SpaceX : శతాబ్దపు అతిపెద్ద ఐపీఓగా స్పేస్‌ఎక్స్- కంపెనీ విలువ ఎంతో తెలుస్తే షాక్ అవుతారు..
ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ 'స్పేస్‌ఎక్స్' అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓ (IPO) గా రికార్డు సృష్టించింది. షేరు ధరను $135 గా నిర్ణయించడంతో కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా $1.77 ట్రిలియన్‌కు చేరింది.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన రాకెట్- వ్యోమనౌకల తయారీ సంస్థ 'స్పేస్‌ఎక్స్'.. అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది! ఈ శతాబ్దపు అతిపెద్ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) షేరు ధరను 135 డాలర్లుగా కంపెనీ ఖరారు చేసింది. ఈ నిర్ణయంతో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో స్పేస్‌ఎక్స్ చేరిపోయింది.

ఈ మెగా ఐపీఓ ద్వారా స్పేస్‌ఎక్స్ సంస్థ 55.55 కోట్ల షేర్లను విక్రయించి, రికార్డు స్థాయిలో 75 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 6.25 లక్షల కోట్లు) నిధుల రూపంలో సేకరించింది. ఫలితంగా అంతరిక్షం, శాటిలైట్ నెట్‌వర్క్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో దూసుకుపోతున్న ఈ సంస్థ మొత్తం మార్కెట్ విలువ ఏకంగా 1.77 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ. 147 లక్షల కోట్లు) చేరుకుంది. ఐపీఓ మార్కెట్ చరిత్రలోనే ఒక కంపెనీకి ఈ స్థాయి విలువ దక్కడం ఇదే తొలిసారి.
సాధారణంగా.. ఐపీఓ లిస్టింగ్ తర్వాత స్టాక్ ప్రైజ్ ఫిక్స్ అవుతుంది. కానీ ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ మాత్రం సంప్రదాయానికి అతీతంగా వెళ్లింది. లిస్టింగ్ ప్రైజ్‌ని సొంతంగా 135 డాలర్లుగా నిర్ణయించి ‘టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్’ పద్ధతిని అవలంభించింది.
అసలైన పరీక్ష ముందే ఉంది!
శుక్రవారం నుంచి అమెరికాలోని ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్ ‘నాస్‌డాక్’లో స్పేస్‌ఎక్స్ షేర్ల ట్రేడింగ్ అధికారికంగా ప్రారంభం కానుంది (భారత కాలమానం ప్రకారం రాత్రి 7గంటలకు). ట్రేడింగ్ మొదలైన తర్వాత అమెరికా మార్కెట్లో అత్యధిక విలువ కలిగిన కంపెనీల జాబితాలో స్పేస్‌ఎక్స్ 7వ స్థానంలో నిలవనుంది. అయితే, ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం గమనించాలి. మార్కెట్లో ఇంత భారీ విలువ ఉన్నప్పటికీ, గత ఏడాది ఈ సంస్థ నష్టాలను చూసింది! అంతేకాకుండా, మార్కెట్లోని మిగతా మెగా-క్యాప్ కంపెనీల రాబడితో పోలిస్తే స్పేస్‌ఎక్స్ వార్షిక ఆదాయం చాలా తక్కువగా ఉంది.
అయినప్పటికీ మార్కెట్ విలువ పరంగా చూస్తే జేపీమోర్గాన్ చేజ్, బెర్క్‌షైర్ హాత్వే, ఎలీ లిల్లీ వంటి దిగ్గజ సంస్థలతో పాటు మెటా ప్లాట్‌ఫారమ్స్ (ఫేస్‌బుక్). మస్క్‌కు చెందిన సొంత కార్ల కంపెనీ 'టెస్లా' కంటే కూడా స్పేస్‌ఎక్స్ ఎంతో ముందంజలో ఉంది.
"తొలి రోజు ట్రేడింగ్‌లో ఏం జరుగుతుందనేది ముఖ్యం కాదు. రాబోయే కొన్ని వారాల పాటు ఈ ఐపీఓను మార్కెట్ ఎలా స్వీకరిస్తుంది (డైజెస్ట్ చేసుకుంటుంది) అనేదే స్పేస్‌ఎక్స్ ముందున్న అసలైన పరీక్ష. కంపెనీ నిర్ణయించిన షేరు ధర చాలా సమతుల్యంగా ఉంది. ప్రస్తుతం సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు ఈ షేర్లను భారీగా కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి మార్కెట్ ప్రారంభమయ్యాక కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందా లేదా అనేది చూడాలి," అని న్యూయార్క్‌కు చెందిన 50 పార్క్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆడమ్ సర్హాన్ విశ్లేషించారు.
సౌదీ అరామ్‌కో రికార్డు బద్దలు!
ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓగా సౌదీ అరేబియా ప్రభుత్వ చమురు దిగ్గజం ‘సౌదీ అరామ్‌కో’ పేరిట ఉన్న రికార్డును స్పేస్‌ఎక్స్ బద్దలు కొట్టింది. డిసెంబర్ 2019లో రియాద్ ఎక్స్ఛేంజ్లో సౌదీ అరామ్‌కో ఐపీఓ ద్వారా 25.6 బిలియన్ డాలర్లను సేకరించగా, అప్పట్లో ఆ కంపెనీ విలువ 1.71 ట్రిలియన్ డాలర్లుగా ఉండేది. (ప్రస్తుత ద్రవ్యోల్బణాన్ని బట్టి లెక్కిస్తే అది 33.2 బిలియన్ డాలర్ల సేకరణ, 2.21 ట్రిలియన్ డాలర్ల విలువతో సమానం).
ప్రస్తుతం స్పేస్‌ఎక్స్‌కు ఉన్న 1,308 కోట్ల షేర్ల ఆధారంగా దీని విలువను 1.77 ట్రిలియన్ డాలర్లుగా లెక్కించారు. ఒకవేళ ఐపీఓ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న అండర్ రైటర్లు తమకు ఉన్న హక్కు ప్రకారం అదనపు షేర్లను విక్రయిస్తే, ఈ మార్కెట్ విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఐపీఓ ముగిసిన 30 రోజుల లోపు ఈ అదనపు విక్రయాలపై నిర్ణయం తీసుకుంటారు.
ఎలాన్ మస్క్ ఎప్పుడూ తన సొంత నిబంధనల ప్రకారమే నడుచుకుంటారని చెప్పడానికి ఈ ఐపీఓ ప్రక్రియే ఒక ఉదాహరణ. సాధారణంగా ఐపీఓ ధరల ఖరారు సమావేశం, అధికారిక ప్రకటనలు అన్నీ అమెరికా స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత (సాయంత్రం 4 గంటల తర్వాత) జరుగుతాయి. ఎందుకంటే మార్కెట్ నడుస్తున్న సమయంలో ఎలాంటి వార్తలు వచ్చినా అది షేర్ల అమ్మకాలపై ప్రభావం చూపుతుందని కంపెనీలు భయపడతాయి. కానీ మస్క్ మాత్రం గురువారం మార్కెట్ ఓపెన్‌లో ఉండగానే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు స్పేస్‌ఎక్స్ ఐపీఓ ప్రైజ్ వివరాలను సమర్పించారు. ఆ తర్వాత అరగంటకే స్పేస్‌ఎక్స్ ప్రెస్ రిలీజ్ కూడా విడుదల చేసింది.
సామాన్య ఇన్వెస్టర్ల కోసమేనా?
స్పేస్‌ఎక్స్ తన ఐపీఓ షేర్లలో ఏకంగా 30శాతం షేర్లను సామాన్య రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించింది. సాధారణంగా ఏ పెద్ద కంపెనీ కూడా ఐపీఓలలో రిటైల్ ఇన్వెస్టర్లకు ఇంత పెద్ద మొత్తంలో వాటాను ఇవ్వదు.
"స్పేస్‌ఎక్స్ ఐపీఓ ధరల నిర్ణయం నిజంగా ఊహాతీతం. సాధారణంగా ఇన్వెస్టర్ల నుంచి వచ్చే ఆర్డర్ల ఆధారంగా మార్కెట్ ధరను నిర్ణయించే సాంప్రదాయ ప్రక్రియ ఉంటుంది. కానీ అలా కాకుండా, కంపెనీ ముందే ధరను ప్రకటించడం నేనెప్పుడూ చూడలేదు. బహుశా సామాన్య రిటైల్ ఇన్వెస్టర్లపై ఎక్కువగా నమ్మకం ఉంచడం వల్లే కంపెనీ ఇలా చేసి ఉండవచ్చు," అని న్యూజెర్సీకి చెందిన చెర్రీ లేన్ ఇన్వెస్ట్‌మెంట్స్ భాగస్వామి రిక్ మెక్లర్ అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా, మార్కెట్లో స్పేస్‌ఎక్స్ షేర్లకు పెద్ద ఎత్తున కొనుగోలుదారులు దొరకడం కోసం ఈ షేర్లను స్టాక్ మార్కెట్ ఇండెక్స్‌లలో వీలైనంత త్వరగా చేర్చాలని మస్క్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కంపెనీ పగ్గాలు వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా, వ్యవస్థాపకుడి నియంత్రణే బలంగా ఉండేలా నిబంధనలను రూపొందించారు. ఈ ఐపీఓ తర్వాత కూడా స్పేస్‌ఎక్స్‌లో 82 శాతం ఓటింగ్ పవర్ ఎలాన్ మస్క్ చేతుల్లోనే ఉండటం విశేషం.
భవిష్యత్తుపైనే ఇన్వెస్టర్ల ఆశలు!
2002లో స్థాపించిన స్పేస్‌ఎక్స్ సంస్థ ప్రధాన లక్ష్యం ఏమిటంటే.. "మానవ జీవితాన్ని ఇతర గ్రహాలకూ విస్తరించడం, ఈ విశ్వం నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం మరియు మన చైతన్యపు వెలుగును నక్షత్రాల వరకు తీసుకెళ్లడం". తమ ముందున్న మార్కెట్ అవకాశం దాదాపు 28.5 ట్రిలియన్ డాలర్లని, మానవ చరిత్రలోనే ఇది అతిపెద్ద మార్కెట్ అని స్పేస్‌ఎక్స్ ప్రకటించింది.
గడిచిన మూడేళ్లలో ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష కక్ష్యలోకి పంపిన మొత్తం మాస్ (బరువు)లో ఐదింట నాలుగు వంతుల కంటే ఎక్కువ స్పేస్‌ఎక్స్ రాకెట్ల ద్వారానే వెళ్లడం విశేషం. అలాగే కంపెనీకి చెందిన ‘స్టార్‌లింక్’ ఇంటర్నెట్ విభాగం ప్రస్తుతం 164 దేశాల్లోని లక్షలాది మంది వినియోగదారులకు, ప్రభుత్వాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తోంది. స్పేస్‌ఎక్స్‌కు వచ్చే ఆదాయంలో సింహభాగం ఈ స్టార్‌లింక్ నుంచే వస్తోంది.
కంపెనీకి ఉన్న మార్కెట్ అవకాశంలో ఎక్కువ భాగం ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ 'xAI' ద్వారానే వస్తుందని అంచనా. మార్కెట్లో ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్‌లతో పోలిస్తే xAI కొంచెం వెనుకబడి ఉన్నట్లు అనిపించినప్పటికీ.. స్పేస్‌ఎక్స్ ఏఐ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు, 'ఎక్స్' (ట్విట్టర్) లోని రియల్ టైమ్ డేటాను ఉపయోగించుకోవడం వల్ల తమకు పెద్ద వ్యూహాత్మక ప్రయోజనం ఉందని స్పేస్‌ఎక్స్ చెబుతోంది.
"ప్రస్తుతానికి ఈ కంపెనీ ఆర్థిక అంచనాలు కొంచెం అనిశ్చితంగానే ఉన్నాయి, ఎందుకంటే స్పేస్‌ఎక్స్ ఎక్కువగా ప్రభుత్వ కాంట్రాక్టులపైనే ఆధారపడి నడుస్తోంది. కాబట్టి, ఇప్పుడు ఈ కంపెనీ షేర్లను కొంటున్న వారు కేవలం లాభాల కోసం కాకుండా.. మానవాళి భూమిని దాటి అంతరిక్షంలోకి అడుగుపెట్టాలనే భవిష్యత్తు కలలను నమ్మి పెట్టుబడి పెడుతున్నారు," అని పిట్స్‌బర్గ్‌లోని బోకె క్యాపిటల్ పార్టనర్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ కిమ్ ఫారెస్ట్ వ్యాఖ్యానించారు.
ఇంత భారీ మార్కెట్ విలువ ఉన్న ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌కు భవిష్యత్తులో గట్టి పోటీ కూడా ఎదురుకానుంది. ముఖ్యంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు చెందిన ‘బ్లూ ఒరిజిన్’ సంస్థ అంతరిక్ష వాణిజ్యీకరణను వేగవంతం చేస్తూ ప్రభుత్వ కాంట్రాక్టులను దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఈ భారీ ఐపీఓ డీల్ పరిమాణం, సంక్లిష్టత దృష్ట్యా, శుక్రవారం మధ్యాహ్నం మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత ఇన్వెస్టర్ల స్పందన ఎలా ఉంటుందో చూడాలని విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ ప్రతిష్టాత్మక ఐపీఓ ప్రక్రియను గోల్డ్‌మన్ సాక్స్, మోర్గాన్ స్టాన్లీ, బోఫా సెక్యూరిటీస్, సిటీగ్రూప్, జేపీ మోర్గాన్ సంస్థలు సంయుక్తంగా బుక్-రన్నింగ్ మేనేజర్లుగా వ్యవహరించి పర్యవేక్షించాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


