్వైజరీ జారీ చేసింది. "దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ అవుట్‌లెట్లలో పెట్రోల్, డీజిల్ తగినంత అందుబాటులో ఉన్నాయి. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు" అని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా, అనధికారిక కంటైనర్లు లేదా బాటిళ్లలో పెట్రోల్‌ను తీసుకెళ్లడం, నిల్వ చేయడం ప్రాణాంతకమని, అలాంటి పనులు చేయవద్దని హెచ్చరించింది.

బంకులపై నిఘా.. కఠిన చర్యలు

భద్రతా నిబంధనలు ఉల్లంఘించే బంకులపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా తమిళనాడులోని ఒక పెట్రోల్ బంకులో నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లలో పెట్రోల్ పోయడం అధికారుల దృష్టికి వచ్చింది. దీనిని తీవ్రంగా పరిగణించిన మంత్రిత్వ శాఖ, ఆ బంకు లైసెన్స్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని బంకులు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రధాని మోదీ దౌత్యం.. సురక్షితంగా ఇంధన నిల్వలు

కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పార్లమెంటు వేదికగా దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు. "దేశంలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, విమాన ఇంధనం (ATF) లేదా ఎల్పీజీ.. ఇలా దేనికీ కొరత లేదు. ఇంధన భద్రత విషయంలో భారత్ పూర్తి ధీమాతో ఉంది" అని ఆయన లోక్‌సభలో ప్రకటించారు.

ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం వల్ల 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' (Strait of Hormuz) మార్గంలో సరఫరా ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే అయినా, భారత్ మాత్రం ముందస్తుగానే తగినన్ని నిల్వలను సమకూర్చుకుందని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరిపిన అంతర్జాతీయ దౌత్య సంప్రదింపుల వల్ల, యుద్ధం వల్ల సరఫరా ఆగిపోయినా దేశానికి సరిపడా ముడిచమురును మనం సేకరించగలిగామని ఆయన వివరించారు. రెస్టారెంట్లు మరియు గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ సరఫరా కూడా పూర్తిగా సురక్షితంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ):

1. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత నిజంగా ఉందా?

లేదు. కేంద్ర ప్రభుత్వం, పెట్రోలియం శాఖ మంత్రి స్వయంగా దేశంలో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా స్థిరంగా ఉందని స్పష్టం చేశారు.

2. బాటిళ్లు లేదా క్యాన్లలో పెట్రోల్ తీసుకోవచ్చా?

కచ్చితంగా వద్దు. ఇది భద్రతా నియమాలకు విరుద్ధం, అత్యంత ప్రమాదకరం. ఇలా ఇంధనం అమ్మే బంకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

3. యుద్ధం వల్ల ధరలు పెరిగే అవకాశం ఉందా?

అంతర్జాతీయంగా ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం ప్రస్తుతం సరఫరాకు ఎటువంటి డోకా లేదని భరోసా ఇచ్చింది. దేశీయ నిల్వలు సురక్షితంగా ఉన్నాయి.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More