ఇండియా, న్యూజిలాండ్ తొలి వన్డే ఈరోజే.. గాయంతో రిషబ్ పంత్ ఔట్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

న్యూజిలాండ్ తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆదివారం (జనవరి 11) ప్రారంభం కానుంది. కొత్త ఏడాదిలో ఆడబోయే తొలి సిరీస్ ఇదే. మరోవైపు గాయంతో రిషబ్ పంత్ ఈ సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

Published on: Jan 11, 2026, 08:01:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. 2026లో టీమిండియా తన తొలి సిరీస్ ను ఆదివారం (జనవరి 11) ప్రారంభించనుంది. వడోదరలోని కోటంబి స్టేడియం వేదికగా జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో.. యువ సంచలనం శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా, మైఖేల్ బ్రేస్‌వెల్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది.

ఇండియా, న్యూజిలాండ్ తొలి వన్డే ఈరోజే.. గాయంతో రిషబ్ పంత్ ఔట్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే? (AP)
ఇండియా, న్యూజిలాండ్ తొలి వన్డే ఈరోజే.. గాయంతో రిషబ్ పంత్ ఔట్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే? (AP)

రోహిత్, కోహ్లీలపైనే ఫోకస్

గత సిరీస్‌లో సౌతాఫ్రికాపై చెలరేగి ఆడిన సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపైనే అందరి దృష్టి ఉంది. కేవలం ఇంటర్నేషనల్ మ్యాచ్‌లే కాకుండా.. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలోనూ వీరిద్దరూ బౌలర్లను ఉతికారేశారు. పరుగుల వరద పారిస్తున్న ఈ ఇద్దరూ వడోదరలోనూ అదే జోరు కొనసాగిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

తిరిగొచ్చిన శ్రేయస్.. దూరమైన బుమ్రా

సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ పడుతూ గాయపడిన వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. రెండు నెలల విరామం తర్వాత జట్టులోకి రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. అతను తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. అయితే రాబోయే మెగా టోర్నీల దృష్ట్యా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కోసం జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి కల్పించారు. మరోవైపు టీ20 వరల్డ్ కప్‌పై దృష్టి పెట్టిన న్యూజిలాండ్.. తమ పూర్తి స్థాయి సీనియర్ జట్టును కాకుండా బ్రేస్‌వెల్ కెప్టెన్సీలో యువ జట్టును బరిలోకి దించుతోంది.

రిషబ్ పంత్‌కు గాయం.. సిరీస్ నుంచి అవుట్

మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. డాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం కారణంగా కివీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. శనివారం (జనవరి 10) ప్రాక్టీస్ సెషన్‌లో త్రో-డౌన్ స్పెషలిస్ట్ విసిరిన బంతి పంత్ నడుము పైభాగంలో బలంగా తాకింది. నొప్పితో విలవిల్లాడిన పంత్‌ను వెంటనే కోచ్ గౌతమ్ గంభీర్, సపోర్ట్ స్టాఫ్ పరిశీలించారు.

గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను వడోదర నుంచి ఇంటికి బయలుదేరనున్నాడని సమాచారం. జట్టులో రెండో వికెట్ కీపర్ అందుబాటులో ఉన్నప్పటికీ.. పంత్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో కారు ప్రమాదం, ఆ తర్వాత ఇంగ్లండ్ సిరీస్‌లో గాయం.. ఇలా వరుస ఆటంకాల తర్వాత పంత్ కోలుకుంటున్న సమయంలో మళ్లీ గాయపడటం ఆందోళన కలిగిస్తోంది.

మ్యాచ్ వివరాలు, లైవ్ స్ట్రీమింగ్

తేదీ, సమయం: జనవరి 11, ఆదివారం, మధ్యాహ్నం 1:30 గంటలకు (టాస్ 1:00 గంటలకు).

వేదిక: బీసీఏ స్టేడియం, కోటంబి, వడోదర.

టీవీ టెలికాస్ట్: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్.

లైవ్ స్ట్రీమింగ్: జియో హాట్‌స్టార్ (JioHotstar) యాప్, వెబ్‌సైట్.

తుది జట్లు (అంచనా)

భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

న్యూజిలాండ్: మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, మిచెల్ హే, నిక్ కెల్లీ, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, విల్ యంగ్, సాంట్నర్, కైల్ జేమిసన్, జేడన్ లెనాక్స్

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More