IRCTC current booking : చార్ట్​ రెడీ అయిన తర్వాత కూడా రైలు టికెట్​ బుక్ చేసుకోవచ్చు! ఎలా అంటే..

Tatkal alternative options : తత్కాల్ టికెట్లు దొరకని ప్రయాణికుల కోసం రైల్వే శాఖ 'కరెంట్ బుకింగ్' సదుపాయాన్ని కల్పిస్తోంది. చార్ట్ తయారయ్యాక ఖాళీగా ఉన్న సీట్లను ఎలాంటి అదనపు రుసుములు లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

Published on: Aug 8, 2026, 14:03:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రైలు ప్రయాణం చేయాలనుకునే వారికి తత్కాల్ టికెట్ దొరకడం ఒక పెద్ద సవాల్‌గా మారుతుంది. అయితే తత్కాల్‌లో సీటు రిజర్వ్ కాకపోతే ప్రయాణం ఆగిపోయినట్లు కాదు! రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన తర్వాత కూడా రైళ్లలో కొన్ని సీట్లు ఖాళీగా మిగిలిపోతుంటాయి. అలాంటి వాటిని ప్రయాణికులు సులభంగా పొందడానికి 'కరెంట్ బుకింగ్' ఎంతో ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

ఐఆర్‌సీటీసీ కరెంట్ బుకింగ్ ఆప్షన్ గురించి మీకు తెలుసా?
ఐఆర్‌సీటీసీ కరెంట్ బుకింగ్ ఆప్షన్ గురించి మీకు తెలుసా?

ఐఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్‌లోని 'చార్ట్స్ వేకెంట్' ఆప్షన్ ద్వారా ప్రయాణికులు ఈ ఖాళీ సీట్లను ఆన్‌లైన్‌లో తనిఖీ చేసి బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

కరెంట్ బుకింగ్ ఎలా పనిచేస్తుంది?

సాధారణంగా రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందే మొదటి రిజర్వేషన్ చార్ట్‌ను సిద్ధం చేస్తారు. ఆ సమయం నుంచి రైలు బయలుదేరడానికి ఐదు నిమిషాల ముందు వరకు ప్రయాణికులు ఈ ఖాళీ సీట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ సమయాలు రైలును బట్టి మారుతుంటాయని గమనించాలి.

ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ పద్ధతిలో బుక్ చేసుకునే టికెట్లు వెయిటింగ్ లిస్ట్ లేదా ఆర్‌ఏసీ కిందకురావు. అన్నీ కన్ఫర్డ్మ్ టికెట్లుగానే జారీ అవుతాయి.

అదనపు ఛార్జీలు ఉండవు.. డిస్కౌంట్లు కూడా!

కరెంట్ బుకింగ్‌లో టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఎలాంటి తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం సాధారణ టికెట్ ధర మాత్రమే వర్తిస్తుంది. కొన్ని రైళ్లలో అయితే ఈ ఖాళీ సీట్లపై ఇండియన్ రైల్వేస్ 10 శాతం నుంచి 30 శాతం వరకు రాయితీ కూడా ఇస్తోంది.

అయితే ఇందులో ఒక చిన్న మెలిక ఉంది. కరెంట్ బుకింగ్ ద్వారా తీసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటే రిఫండ్ రాదు. కాబట్టి ప్రయాణం ఖాయం అనుకున్నప్పుడే ఈ టికెట్లను బుక్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఐఆర్‌సీటీసీలో ఖాళీ సీట్లను ఎలా తనిఖీ చేయాలి?

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ను ఓపెన్ చేయాలి.

'ట్రెయిన్' సెక్షన్‌కు వెళ్లి 'చార్ట్స్ వేకెంట్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

రైలు నంబర్, ప్రయాణ తేదీని నమోదు చేస్తే.. ఏయే కోచ్‌లలో ఎక్కడెక్కడ సీట్లు ఖాళీగా ఉన్నాయో స్పష్టంగా కనిపిస్తాయి.

మీకు నచ్చిన సీటు అందుబాటులో ఉంటే వెంటనే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

చివరి నిమిషంలో ప్రయాణం చేయాలనుకునే వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. ప్రయాణ మార్గంలోని మధ్యలో ఉండే స్టేషన్లలో కొందరు దిగిపోవడం వల్ల కూడా కొన్ని సీట్లు ఖాళీ అవుతాయి. వాటిని కూడా ఇదే పద్ధతిలో బుక్ చేసుకోవచ్చు.

ఒకప్పుడు చార్ట్ తయారయ్యాక ఖాళీ సీట్ల కోసం నేరుగా టీటీఈని సంప్రదించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే అన్నీ కనిపిస్తుండటంతో ప్రయాణికుల శ్రమ చాలా వరకు తగ్గింది!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More