వర్షం, ఆసీస్ బౌలర్లు-టీమిండియా బ్యాటింగ్ ఫెయిల్యూర్-సున్నాకే కోహ్లి ఔట్-26 ఓవర్లలో స్కోరు ఇదే-తెలుగు ఆల్ రౌండర్ డెబ్యూ

ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో అటు వర్షం, ఇటు బౌలర్లు టీమిండియా బ్యాటర్లకు సవాలు విసిరారు.  వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో భారత జట్టు తడబడింది. విరాట్ కోహ్లి సున్నాకే ఔటయ్యాడు. 

Published on: Oct 19, 2025, 14:55:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలా కాలం తర్వాత మైదానంలో అడుగుపెట్టిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కమ్ బ్యాక్ ఊహించినట్లుగా జరగలేదు. వర్షం, ఆస్ట్రేలియా బౌలర్లు కలిసి టీమిండియాను దెబ్బకొట్టారు. దీంతో ఆదివారం పెర్త్ లో జరుగుతున్న తొలి వన్డేలో ఇండియా బ్యాటింగ్ లో తడబడింది. 26 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులే చేసింది.

నిరాశపర్చిన విరాట్ కోహ్లి (AFP)
నిరాశపర్చిన విరాట్ కోహ్లి (AFP)

వర్షం దెబ్బ

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ వన్డేకు వర్షం దెబ్బ పడింది. రెండు సార్లు ఆటకు అంతరాయం కలిగించడంతో ఇన్నింగ్స్ కు 50 ఓవర్ల పాటు జరగాల్సిన ఆటను 26 ఓవర్లకు కుదించారు. మబ్బు పట్టిన పరిస్థితుల్లో పెర్త్ పిచ్ పై ఆసీస్ బౌలర్లు చెలరేగి భారత్ ను గట్టి దెబ్బ కొట్టారు.

వికెట్లు ఢమాల్

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. హేజిల్ వుడ్, మిచెల్ ఓవెన్, మాథ్యూ కునెమన్ తలో రెండు వికెట్లతో ఇండియాను కుప్పకూల్చారు. టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ చాలా కాలం తర్వాత మైదానంలోకి వచ్చారు.

రోహిత్, కోహ్లి ఫెయిల్

కమ్ బ్యాక్ లో రోహిత్, కోహ్లి ఫెయిలయ్యారు. శుభ్ మన్ గిల్ తో కలిసి ఓపెనింగ్ చేసిన రోహిత్ 8 పరుగులే చేశాడు. అతణ్ని హేజిల్ వుడ్ ఔట్ చేశాడు. ఇక 8 బంతులాడిన విరాట్ కోహ్లి సున్నాకే డకౌటయ్యాడు. స్టార్క్ బాల్ కు బలయ్యాడు కోహ్లి. కెప్టెన్ శుభ్ మన్ గిల్ (10), శ్రేయస్ అయ్యర్ (11) కూడా ఫెయిలయ్యారు.

అక్షర్, రాహుల్ పోరాటం

45 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్ కనీసం వంద పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఆ దశలో కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (31) పోరాడారు. ఈ జోడీ ఆసీస్ బౌలర్లకు ఎదురొడ్డి నిలబడింది. వీళ్ల పుణ్యామా అని టీమ్ స్కోరు 100 దాటగలిగింది. కానీ చివర్లో మళ్లీ టపటపా వికెట్లు పడ్డాయి. చివరకు టీమ్ 136 పరుగులే చేసింది.

నితీశ్ డెబ్యూ

ఈ మ్యాచ్ తో తెలుగు ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి వన్డేల్లో డెబ్యూ చేశాడు. ఇప్పటికే ఇండియా తరపున 9 టెస్టులు, 4 టీ20లు ఆడిన ఈ విశాఖ పేస్ ఆల్ రౌండర్ ఇప్పుడు వన్డేల్లోకి వచ్చేశాడు. ఇండియా తరపున మూడు ఫార్మాట్లలోనూ మ్యాచ్ లాడాడు. ఆస్ట్రేలియాతో వన్డేలో 11 బంతులాడిన నితీశ్ కుమార్ రెడ్డి 19 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరోవైపు ఇది రోహిత్ శర్మకు 500వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More