Electric taxi service : మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ టాక్సీ సర్వీస్! బుక్ చేస్తే ఎమ్‌పీవీ వస్తుంది బాసూ..
ప్రముఖ అంతర్జాతీయ మొబిలిటీ సంస్థ గ్రీన్ ఎస్‌ఎమ్ మన మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది. పూర్తి ఎలక్ట్రిక్ టాక్సీ సర్వీస్ 'గ్రీన్ ఎస్‌ఎమ్ లిమో'ను దిల్లీలో ప్రారంభించింది. ప్రారంభ ఆఫర్‌గా యాప్ బుకింగ్స్‌పై 50 శాతం తగ్గింపును ప్రకటిస్తూ విన్‌ఫాస్ట్ ఈవీ వాహనాలతో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
Green SM India : భారతదేశంలో పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న తరుణంలో, గ్లోబల్ మొబిలిటీ రంగంలో గుర్తింపు పొందిన ‘గ్రీన్ ఎస్‌ఎమ్’ భారత మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెట్టింది. పూర్తి ఎలక్ట్రిక్ టాక్సీ సేవలను అందించే లక్ష్యంతో ‘గ్రీన్ ఎస్‌ఎమ్ లిమో’ సర్వీసును కంపెనీ ప్రారంభించింది. మొదటి దశలో భాగంగా దేశ రాజధాని ప్రాంతమైన దిల్లీ-ఎన్సీఆర్లోని కీలక ప్రాంతాలలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అంతర్జాతీయంగా తన నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్న ఈ సంస్థ, పూర్తి ఈవీలతో కూడిన రైడ్-హెయిలింగ్ నమూనాను భారతీయులకు పరిచయం చేస్తోంది.

ఈ వినూత్న టాక్సీ సర్వీస్ కోసం ప్రత్యేకంగా కమర్షియల్ ప్రయాణాల కోసం రూపొందించిన 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీ ‘విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్’ వాహనాలను కంపెనీ ఉపయోగిస్తోంది. భారతదేశంలో ఈ సేవల విస్తరణకు అవసరమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ‘వి-గ్రీన్’ నెట్‌వర్క్ అందించనుండగా, ప్రత్యేక శిక్షణ పొందిన ప్రొఫెషనల్ డ్రైవర్లు ఈ టాక్సీలను నడుపుతారని గ్రీన్ ఎస్‌ఎమ్ స్పష్టం చేసింది.
దిల్లీ-ఎన్‌సీఆర్‌తో ప్రారంభం.. క్రమంగా విస్తరణ!
వియత్నాం, లావోస్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ తర్వాత గ్రీన్ ఎస్‌ఎమ్ సేవలు ప్రారంభమైన ఐదో అంతర్జాతీయ మార్కెట్‌గా భారతదేశం నిలిచింది. దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో సేవలు విజయవంతమైన అనంతరం, డిమాండ్‌కు అనుగుణంగా దేశంలోని ఇతర నగరాలకు కూడా ఈ టాక్సీ సర్వీసును విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది.
రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌ల్లో సాధారణంగా రకరకాల కంపెనీల కార్లు కనిపిస్తాయి. కానీ దానికి భిన్నంగా, గ్రీన్ ఎస్‌ఎమ్ కేవలం విన్‌ఫాస్ట్ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ప్రత్యేకంగా వినియోగించనుంది. ఇందులో భాగంగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన మొదటి మోడల్ ‘లిమో గ్రీన్’. ఇది విన్‌ఫాస్ట్ వీవఎఫ్ ఎమ్‌పీవీ 7కి చెందిన కమర్షియల్ వెర్షన్ కావడం విశేషం.
ఈ విన్‌ఫాస్ట్, గ్రీన్ ఎస్‌ఎమ్ సంస్థలు.. విన్‌గ్రూప్ అనే కంపెనీకి చెందినవి.
వినియోగదారులు గ్రీన్ ఎస్‌ఎమ్ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా, కంపెనీ హాట్‌లైన్ నంబర్ ద్వారా లేదా సర్వీస్ అందుబాటులో ఉన్న జోన్లలో నేరుగా కారును రైడ్ బుక్ చేసుకోవచ్చు. ఈ టాక్సీ సర్వీస్ లాంచ్ ఆఫర్ కింద జూన్ 5 నుంచి జూన్ 11 వరకు యాప్ ద్వారా బుక్ చేసుకునే ప్రయాణాలపై గరిష్టంగా రూ. 250 వరకు 50 శాతం ప్రత్యేక డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.
విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్: ఫీచర్లు, రేంజ్..
సాంకేతిక పరంగా చూస్తే, ఈ లిమో గ్రీన్ వాహనం సాధారణ వీఎఫ్ ఎమ్‌పీవీ 7 మోడల్ తరహాలోనే ఉంటుంది. ఇందులో 60.13 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఇది ఫ్రంట్-వీల్-డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్ సహాయంతో నడుస్తుంది. ఇది గరిష్టంగా 204 బీహెచ్‌పీ పవర్‌ను, 280 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై 517 కిలోమీటర్ల మైలేజీ (డ్రైవింగ్ రేంజ్) ఇస్తుందని ఏఆర్ఏఐ ధృవీకరించింది. అయితే, నిజమైన రోడ్డు పరిస్థితులలో ఇది సుమారు 350 నుంచి 400 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా.
ఈ ఎమ్‌పీవీ పొడవు వెడల్పులలో ఎలాంటి మార్పులు లేవు. ఇందులో 10.1 ఇంచుల సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. అయితే, కమర్షియల్ టాక్సీ అవసరాలకు అనుగుణంగా కొన్ని కీలక మార్పులు చేశారు. అల్లాయ్ వీల్స్‌కు బదులుగా కవర్లతో కూడిన 19 ఇంచుల వీల్స్, ఫ్యాబ్రిక్ సీట్ అప్‌హోలిస్ట్రీ, భద్రత కోసం నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చారు. కారుపై విన్‌ఫాస్ట్ లోగోకు బదులుగా గ్రీన్ ఎస్‌ఎమ్ బ్రాండింగ్ ఉంటుంది. ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ముందు, వెనుక భాగంలో ఒకదానికొకటి కనెక్ట్ అయ్యే లైట్ బార్లు ఈ కారు సొంతం.
లగేజీ పరంగా చూస్తే, కారులోని అన్ని సీట్లు వాడుకలో ఉన్నప్పుడు 126 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. ప్రయాణికులు తక్కువగా ఉండి వెనుక సీట్లను మడతపెట్టినప్పుడు ఈ స్థలం వరుసగా 606 లీటర్లు, 1,240 లీటర్ల వరకు పెరుగుతుంది.
భద్రత, సేవలపై ప్రత్యేక దృష్టి..
ప్రయాణికులు, డ్రైవర్ల రక్షణ కోసం గ్రీన్ ఎస్‌ఎమ్ లిమో ప్రతి వాహనంలో 'సెక్యూర్-టు-సేఫ్' సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది. ఇది కారు లోపల, బయట ఉండే కెమెరాలు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత, అత్యవసర సమయాల్లో ఆదుకునే ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ బటన్ల సహాయంతో పనిచేస్తుంది. ఈ టాక్సీలను నడిపే డ్రైవర్లకు ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ, రోడ్డు భద్రత, కస్టమర్ సర్వీస్‌పై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.
"భారతీయ మార్కెట్‌పై ఎంతో గౌరవంతో, ఇక్కడి దీర్ఘకాలిక వృద్ధిపై పూర్తి నమ్మకంతో మేము అడుగుపెట్టాము. స్థానిక భాగస్వాములతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. భారతదేశంలోని కస్టమర్లకు అత్యుత్తమ క్వాలిటీతో కూడిన పూర్తి ఎలక్ట్రిక్ రైడ్ అనుభూతిని అందించడమే కాకుండా.. సురక్షితమైన, నమ్మకమైన, పర్యావరణహితమైన ప్రయాణ మార్గాలను అందుబాటులోకి తేవాలని గ్రీన్ ఎస్‌ఎమ్ భావిస్తోంది. దీర్ఘకాలిక వృద్ధికి నమ్మకమే అత్యంత ముఖ్యమైన పునాది అని మేము నమ్ముతున్నాము. రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలోని కస్టమర్లు, భాగస్వాములు, ఇక్కడి ప్రజలతో అదే నమ్మకాన్ని నిర్మించాలని గ్రీన్ ఎస్‌ఎమ్ ఆశిస్తోంది," అని గ్రీన్ ఎస్‌ఎమ్ లాంచ్ సందర్భంగా జీఎస్‌ఎమ్ గ్లోబల్ సీఈఓ న్గుయెన్ వాన్ థాన్ వివరించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


