RAC cancellation : ఆర్​ఏసీ విధానం రద్దు యోచనలో భారతీయ రైల్వే! ఎందుకంటే..

పూర్తి టికెట్ ధర చెల్లించినా సగం సీటుతోనే సర్దుకుపోతున్న ఆర్ఏసీ ప్రయాణికుల కష్టాలకు త్వరలోనే తెరపడనుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో భారతీయ రైల్వే ఉందని సమాచారం.

Published on: Nov 14, 2026, 11:00:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భారతీయ రైల్వే ప్రయాణికులకు అత్యంత ఇబ్బందికరంగా మారిన 'రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్' (ఆర్​ఏసీ) విధానానికి త్వరలోనే ముగింపు పాడే అవకాశాలు కనిపిస్తున్నాయి! ఒకే బెర్త్‌ను ఇద్దరు ప్రయాణికులకు కేటాయిస్తూ, సగం స్థలం మాత్రమే ఇచ్చి పూర్తి టికెట్ ధర వసూలు చేస్తున్న ఈ దశాబ్దాల నాటి నిబంధనను పూర్తిగా రద్దు చేసే ఆప్షన్‌ను భారతీయ రైల్వే తీవ్రంగా పరిశీలిస్తోందని సమాచారం. ప్రయాణికుల సౌకర్యం, ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో పాత పద్ధతిని సమీక్షించాల్సిన అవసరం ఏర్పడిందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.

ఆర్​ఏసీ వ్యవస్థ రద్దుకు రైల్వే శాఖ ప్లాన్!
ఆర్​ఏసీ వ్యవస్థ రద్దుకు రైల్వే శాఖ ప్లాన్!

సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి రద్దీ రైల్వే స్టేషన్ల నుంచి దిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలకు నిత్యం లక్షలాది మంది తెలుగు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే రాత్రిపూట ప్రయాణాల్లో ఆర్ఏసీ టికెట్ వస్తే ప్రయాణికులు పడే నరకం అంతా ఇంతా కాదు. స్లీపర్ క్లాస్ అయినా, ఏసీ బోగీలైనా పూర్తి ఛార్జీ చెల్లించినప్పటికీ పడుకునే వీలు లేక, ఒకే సైడ్-లోయర్ బెర్త్‌పై మరొకరితో కలిసి రాత్రంతా కూర్చుని ప్రయాణించాల్సి వస్తోంది. ఈ అసౌకర్యంపై ప్రయాణికుల నుంచి ఏళ్లుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

పూర్తి ఛార్జీ.. సగం సీటు.. అధికారుల్లో పునరాలోచన!

ప్రయాణికులు చెల్లించే సొమ్ముకు, వారికి లభించే సదుపాయానికి పొంతన లేకపోవడమే ఈ ఆర్​ఏసీ విధానం రద్దు ఆలోచనకు ప్రధాన కారణమవుతోంది. "ప్రయాణికుడికి పూర్తిస్థాయిలో నిద్రించే స్థలం లభించనప్పుడు, వారి నుంచి పూర్తి టికెట్ ఛార్జీ వసూలు చేయడం సబబు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది," అని ఒక రైల్వే ఉన్నతాధికారి తెలిపారు.

టికెట్ కన్ఫర్మ్ అయిన ప్రయాణికుడితో సమానంగా డబ్బులు కట్టినా, ఆర్ఏసీ ప్రయాణికులకు కేవలం కూర్చునే హక్కు మాత్రమే లభిస్తోంది.

మహిళా ప్రయాణికుల ఇబ్బందులు.. టీటీఈలకు తలనొప్పి!

ఆర్ఏసీ విధానం వల్ల ఎదురవుతున్న మరో పెద్ద సమస్య లింగ భేదం! కంప్యూటర్ ఆధారిత కేటాయింపుల్లో ఒక్కోసారి రైలులోని ఒకే బెర్త్‌ను ఒక పురుషుడికి, ఒక మహిళకు కేటాయిస్తున్నారు. అపరిచితులైన స్త్రీ, పురుషులు రాత్రంతా ఒకే చిన్న సీటులో పక్కపక్కనే కూర్చుని ప్రయాణించడం ఇద్దరికీ ఎంతో అసౌకర్యంగా, ఇబ్బందికరంగా మారుతోంది. ఇలాంటి సమయాల్లో తమకు వేరే సీటు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు పట్టుబట్టడంతో, కిక్కిరిసిన బోగీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేక రైలు టికెట్ తనిఖీ అధికారులు (టీటీఈ) తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

పార్లమెంటరీ కమిటీ అక్షింతలు.. ఆధునిక టెక్నాలజీతో మారిన లెక్కలు!

ఆర్ఏసీ ప్రయాణికుల నుంచి పూర్తి ఛార్జీలు వసూలు చేయడంలోని హేతుబద్ధతను పార్లమెంటరీ కమిటీ సైతం ప్రశ్నించింది. సరైన బెర్త్ కేటాయించకుండా ప్రయాణికులపై పూర్తి టికెట్ భారం మోపడం సరికాదని ఆక్షేపించింది. ప్రయాణికులకు అన్యాయం జరగకుండా ప్రస్తుత నిబంధనలను తక్షణమే సమీక్షించాలని కమిటీ రైల్వే శాఖకు సిఫార్సు చేసింది.

అసలు ఈ ఆర్ఏసీ వ్యవస్థను ప్రవేశపెట్టిన నాటి పరిస్థితులు వేరు! రైల్వే రిజర్వేషన్లు పూర్తిగా మాన్యువల్‌గా (చేతిరాతతో) జరిగే రోజుల్లో దీనిని తీసుకొచ్చారు. అప్పట్లో టికెట్ల రద్దును, ఖాళీ అయ్యే బెర్త్‌లను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే ఎలక్ట్రానిక్ వ్యవస్థ అందుబాటులో ఉండేది కాదు. చివరి నిమిషంలో ఎవరైనా ప్రయాణం రద్దు చేసుకుంటే ఆ బెర్త్ వృథా కాకుండా ఉండాలనే ఉద్దేశంతో, ఒకే బెర్త్‌పై ఇద్దరిని అనుమతించే ఈ విధానాన్ని తెచ్చారు.

ఎవరైనా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఆర్ఏసీలో ఉన్న ఒకరికి పూర్తి బెర్త్ దక్కే అవకాశం ఉండేది. కానీ నేడు రియల్-టైమ్ ట్రాకింగ్, హ్యాండ్-హెల్డ్ టెర్మినల్స్ వంటి ఆధునిక డిజిటల్ వ్యవస్థలు అందుబాటులోకి రావడంతో, పాత ఆర్ఏసీ విధానం అవసరం లేదని రైల్వే వర్గాలు యోచిస్తున్నాయి.

అయితే ఆర్​ఏసీ రద్దు వార్తలు ప్రస్తుతం అనధికారికంగానే ఉన్నాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన, స్పష్టత వెలువడలేదని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే మాత్రం రైలు ప్రయాణం మరింత సుఖమయంగా మారనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More