కెనడాలోనే అత్యధిక మంది భారత విద్యార్థులు- అడ్మిషన్లకు ముందు ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి..

ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థుల మొదటి ఛాయిస్‌గా కెనడా నిలుస్తోంది. 2024 నాటికి విద్యార్థుల నమోదు భారీగా పెరిగిన నేపథ్యంలో, అడ్మిషన్లు పొందేందుకు పాటించాల్సిన కీలక టిప్స్​, తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఇక్కడ చూడండి..

Published on: Dec 24, 2025, 07:30:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నీతి ఆయోగ్​ ఇటీవలే విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం.. చదువు కోసం భారతీయుల్లో ఎక్కువ మంది కెనడాకు వెళుతున్నారు. నాణ్యమైన విద్య, చదువు పూర్తయ్యాక లభించే ఉద్యోగ అవకాశాలు, సులువైన వలస మార్గాలే ఇందుకు ప్రధాన కారణం. గణాంకాలను పరిశీలిస్తే, 2014లో కెనడాలో 3.26 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు ఉండగా, 2024 నాటికి ఆ సంఖ్య 4.85 లక్షలకు చేరుకుంది. అంటే దాదాపు 48.7 శాతం పెరుగుదల కనిపిస్తోంది.

కెనడాలో చదువుకు ప్లాన్​ చేస్తున్నారా?
కెనడాలో చదువుకు ప్లాన్​ చేస్తున్నారా?

కెనడా వెళ్లాలనే ఆలోచనలు ఉన్నప్పటికీ అక్కడి యూనివర్సిటీల్లో సీటు సంపాదించడం, వీసా ప్రక్రియను పూర్తి చేయడం వంటి అంశాలపై అనేక సందేహాలు కలుగుతుంటాయి. ఈ నేపథ్యంలో కెనడా యూనివర్సిటీల్లో అడ్మిషన్​ ప్రక్రియకు ముందు, మీరు అవగాహన పొందాల్సిన కొన్ని విషయాలను, టిప్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

కెనడాలో భారతీయులు..

కెనడా ఆర్థిక వ్యవస్థకు అంతర్జాతీయ విద్యార్థులు వెన్నెముకగా నిలుస్తున్నారు. 2022లో ఈ రంగం ద్వారా కెనడా జీడీపీకి సుమారు 1.92 లక్షల కోట్ల రూపాయల ఆదాయం లభించింది. మరీ ముఖ్యంగా భారతీయ విద్యార్థుల హవా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. 2023లో కెనడా జారీ చేసిన మొత్తం స్టడీ పర్మిట్లలో 42.9 శాతం వాటా భారతీయులదే కావడం విశేషం.

కెనడా యూనివర్సిటీలకు అప్లై చేసే ముందు ఇవి తెలుసుకోండి..

1. ఒకే నిబంధన అందరికీ వర్తించదు: కెనడాలోని ప్రతి యూనివర్సిటీకి, ప్రతి కోర్సుకూ వేర్వేరు అర్హత ప్రమాణాలు ఉంటాయి. ఒకే రాష్ట్రంలో ఉన్నా రెండు యూనివర్సిటీల నిబంధనలు వేరుగా ఉండవచ్చు. కాబట్టి, అన్నిటికీ ఒకే పద్ధతి ఉంటుందని అనుకోకుండా, అధికారిక వెబ్‌సైట్లను క్షుణ్ణంగా పరిశీలించాలి.

2. అధికారిక సమాచారాన్నే నమ్మండి: ఏదైనా థర్డ్ పార్టీ వెబ్‌సైట్లు లేదా సోషల్ మీడియా సమాచారం చూసి మోసపోకండి. యూనివర్సిటీ వెబ్‌సైట్లతో పాటు 'EduCanada', 'UniversityStudy.ca' వంటి అధికారిక పోర్టల్స్‌ను మాత్రమే అనుసరించండి.

3. సరైన ఇంగ్లీష్ టెస్ట్‌ను ఎంచుకోండి: అభ్యర్థుల ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని యూనివర్సిటీలు చాలా సీరియస్‌గా తీసుకుంటాయి. చాలా మంది విద్యార్థులు ఇప్పుడు 'డ్యుయోలింగో ఇంగ్లీష్ టెస్ట్' (డీఈటీ) వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో రాసుకోవచ్చు, ఫలితాలు 48 గంటల్లోనే వస్తాయి. దీని ఫీజు కూడా సుమారు 6 వేల రూపాయలే. కెనడాలోని దాదాపు 480 పైగా ప్రోగ్రామ్‌లు, ప్రధాన యూనివర్సిటీలు దీనిని అంగీకరిస్తున్నాయి.

  • చదువు కోసం విదేశాలకు వెళుతున్న భారతీయుల్లో ఆంధ్ర వారే ఎక్కువ! పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

సులభంగా అడ్మిషన్ పొందేందుకు టిప్స్:

ముందస్తు ప్రణాళిక: అడ్మిషన్ ప్రక్రియను కనీసం 6 నుంచి 8 నెలల ముందే ప్రారంభించాలి. దీనివల్ల డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవడానికి, పరీక్షలు రాయడానికి తగిన సమయం దొరుకుతుంది.

చెక్ లిస్ట్ సిద్ధం చేసుకోండి: ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన డెడ్‌లైన్లు, అవసరమైన పత్రాలు, టెస్ట్ స్కోర్ల కోసం ఒక చెక్ లిస్ట్ రాసి పెట్టుకోండి. ఇది చివరి నిమిషంలో కంగారును తగ్గిస్తుంది.

స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్​ఓపీ): అడ్మిషన్ రావడంలో ఎస్​ఓపీ కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఆ కోర్సు ఎందుకు చేయాలనుకుంటున్నారు? మీ భవిష్యత్తు లక్ష్యాలేంటి? అనేది స్పష్టంగా వివరించాలి. ఏదో మొక్కుబడిగా కాకుండా, ప్రతి యూనివర్సిటీకి ప్రత్యేకంగా దానిని తీర్చిదిద్దాలి.

అనుమానాలుంటే అడగండి: ఏదైనా విషయంలో సందేహం ఉంటే నేరుగా యూనివర్సిటీ అడ్మిషన్ ఆఫీసుకే ఈమెయిల్ చేయవచ్చు. ఎవరో చెప్పిన ఊహాగానాలపై ఆధారపడవద్దు.

ఇటీవలి కాలంలో కెనడా ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించినప్పటికీ, అర్హత కలిగిన విద్యార్థులకు అక్కడి యూనివర్సిటీలు ఎప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉన్నాయి. సరైన ప్రణాళిక ఉంటే మీ కెనడా కల సాకారం కావడం పెద్ద కష్టమేమీ కాదు!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More