Mukul Roy : కేంద్ర మాజీ మంత్రి, బెంగాల్​ 'చాణిక్యుడు' ముకుల్​ రాయ్​ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ (71) సోమవారం తెల్లవారుజామున కోల్‌కతాలో కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

Published on: Feb 23, 2026, 08:14:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link
ముకుల్​ రాయ్​.. (HT_PRINT)
ముకుల్​ రాయ్​.. (HT_PRINT)

పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర రైల్వే మంత్రి, ‘బెంగాల్​ చాణిక్యుడు’గా పేరొందిన ముకుల్ రాయ్ (71) సోమవారం (ఫిబ్రవరి 23) తెల్లవారుజామున కోల్‌కతాలో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు, స్థానిక మీడియా కథనాల ప్రకారం, రాయ్ తీవ్రమైన గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు.

సాల్ట్ లేక్ ప్రాంతంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు శుభ్రాంగ్షు రాయ్ ధృవీకరించారు.

అనారోగ్యంతో సుదీర్ఘ పోరాటం:

ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో ఒకప్పుడు అత్యంత ప్రభావవంతమైన వ్యూహకర్తగా పేరుగాంచిన ముకుల్ రాయ్ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మలుపులు ఉన్నాయి.

కాగా గత కొన్ని ఏళ్లుగా ముకుల్ రాయ్ తీవ్ర ఆరోగ్య సమస్యల కారణంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2023 ప్రారంభంలో ఆయనకు డిమెన్షియా (మతిమరుపు), పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. 2023 మార్చిలో హైడ్రోసిఫలస్​ వల్ల మెదడుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. 2024 జులైలో ఆయన తన నివాసంలో కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై, రక్తం గడ్డకట్టడంతో మరోసారి సర్జరీ జరిగింది. వీటికి తోడు దీర్ఘకాలిక మధుమేహం, శ్వాసకోశ ఇబ్బందులతో ఆయన ఆరోగ్యం చివరి దశలో బాగా క్షీణించింది.

టీఎంసీలో నంబర్-2 నుంచి కేంద్ర మంత్రి వరకు..

మమతా బెనర్జీ తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో ఒకప్పుడు అత్యంత శక్తివంతమైన నేతగా ముకుల్ రాయ్ గుర్తింపు పొందారు. 2011లో బెంగాల్‌లో 34 ఏళ్ల వామపక్ష పాలనకు చరమగీతం పాడటంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

2012లో యూపీఏ-2 ప్రభుత్వంలో దినేష్ త్రివేది స్థానంలో దేశ 32వ రైల్వే మంత్రిగా బాధ్యతలు ముకుల్​ రాయ్​ చేపట్టారు. మార్చి 20 నుంచి సెప్టెంబర్ 21, 2012 వరకు ఆయన ఈ పదవిలో ఉన్నారు.

అయితే, నారద స్టింగ్ ఆపరేషన్ వివాదం తర్వాత టీఎంసీలో ఆయన ప్రభావం తగ్గింది. 2017లో ఆయన పార్టీ నుంచి బహిష్కరణకు సైతం గురయ్యారు.

బీజేపీకి వెళ్లడం.. మళ్లీ సొంత గూటికి చేరడం:

నవంబర్ 2017లో ముకుల్ రాయ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. 2020లో ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా నియమితులయ్యారు. 2021 బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ వ్యూహరచనలో కీలక పాత్ర పోషించి, ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. ఎన్నికల అనంతరం తిరిగి మమతా బెనర్జీ సమక్షంలో టీఎంసీలోకి చేరారు. అయితే ఆరోగ్య కారణాల రీత్యా ఆయన రాజకీయంగా చురుగ్గా ఉండలేకపోయారు.

ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు జోక్యం..

ముకుల్ రాయ్ ఫిరాయింపుపై ప్రతిపక్షాలు న్యాయపోరాటం చేశాయి. కోల్​కతా హైకోర్టు ఆయన్ని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించినప్పటికీ, ఈ ఏడాది జనవరి 16న సుప్రీంకోర్టు ఆ తీర్పుపై స్టే విధించింది. ఎలక్ట్రానిక్ ఆధారాలను లోతుగా పరిశీలించాల్సి ఉందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది. ఈ న్యాయపోరాటం కొనసాగుతుండగానే ఆయన కన్నుమూశారు.

ముకుల్ రాయ్ మృతి పట్ల బెంగాల్ రాజకీయ వర్గాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన మరణం రాష్ట్ర రాజకీయాల్లో ఒక శకాన్ని ముగించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More