Women’s Day 2026 : దేశ రాజకీయాల్లో మహిళల ప్రాతినిథ్యం ఎంత? లింగ సమానత్వం కోసం 130ఏళ్లు వేచి చూడక తప్పదు!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత పార్లమెంటులో మహిళల భాగస్వామ్యంపై చర్చ మొదలైంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ఇతర పార్టీల కంటే తమ పార్టీలోనే ఎక్కువ మంది మహిళా ఎంపీలు ఉన్నారని వెల్లడించగా, 2029 నుండి మహిళా రిజర్వేషన్లు అమలులోకి వచ్చే అవకాశం ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 సందర్భంగా, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ భారత రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యంపై కీలక ప్రశ్నలు లేవనెత్తారు. దేశ రాజధానిలోని నెహ్రూ పార్క్ నుంచి విడుదల చేసిన ఒక వీడియోలో, ఆయన దేశంలోని ఐదు ప్రధాన రాజకీయ పార్టీల్లో ఎంతమంది మహిళా ఎంపీలు ఉన్నారనే అంశాన్ని విశ్లేషించారు.

"డీఎంకెలో 13%, బీజేపీలో 15%, ఎస్పీలో 16%, కాంగ్రెస్‌లో 16% మంది మహిళా ఎంపీలు ఉన్నారు. కానీ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు 33 శాతం కావాలని చెబుతోంది. కానీ ఆ బిల్లు లేకపోయినా మా పార్టీలో అంతకంటే ఎక్కువ మంది మహిళా ఎంపీలు ఉన్నారు. వెస్ట్ బెంగాల్.. బెస్ట్ బెంగాల్" అని ఆయన పేర్కొన్నారు.
ఏళ్ల తరబడి మహిళల భాగస్వామ్యం..
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే మహిళల నిష్పత్తి 1957లో 3 శాతం నుంచి 2024 నాటికి 10 శాతానికి పెరిగింది. మొదటి లోక్‌సభలో కేవలం 22 మంది మహిళా సభ్యులు ఉండగా, 17వ లోక్‌సభలో ఆ సంఖ్య 78కి చేరింది. ప్రస్తుత 18వ లోక్‌సభలో 74 మంది మహిళా సభ్యులు ఉన్నారు, ఇది మొత్తం సభ్యుల్లో 13.6 శాతానికి సమానం. ఇక రాజ్యసభలో 1952లో కేవలం 15 మంది మహిళలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 42కు (సుమారు 17 శాతం) చేరింది.
పంచాయతీ రాజ్‌లో అగ్రస్థానం..
స్థానిక సంస్థల్లో భారత మహిళల ప్రాతినిధ్యం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా పంచాయతీ రాజ్ సంస్థల్లో సుమారు 14.5 లక్షల మంది ఎన్నికైన మహిళా ప్రతినిధులు ఉన్నారు. ఇది మొత్తం ప్రతినిధుల్లో 46 శాతానికి సమానం. ఇది ప్రపంచంలోనే సాటిలేని రికార్డు. రాజ్యాంగం కనీసం 33 శాతం రిజర్వేషన్లు ఉండాలని చెబుతున్నా, ఇప్పటికే దేశంలోని 21 రాష్ట్రాలు స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిబంధనలు చేశాయి.
మహిళా రిజర్వేషన్ బిల్లు..
2023లో పార్లమెంటు 'రాజ్యాంగ (నూట ఆరవ సవరణ) చట్టం, 2023' లేదా 'నారీ శక్తి వందన్ అధినియం'ను ఆమోదించింది. దీని ప్రకారం లోక్‌సభ, దిల్లీ అసెంబ్లీ సహా అన్ని రాష్ట్ర శాసనసభల్లో మూడో వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి. ఈ రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన సీట్లకు కూడా వర్తిస్తుంది.
ఎప్పుడు అమలు అవుతుంది?
ఈ బిల్లు ప్రకారం, కొత్త జనాభా గణన నిర్వహించిన తర్వాతే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. 16వ భారత జనాభా గణన (2027) ప్రక్రియలో భాగంగా ఏప్రిల్-సెప్టెంబర్ 2026 మధ్య హౌస్ లిస్టింగ్ జరుగుతుంది. 2029 సాధారణ ఎన్నికల నుంచి ఈ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ రిజర్వేషన్ 15 ఏళ్ల పాటు అమలులో ఉంటుంది.
శాసన సభలలో మహిళల ప్రస్తుత స్థితి..
ప్రస్తుతం లోక్‌సభలో 14% మంది మహిళలు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంపీల్లో 27% మంది మహిళలు ఉన్నారని ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ డేటా చెబుతోంది.
పార్టీల వారీగా: తృణమూల్ కాంగ్రెస్‌లో 37% మంది ఎంపీలు మహిళలు ఉండగా, బీజేపీ, కాంగ్రెస్‌లలో ఇది 15 శాతంగా ఉంది.
రాష్ట్ర అసెంబ్లీలు: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో 20% మంది మహిళలు ఉండగా, మగిలిన రాష్ట్రాల సగటు 10 శాతంగా ఉంది. టీఎంసీలో 17%, టీడీపీలో 15% మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు.
స్పీకర్లు: 1952 నుంచి లోక్‌సభకు ఇద్దరు మహిళా స్పీకర్లు పనిచేశారు, కానీ ఇప్పటివరకు మహిళా డిప్యూటీ స్పీకర్ లేరు.
పనితీరు: 18వ లోక్‌సభలో మహిళా సభ్యులు పురుషులతో సమానంగా పని చేస్తున్నారు. సగటున 85% హాజరుతో పాటు 84 ప్రశ్నలు అడుగుతూ చురుగ్గా పాల్గొంటున్నారు.
ప్రపంచవ్యాప్త ధోరణి..
సెప్టెంబర్ 12, 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 29 దేశాలలో 32 మంది మహిళలు దేశాధినేతలుగా లేదా ప్రభుత్వ అధినేతలుగా ఉన్నారు. ప్రస్తుత వేగంతో చూస్తే, అత్యున్నత పదవుల్లో లింగ సమానత్వం సాధించడానికి మరో 130 ఏళ్లు పట్టవచ్చని ‘యూఎన్ ఉమెన్’ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేవలం ఆరు దేశాలు (రువాండా, క్యూబా, నికరాగ్వా, అండొర్రా, మెక్సికో, యూఏఈ) మాత్రమే తమ పార్లమెంటులో 50% లేదా అంతకంటే ఎక్కువ మహిళా ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


