లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. 118 మంది ఎంపీల నోటీసు

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలని కోరుతూ 118 మంది విపక్ష ఎంపీలు నోటీసు ఇచ్చారు. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపిస్తూ రాజ్యాంగంలోని అధికరణ 94(సి) ప్రకారం ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు.

Published on: Feb 10, 2026, 15:07:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ విపక్షాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు మంగళవారం (ఫిబ్రవరి 9) లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు విపక్ష సభ్యులు నోటీసు సమర్పించారు. సుమారు 118 మంది ఎంపీలు ఈ అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. 118 మంది ఎంపీల నోటీసు (Sansad TV)
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. 118 మంది ఎంపీల నోటీసు (Sansad TV)

ఈ నోటీసు అందిన వెంటనే, దీనిపై తదుపరి చర్యలు తీసుకోవడానికి సంబంధిత నిబంధనలను పరిశీలించాలని స్పీకర్ ఓం బిర్లా సెక్రటరీ జనరల్‌ను ఆదేశించినట్లు సమాచారం.

విపక్షాల ప్రధాన ఆరోపణలు ఏమిటి?

స్పీకర్ ఓం బిర్లా సభను ఏకపక్షంగా నడుపుతున్నారని, ప్రతిపక్ష నేతలను మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 94(సి) నిబంధనల ప్రకారం ఆయనను తొలగించాలని డిమాండ్ చేశాయి.

తమ ఆరోపణలకు బలంగా నాలుగు ప్రధాన అంశాలను విపక్షాలు ఈ నోటీసులో ప్రస్తావించాయి.

  • రాహుల్ గాంధీ ప్రసంగానికి అడ్డంకులు: ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతున్న సమయంలో.. లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీని తన ప్రసంగాన్ని పూర్తి చేయనివ్వలేదని విపక్షాలు ఆరోపించాయి. సభలో విపక్ష నేత గొంతు నొక్కడం ఇది మొదటిసారి కాదని వారు పేర్కొన్నారు.
  • ఎంపీల సస్పెన్షన్: ఫిబ్రవరి 3న ఎనిమిది మంది విపక్ష ఎంపీలను బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ, ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
  • బిజెపి ఎంపీపై చర్యలు లేకపోవడం: ఫిబ్రవరి 4న అధికార బీజేపీకి చెందిన ఒక ఎంపీ.. ఇద్దరు మాజీ ప్రధాన మంత్రులపై వ్యక్తిగత దాడులు చేస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా స్పీకర్ మందలించలేదని విపక్షాలు గుర్తుచేశాయి. ఎన్నిసార్లు కోరినా ఆ ఎంపీపై చర్యలు తీసుకోకపోవడం స్పీకర్ పక్షపాత వైఖరికి నిదర్శనమని మండిపడ్డాయి.
  • స్పీకర్ వ్యాఖ్యలపై అభ్యంతరం: రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఆమోదం పొందిన తర్వాత ఓం బిర్లా స్వయంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు గౌరవప్రదంగా లేవని విపక్షాలు పేర్కొన్నాయి. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్‌కు సంరక్షకుడిగా ఉండాల్సిన స్పీకరే.. సభలో ఇలాంటి ఆరోపణలు చేయడం రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేయడమేనని నోటీసులో స్పష్టం చేశారు.

ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురాకుండా స్పీకర్ అడ్డుకుంటున్న తీరు తమను ఎంతగానో కలచివేసిందని విపక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటరీ నిబంధనలు, ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో స్పీకర్ విఫలమయ్యారని వారు నోటీసులో పేర్కొన్నారు. ఈ పరిణామం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More