Infosys share : ఐటీ ఇండెక్స్ క్రాష్- ఇన్ఫోసిస్ షేర్లు 8శాతం డౌన్! అసలేం జరుగుతోంది?
Indian IT stocks : గ్లోబల్ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ తన వార్షిక ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించడంతో భారతీయ ఐటీ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా 7 శాతం పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళనలో పడ్డారు. ఇన్ఫోసిస్ షేర్లు అయితే 8శాతం డౌన్ అయ్యాయి.
భారతీయ స్టాక్ మార్కెట్లో ఐటీ రంగానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశీయ ఐటీ కంపెనీల షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ టెక్నాలజీ సేవల దిగ్గజం యాక్సెంచర్ తన పూర్తి సంవత్సర ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించడం, అలాగే తదుపరి త్రైమాసికానికి బలహీనమైన అంచనాలను విడుదల చేయడమే ఇందుకు ప్రధాన కారణం. యాక్సెంచర్ ఇచ్చిన ఈ షాక్‌తో ఐటీ రంగంలో డిమాండ్ తగ్గుతోందనే ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి.

దీని ప్రభావంతో మార్కెట్ సూచీ నిఫ్టీ 50 1 శాతం నష్టపోతే, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 7 శాతం మేర కుప్పకూలింది. ఉదయం 9:50 ప్రాంతంలో కాస్త తేరుకుని 5.5శాతం నష్టాల్లో కొనసాగుతోంది.
ఇక నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో ఉన్న అన్ని కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టాయి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అత్యధికంగా 8.1 శాతం నష్టపోగా, దాని వెనుకే ఎంఫాసిస్, టెక్ మహీంద్రా, పర్సిస్టెంట్ సిస్టమ్స్, టీసీఎస్ కంపెనీల షేర్లు 5 నుంచి 6 శాతం కంటే ఎక్కువ పడిపోయాయి. మరోవైపు హెచ్‌సీఎల్ టెక్, కోఫోర్జ్, ఎల్‌టీఐఎం మైండ్‌ట్రీ షేర్లు కూడా 5 శాతం కంటే ఎక్కువ నష్టాన్ని చవిచూశాయి. విప్రో 4 శాతం, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్ 2 శాతం మేర క్షీణించాయి.
ఈ ప్రతికూల వాతావరణం అంతర్జాతీయ టెక్నాలజీ స్టాక్స్ నుంచి భారత మార్కెట్లకు పాకింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో యాక్సెంచర్ తన రివైజ్డ్ అంచనాల ప్రకటన వెలువడిన తర్వాత, గురువారం నాటి ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్, విప్రో కంపెనీల అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్ (ఏడీఆర్) ఏకంగా 10 శాతం వరకు పడిపోయాయి. వీటితో పాటు కాగ్నిజెంట్ షేర్లు 10 శాతం కంటే ఎక్కువ, ఐబీఎం 5 శాతం కంటే ఎక్కువ, క్యాప్‌జెమిని 8.9 శాతం నష్టంతో ముగిశాయి. త్రైమాసిక ఫలితాలు, తదుపరి అంచనాలను విడుదల చేసిన తర్వాత యాక్సెంచర్ షేర్లు ఏకంగా 17 శాతం కంటే ఎక్కువ పతనమయ్యాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ సేవలు, కన్సల్టింగ్ కంపెనీలలో భారీ అమ్మకాలకు దారితీసింది.
ఆదాయ అంచనాలను తగ్గించిన యాక్సెంచర్..
స్థిర కరెన్సీ ప్రాతిపదికన యాక్సెంచర్ తన వార్షిక ఆదాయ వృద్ధి అంచనాను మునుపటి 3 శాతం నుంచి 5 శాతం పరిధి నుంచి, ఇప్పుడు 3 శాతం నుంచి 4 శాతానికి తగ్గించింది.
అలాగే యూఎస్ ఫెడరల్ బిజినెస్ వల్ల వచ్చే 1 శాతం ప్రభావాన్ని మినహాయిస్తే, కంపెనీ తన ఆదాయ వృద్ధి అంచనాను మునుపటి 4 శాతం నుండి 6 శాతం పరిధి నుంచి 4 శాతం నుంచి 5 శాతానికి పరిమితం చేసింది.
నాలుగో త్రైమాసికానికి గాను యాక్సెంచర్ తన ఆదాయాన్ని 17.75 బిలియన్ డాలర్ల నుంచి 18.4 బిలియన్ డాలర్ల మధ్య ఉండవచ్చని అంచనా వేసింది. అయితే మార్కెట్ విశ్లేషకులు భావించిన సగటు అంచనా 18.47 బిలియన్ డాలర్ల కంటే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం.
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల మూడో త్రైమాసికంలో ప్రాంతీయ వ్యాపారంపై 400 మిలియన్ డాలర్ల ప్రభావం పడిందని కన్సల్టింగ్ దిగ్గజం వెల్లడించింది. నాలుగో త్రైమాసికంలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండవచ్చని హెచ్చరించింది.
ఇక మూడో త్రైమాసికంలో కొత్త బుకింగ్‌లు ఏడాది ప్రాతిపదికన 2 శాతం తగ్గి 19.3 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మొత్తం ఆదాయం 6 శాతం పెరిగి 18.72 బిలియన్ డాలర్లకు చేరుకున్నప్పటికీ, విశ్లేషకులు అంచనా వేసిన 18.75 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని అందుకోలేకపోయిందని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది.
ఏఐ రంగంలో పెట్టుబడుల పెంపు!
భవిష్యత్తుపై జాగ్రత్తగా అంచనాలు వేస్తున్నప్పటికీ, పెద్ద ఎత్తున జరుగుతున్న వ్యాపార పరివర్తన ప్రాజెక్టులు బలంగానే ఉన్నాయని యాక్సెంచర్ స్పష్టం చేసింది. కంపెనీలను సొంతం చేసుకోవడం ద్వారా తమ పెట్టుబడులను భారీగా పెంచాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సర్వీసెస్ రంగాలలో తమ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి ఈ ఏడాది ఏకంగా 9 బిలియన్ డాలర్లను కొనుగోళ్ల కోసం కేటాయించనున్నట్లు కంపెనీ తెలిపింది. గతంలో ఈ అంచనా 5 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉండేది. క్లయింట్లు తమ ఖర్చులను తగ్గించుకుంటూ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఈ విభాగాలపైనే ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు.
“యాక్సెంచర్ మూడో త్రైమాసికంలో బలమైన ఫలితాలను సాధించింది. ఆదాయంలో విస్తృత వృద్ధి నమోదైంది, ఈపీఎస్ 9 శాతం పెరిగింది, ఈ ఏడాది ఇప్పటివరకు 8.2 బిలియన్ డాలర్లను వాటాదారులకు తిరిగి అందించాం. పెద్ద ఎత్తున వ్యాపార మార్పుల కోసం డిమాండ్ బలంగా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు 100 మిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన క్వార్టర్లీ క్లయింట్ బుకింగ్‌లు 104 దాటాయి, ఇది 13 శాతం వృద్ధిని సూచిస్తుంది," అని యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్ పేర్కొన్నారు.
"పెద్ద ఎత్తున ఏఐ పరివర్తన ప్రోగ్రామ్‌లు పెరగడాన్ని మేము గమనిస్తున్నాము. ఓటీ సెక్యూరిటీ రంగంలో లీడర్లుగా ఉన్న డ్రాగోస్ మెజారిటీ వాటాను, అలాగే రన్‌జీరో, నెట్‌రైజ్ కంపెనీలను పూర్తిగా కొనుగోలు చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందం మా వ్యూహాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది మా మార్కెట్ పరిధిని విస్తరించడంతో పాటు మా క్లయింట్లు ఎదుర్కొంటున్న సైబర్ సెక్యూరిటీ సవాళ్లకు సరైన పరిష్కారాన్ని అందిస్తుంది,” అని వెల్లడించారు.
పెద్ద ఎత్తున సాగుతున్న ఏఐ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రోగ్రామ్‌లు వ్యాపార వృద్ధికి తోడ్పడుతున్నాయని కంపెనీ తెలిపింది. అదే సమయంలో, ఈ త్రైమాసికంలో ఆపరేటింగ్ మార్జిన్ 20 బేసిస్ పాయింట్లు పెరిగి 17 శాతానికి చేరుకుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


