US student visa : అమెరికా కలలకు బిగ్ షాక్! పీక్ సీజన్‌లో ఇండియన్ స్టూడెంట్ వీసాలపై 60% వేటు..

అమెరికాలో అత్యధిక సంఖ్యలో ఉన్న భారతీయ విద్యార్థులకు ఎఫ్-1 స్టూడెంట్ వీసాల జారీ భారీగా పడిపోయింది. పీక్ అడ్మిషన్ సీజన్‌లో ఏకంగా 60% వీసాలు తగ్గినట్లు సీఐఎస్ అధ్యయనంలో తేలింది. ఈ కొత్త పరిణామం అగ్రరాజ్యం వైపు చూస్తున్న మన విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

Published on: Aug 5, 2026, 10:30:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉన్నత చదువుల కోసం అమెరికా వైపు అడుగులు వేస్తున్న భారతీయ విద్యార్థులకు షాకింగ్ వార్త! అమెరికా యూనివర్సిటీల్లో అత్యధిక సంఖ్యలో చేరుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో మనవారే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, ఎఫ్-1 స్టూడెంట్ వీసాల జారీలో మాత్రం అనూహ్య క్షీణత నమోదైంది. ముఖ్యంగా అడ్మిషన్ల పరంగా ఎంతో కీలకమైన పీక్ సీజన్‌లో భారతీయ అభ్యర్థులకు జారీ చేసిన యూఎస్ స్టూడెంట్ వీసాల సంఖ్య దారుణంగా పడిపోవడం గమనార్హం.

భారతీయులకు యూఎస్ స్టూడెంట్ వీసా కష్టాలు!
భారతీయులకు యూఎస్ స్టూడెంట్ వీసా కష్టాలు!

సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ (సీఐఎస్) తన తాజా అధ్యయనంలో వెల్లడించిన గణాంకాలు ఇప్పుడు.. అమెరికాకు వెళ్లాలనుకుంటున్న భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకంగా మారాయి.

ఏకంగా 60 శాతం పడిపోయిన వీసాలు!

సీఐఎస్ అధ్యయనం ప్రకారం, 2025 మే నుంచి ఆగస్టు మధ్య అత్యంత కీలకమైన నాలుగు నెలల కాలంలో అమెరికా ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు కేవలం 22,149 ఎఫ్-1 వీసాలను మాత్రమే మంజూరు చేసింది. 2024 మే-ఆగస్టు మధ్య జారీ చేసిన 58,694 వీసాలతో పోలిస్తే ఇది ఏకంగా 62 శాతం తక్కువ.

అంతేకాకుండా 2017-19, 2021-24 సంవత్సరాల సగటుతో పోల్చి చూస్తే ఏకంగా 60 శాతం క్షీణత నమోదు కావడం గమనార్హం.

సాధారణంగా అమెరికాలో 'ఫాల్ ఇన్ టేక్' కోసం దరఖాస్తు చేసుకునే అంతర్జాతీయ విద్యార్థులకు మే నుంచి ఆగస్టు మధ్య కాలంలోనే అత్యధికంగా వీసాలు మంజూరవుతాయి. 2024 గణాంకాలను పరిశీలిస్తే, భారతీయులకు లభించిన మొత్తం ఎఫ్-1 వీసాలలో దాదాపు 77 శాతం ఈ నాలుగు నెలల వ్యవధిలోనే వచ్చాయి. కానీ ఈ ఏడాది ఇదే సమయంలో వీసాల సంఖ్య సగానికి పైగా పడిపోవడం గమనార్హం.

నేటికీ భారతీయులే నంబర్ వన్..

కాగా అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులలో భారతీయులదే అగ్రస్థానం. 2024-25 విద్యా సంవత్సరంలో దాదాపు 3,63,019 మంది భారతీయ విద్యార్థులు అమెరికన్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో నమోదయ్యారు. అక్కడ ఉన్న మొత్తం విదేశీ విద్యార్థులలో భారతీయుల వాటా ఏకంగా 31 శాతంగా ఉంది. భారత్, చైనాల నుంచే చెరి సగం కంటే ఎక్కువ మంది విద్యార్థులు అమెరికాను ఎంచుకుంటున్నారు. ఇన్ని వేల మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నప్పటికీ వీసా ఇంటర్వ్యూలు లభించకపోవడం, కఠినమైన తనిఖీలు, మారుతున్న ఇమ్మిగ్రేషన్ విధానాలు మన విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఓపీటీ ఉపాధి అవకాశాలపై పెరుగుతున్న ఆందోళన!

అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అనుభవం సంపాదించడానికి భారతీయ గ్రాడ్యుయేట్లకు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్ అత్యంత కీలకంగా నిలుస్తోంది.

2024-25 విద్యా సంవత్సరంలో ఓపీటీ కింద అమెరికాలో పనిచేస్తున్న 2,94,253 మంది అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లలో.. దాదాపు సగం మంది అంటే 1,43,740 మంది ఒక్క మన దేశానికి చెందినవారే కావడం విశేషం.

అంతేగాక, ఇంజనీరింగ్, టెక్నాలజీ వంటి రంగాలకు చెందిన 'స్టెమ్-ఓపీటీ' ఎక్స్‌టెన్షన్ పొందిన 1,65,524 మందిలో 79,331 మంది భారతీయులే ఉంటూ అతిపెద్ద లబ్ధిదారుల వర్గంగా నిలిచారు.

ఓపీటీ విధానం ద్వారా సాధారణ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు 12 నెలల పాటు, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) విద్యార్థులు అదనంగా 24 నెలల పాటు అమెరికాలోనే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు.

ఈ వీసాల కోత వెనుక కారణాలేమిటి?

స్టూడెంట్ వీసాల సంఖ్య తగ్గడం వల్ల భవిష్యత్తులో ఓపీటీ ప్రోగ్రామ్‌లోకి, అలాగే తద్వారా హెచ్-1బీ వీసాలకు వెళ్లే గ్రాడ్యుయేట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని సీఐఎస్ నివేదిక అంచనా వేసింది. విదేశీ విద్యార్థుల రాక తగ్గితే అమెరికన్ స్థానిక గ్రాడ్యుయేట్లకు ఎక్కువ ఉద్యోగావకాశాలు దక్కుతాయని, ముఖ్యంగా చైనా విద్యార్థుల కదలికలు తగ్గడం వల్ల తమ జాతీయ భద్రత బలపడుతుందని అమెరికా భావిస్తున్నట్లు నివేదిక అభిప్రాయపడింది. ఏదేమైనా, ఈ తాజా కోత అమెరికా ఉన్నత విద్యపై ధ్యాస పెట్టిన వేలాది మంది భారతీయ విద్యార్థుల కలలపై చల్లని నీళ్లు చల్లింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More