Shankh Mitra : ప్రపంచంలోనే రెండో అత్యధిక జీతం.. ఎవరీ కోల్‌కతా కుర్రాడు శంఖ్ మిత్ర?
Shankh Mitra salary : భారత సంతతికి చెందిన శంఖ్ మిత్ర చరిత్ర సృష్టించారు! ఎలాన్ మస్క్ అనంతరం, ప్రపంచంలోనే అత్యధిక ప్యాకేజీ అందుకున్న రెండో వ్యక్తిగా నిలిచారు. వెల్టౌన్ సంస్థలో పనిచేస్తున్న ఆయన 2025లో 821 మిలియన్ డాలర్ల పే ప్యాకేజీ పొందారు.
గ్లోబల్ కార్పొరేట్ ప్రపంచంలో భారతీయ ప్రతిభ మరోసారి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం అమెరికాకు చెందిన హెల్త్‌కేర్ రియల్ ఎస్టేట్ దిగ్గజం ‘వెల్‌టవర్’ సీఈఓ శంఖ్ మిత్ర.. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న రెండో వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 2025 సంవత్సరానికి గాను ఆయన ఏకంగా 821 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. 7,746 కోట్లకు పైగా) వేతన ప్యాకేజీని అందుకుని వార్తల్లో నిలిచారు.

ఈ జాబితాలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో ఉండగా.. ఆయన తర్వాత స్థానాన్ని ఒక భారత సంతతి వ్యక్తి దక్కించుకోవడం విశేషం.
కోల్‌కతా వీధుల నుంచి కార్పొరేట్ అమెరికా శిఖరానికి..
శంఖ్ మిత్ర విజయప్రస్థానం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరంలో ప్రారంభమైంది. అక్కడి ప్రముఖ జాదవ్‌పూర్ యూనివర్సిటీ నుంచి ఆయన ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీఈ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన మిత్ర.. ప్రతిష్టాత్మక 'కొలంబియా బిజినెస్ స్కూల్' నుంచి అప్లైడ్ వాల్యూ ఇన్వెస్టింగ్‌లో ఎంబీఏ పట్టా పొందారు. ఈ చదువే ఆయన ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కెరీర్‌కు గట్టి పునాది వేసింది.
వెల్‌టవర్ కంపెనీలో చేరడానికి ముందు ఆయన సిటాడెల్, మిలీనియం మేనేజ్‌మెంట్ వంటి ప్రముఖ పెట్టుబడి సంస్థల్లో సీనియర్ ఇన్వెస్ట్‌మెంట్ హోదాల్లో పనిచేశారు. అక్కడ రియల్ ఎస్టేట్ సెక్యూరిటీలు, ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలను విజయవంతంగా నిర్వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
2020లో వెల్‌టవర్ బాధ్యతలు..
హెల్త్‌కేర్, సీనియర్ హౌసింగ్ (వృద్ధుల వసతి గృహాలు) ప్రాపర్టీలపై పెట్టుబడులు పెట్టే ప్రముఖ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ సంస్థ అయిన 'వెల్‌టవర్'లో శంఖ్ మిత్ర 2016లో చేరారు. తన ప్రతిభతో కేవలం రెండేళ్లలోనే.. అంటే 2018 నాటికే కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా ఎదిగారు. ఆ తర్వాత 2020లో కరోనా సంక్షోభ సమయంలో ఆయన కంపెనీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు.
జీతం తక్కువ.. షేర్ల రూపంలోనే భారీ ప్యాకేజీ!
సాధారణంగా కార్పొరేట్ కంపెనీల అధినేతలకు ఇచ్చే భారీ జీతాల లాంటిది కాదు శంఖ్ మిత్ర ప్యాకేజీ! ఈ మొత్తం ప్యాకేజీలో అత్యధిక భాగం కంపెనీ షేర్ల రూపంలోనే అందింది. ఆయన ప్యాకేజీలోని సుమారు 789 మిలియన్ డాలర్లు గతేడాది అక్టోబర్‌లో కేటాయించిన స్టాక్ అవార్డుకు సంబంధించినవి. కంపెనీ షేర్లు మార్కెట్లో అద్భుతంగా రాణించడంతో, ఏడాది ముగిసే సరికి ఈ షేర్ల విలువ ఏకంగా 1 బిలియన్ డాలర్లను దాటింది.
అయితే ఈ భారీ మొత్తం మిత్రకు వెంటనే చేతికి రాదు. దీనికి కొన్ని కఠినమైన, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నాయి. అవి..
- మిత్ర కంపెనీలో సుదీర్ఘకాలం కొనసాగితేనే.. 2031 నాటికి ఈ షేర్లలో సగం వాటా ఆయనకు దక్కుతుంది.
- మిగిలిన సగం వాటా దక్కాలంటే, వచ్చే ఐదేళ్లలో కంపెనీ మార్కెట్ విలువను కనీసం 45% పెంచడంతో పాటు ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీల కంటే మెరుగైన ప్రదర్శన కనబరచాల్సి ఉంటుంది.
విశేషం ఏంటంటే, ఒకే ఏడాదిలో 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ప్యాకేజీ అందుకున్న నలుగురు ఎగ్జిక్యూటివ్‌లు ఉన్న అరుదైన కంపెనీగా వెల్‌టవర్ రికార్డు సృష్టించింది.
టాప్-10లో ఇద్దరు..
కరోనా తర్వాతి కాలంలో ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీల సీఈఓల వేతనాలు ఊహించని రీతిలో పుంజుకున్నాయి. 2021 తర్వాత గత ఏడాది (2025)లోనే అత్యధికంగా 100 మిలియన్ డాలర్ల మార్కును దాటిన సీఈఓల సంఖ్య పెరిగిందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక స్పష్టం చేసింది. దాదాపు ఒక డజను మంది సీఈఓలు 200 మిలియన్ డాలర్ల మైలురాయిని దాటగా.. అందరి కంటే భిన్నంగా వెల్‌టవర్ సీఈఓ శంఖ్ మిత్ర ఏకంగా 821 మిలియన్ డాలర్లతో రెండో స్థానానికి దూసుకెళ్లారు. పలో ఆల్టో నెట్‌వర్క్స్ అధినేత నికేష్ అరోరా (100 మిలియన్ డాలర్లతో 8వ స్థానం) తర్వాత టాప్-10లో నిలిచిన మరో భారత సంతతి ప్రముఖుడు శంఖ్ మిత్ర కావడం గమనార్హం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


