Train ticket booking : రైలు ప్రయాణికులకు అలర్ట్- ఆ టికెట్ బుకింగ్ నిబంధనల్లో కీలక మార్పులు..

పెళ్లిళ్లు, తీర్థయాత్రలు, విద్యా పర్యటనల కోసం బృందాలుగా రైలు ప్రయాణం చేసేవారికి సౌత్ వెస్టర్న్ రైల్వే భారీ ఊరటనిచ్చింది. గ్రూప్ బుకింగ్స్‌లో బెర్తుల సంఖ్యపై ఉన్న గరిష్ట పరిమితిని ఎత్తివేస్తూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దరఖాస్తు సమయం, నియమాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Nov 21, 2026, 05:59:26 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లిళ్లకు వెళ్లాలన్నా, విద్యార్థులంతా కలిసి విహారయాత్రకు ప్లాన్ చేయాలన్నా ఇప్పటివరకు రైలు టికెట్లు దొరకడం పెద్ద సవాలుగా ఉండేది. గ్రూప్ బుకింగ్ కింద పరిమిత సంఖ్యలోనే బెర్తులు కేటాయించే నిబంధన ఉండటంతో, పెద్ద బృందాలు వేర్వేరు బోగీల్లో సర్దుకోవాల్సి వచ్చేది. ఈ సమస్యకు సౌత్ వెస్టర్న్ నైరుతి రైల్వే (ఎస్​డబ్ల్యూఆర్) చక్కటి పరిష్కారం చూపింది. గ్రూప్, బల్క్ రైలు రిజర్వేషన్ నిబంధనలను సవరిస్తూ, అధికారులు మంజూరు చేసే బెర్తుల సంఖ్యపై ఉన్న ఫిక్స్​డ్​ లిమిట్​ని పూర్తిగా ఎత్తివేసింది.

రైల్వే గ్రూప్ టికెట్ బుకింగ్ కొత్త రూల్స్..
రైల్వే గ్రూప్ టికెట్ బుకింగ్ కొత్త రూల్స్..

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనివ్వనుంది. కర్ణాటక కేంద్రంగా పనిచేసే ఈ సౌత్ వెస్టర్న్ రైల్వే పరిధిలోని బెంగళూరు, మైసూరు, హుబ్బళ్లి నగరాల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, మంత్రాలయం వంటి ప్రాంతాలకు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్‌లో బంధువులంతా కలిసి ప్రయాణించడానికైనా, బెంగళూరులో స్థిరపడిన తెలుగు ఐటీ ఉద్యోగుల బృందాలు తిరుమల, శ్రీశైలం పుణ్యక్షేత్రాలకు వెళ్లడానికైనా ఈ కొత్త నిబంధనలు ఎంతగానో ఉపయోగపడతాయి.

అధికారులకు పూర్తి స్వేచ్ఛ.. అన్ని క్లాసులకూ వర్తింపు!

సవరించిన నిబంధనల వివరాలను సౌత్ వెస్ర్న్ రైల్వే తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది. బల్క్, గ్రూప్ రిజర్వేషన్ అభ్యర్థనలను మరింత సులభంగా, వెసులుబాటుతో పరిష్కరించేందుకే ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది. పాత మార్గదర్శకాల స్థానంలో 'కమర్షియల్ సర్క్యులర్ (కోచింగ్) నంబర్ 37/2026', 'రేట్ అడ్వైస్ నంబర్ 11 ఆఫ్ 2026' ద్వారా ఈ కొత్త ఆదేశాలను జారీ చేసింది.

గతంలో ఒక రైలులో అందుబాటులో ఉన్న మొత్తం బెర్తులలో ఇంత శాతం మాత్రమే గ్రూప్ రిజర్వేషన్లకు కేటాయించాలనే కఠినమైన ఆంక్షలు ఉండేవి. తాజా సవరణతో ఆ పరిమితులను రద్దు చేశారు. ఇకపై చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్లు (సీఆర్​ఎస్), స్టేషన్ మేనేజర్లు (ఎస్​ఎం) ఎలాంటి బెర్తుల పరిమితి లేకుండానే అర్హులైన బృందాలకు గ్రూప్ రిజర్వేషన్లను మంజూరు చేయవచ్చు. స్లీపర్ క్లాస్ నుంచి ఏసీ కోచ్‌ల వరకు అన్ని తరగతుల ప్రయాణాలకు ఈ సదుపాయం వర్తిస్తుంది.

ఉదయం 9 గంటల నుంచే దరఖాస్తులు.. సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా!

సాధారణ ప్రయాణికుల టికెట్ బుకింగ్‌లకు ఎలాంటి ఆటంకం కలగకుండా రైల్వే శాఖ దరఖాస్తు సమయాల్లో స్పష్టతనిచ్చింది. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ప్రారంభమయ్యే మొదటి రోజు ఉదయం 9:00 గంటల నుంచి ప్రధాన రిజర్వేషన్ కేంద్రాలలో గ్రూప్ బుకింగ్ దరఖాస్తులను స్వీకరిస్తారు. సాధారణంగా ఉదయం 8:00 గంటలకు రెగ్యులర్ అడ్వాన్స్ రిజర్వేషన్లు మొదలవుతాయి; సరిగ్గా గంట తర్వాత గ్రూప్ బుకింగ్ అభ్యర్థనలకు అవకాశం కల్పిస్తారు. దీనివల్ల సాధారణ ప్రయాణికులు తొలి గంటలో టికెట్లు బుక్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

గ్రూప్ టికెట్లు కోరేవారు తమ అభ్యర్థనలను నేరుగా అధీకృత రైల్వే అధికారులకు సమర్పించి అనుమతి పొందాలి. అయితే ఈ సదుపాయం కేవలం నిజమైన ప్రయాణికుల కోసం మాత్రమేనని, బెర్తులను అక్రమంగా బ్లాక్ చేయడానికి దీన్ని దుర్వినియోగం చేయకూడదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

దరఖాస్తుతో పాటు సమర్పించాల్సిన వివరాలు..

బల్క్ లేదా గ్రూప్ రిజర్వేషన్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రయాణికులు తమ ప్రయాణ కారణాన్ని (వివాహం, విద్యా పర్యటన, తీర్థయాత్ర, క్రీడా పోటీలు లేదా సాంస్కృతిక కార్యక్రమాలు) దరఖాస్తులో స్పష్టంగా పేర్కొనాలి. దీనితో పాటు బృందంలో ప్రయాణించే ప్రతి వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలను తప్పనిసరిగా అందజేయాలి:

  • ప్రయాణికుడి పూర్తి పేరు
  • వయసు
  • లింగం
  • పూర్తి చిరునామా
  • ప్రయాణ ఉద్దేశం

సరైన పత్రాలు, స్పష్టమైన కారణంతో దరఖాస్తు చేసుకుంటే పెద్ద బృందాలన్నీ ఒకే బోగీలో లేదా పక్కపక్కనే ప్రయాణించే కల ఇకపై సులభంగా నెరవేరనుంది.

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.