కెనడాలో భారత మహిళ దారుణ హత్య- ప్రియుడే చంపేశాడా?

కెనడాలోని టొరంటోలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 30 ఏళ్ల భారతీయ యువతి హిమాన్షీ ఖురానా హత్యకు గురైంది. ఈ దారుణ హత్యకు ఆమె సన్నిహితుడు అబ్దుల్ గఫూరీనే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

Published on: Dec 24, 2025, 11:16:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కెనడాలో నివసిస్తున్న భారతీయులను మరో విషాద వార్త కలిచివేసింది. టొరంటోలో ఉంటున్న 30 ఏళ్ల భారతీయ మహిళ హిమాన్షీ ఖురానా దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 32 ఏళ్ల అబ్దుల్ గఫూరీ అనే వ్యక్తిపై 'ఫస్ట్ డిగ్రీ మర్డర్' కింద కేసు నమోదు చేశారు. హిమాన్షీకి గఫూరీ సన్నిహితుడు అని తెలుస్తోంది.

కెనడాలో భారత మహిళ హత్య.. (Toronto Police)
కెనడాలో భారత మహిళ హత్య.. (Toronto Police)

ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కెనడాలో భారత మహిళ హత్య- అసలేం జరిగింది?

టొరంటో పోలీస్ సర్వీస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 19వ తేదీ రాత్రి స్ట్రాచన్ అవెన్యూ, వెల్లింగ్టన్ స్ట్రీట్ వెస్ట్ ప్రాంతంలో ఒక మహిళ అదృశ్యమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు, శనివారం (డిసెంబర్ 20) ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఒక నివాసం లోపలికి వెళ్లారు. అదృశ్యమైన మహిళ మృతదేహాన్ని అందులో గుర్తించారు. ఆమెను హిమాన్షీ ఖురానాగా నిర్ధారించారు.

హిమాన్షీ టొరంటోలోనే నివసిస్తూ ఓ డిజిటల్ క్రియేటర్‌. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు పోలీసుల రికార్డులతో సరిపోలాయి.

ప్రియుడే హంతకుడా?

ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు అనంతరం పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు.

"మృతురాలికి, నిందితుడికి మధ్య గతంలోనే పరిచయం ఉంది. ఇది సన్నిహిత భాగస్వాముల మధ్య జరిగిన హింస (ఇంటిమేట్​ పార్ట్​నర్​ వయొలెన్స్​) అని భావిస్తున్నాము," అని టొరంటో పోలీస్ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.

వీరిద్దరూ గతంలో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడు అబ్దుల్ గఫూరీ ఫోటోను విడుదల చేసిన పోలీసులు, అతని ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

భారత దౌత్య కార్యాలయం స్పందన..

కెనడాలో భారత మహిళ దారుణ హత్యపై టొరంటోలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. "యువ భారతీయ పౌరురాలు హిమాన్షీ ఖురానా హత్యకు గురవ్వడం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. గత కొన్ని రోజులుగా స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నాము. బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటాము," అని ఎక్స్‌లో పేర్కొంది.

కెనడాలో భారతీయులపై దాడులు, హత్యలు పెరుగుతుండటం ఇప్పుడు ప్రవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. హిమాన్షీ కుటుంబం ప్రస్తుతం తీవ్ర దుఃఖంలో ఉంది. తమ బిడ్డను పొట్టనబెట్టుకున్న నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More