IPL 2026: ఐపీఎల్ 2026 మార్చి 28 నుంచి.. ఫైనల్ మే 31న.. క్రికిన్ఫో రిపోర్టు.. క్రికెట్ ఫ్యాన్స్‌కు సమ్మర్ ఫెస్టివల్
ఐపీఎల్ 2026 (IPL 2026) మార్చి 28న ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికల కారణంగా షెడ్యూల్ ప్రకటన ఆలస్యమవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈఎస్పీఎన్ క్రికిన్ఫో రిపోర్టు వైరల్ అవుతోంది.
ఐపీఎల్ లవర్స్ కు కీలక అప్‌డేట్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్ ప్రారంభ తేదీలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం 2026 ఐపీఎల్ ఎడిషన్ మార్చి 28న ప్రారంభమై, మే 31న ముగియనుంది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలం తర్వాత.. టోర్నీ మార్చి 26నే మొదలవుతుందని భావించినప్పటికీ, అంతర్గత కారణాల వల్ల దీనిని రెండు రోజులు ముందుకు జరిపినట్లు తెలుస్తోంది.
షెడ్యూల్ ప్రకటనలో జాప్యం ఎందుకు?
ఐపీఎల్ 2026 పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల కావడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. దీనికి ప్రధాన కారణం మూడు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు. అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఇంకా తేదీలను ప్రకటించలేదు.
గతంలో 2009, 2014, 2019, 2024లలో కూడా ఎన్నికల వల్ల షెడ్యూల్‌ను రెండు విడతల్లో ప్రకటించడం లేదా వేదికలను మార్చడం జరిగింది. అందుకే ఎన్నికల తేదీలు వెలువడే వరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 'వేచి చూసే ధోరణి'ని అవలంబిస్తోంది.
ఆర్‌సీబీ హోమ్ గ్రౌండ్ సస్పెన్స్
డిఫెండింగ్ ఛాంపియన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఈ సీజన్ తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.
గతేడాది ఆర్సీబీ విజయోత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ స్టేడియం భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ నెల ప్రారంభంలో కర్ణాటక ప్రభుత్వం స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి ఇచ్చినప్పటికీ, ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు.
ఒకవేళ చిన్నస్వామి స్టేడియం ఖరారు కాకపోతే.. నవీ ముంబై, రాయ్‌పూర్ లేదా పుణేలలో ఆర్సీబీ తన హోమ్ మ్యాచ్‌లను ఆడే అవకాశం ఉంది.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆర్సీబీ
గతేడాది అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆర్సీబీ తన తొలి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. విరాట్ కోహ్లీ (43), కెప్టెన్ రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్ రాణించడంతో ఆర్సీబీ మంచి స్కోరు సాధించింది.
పంజాబ్ ఆటగాడు శశాంక్ సింగ్ (30 బంతుల్లో 61 నాటౌట్) వీరోచితంగా పోరాడినప్పటికీ, పంజాబ్ కేవలం 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అత్యధికంగా ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలవగా, కోల్‌కతా నైట్ రైడర్స్ మూడు టైటిళ్లతో తర్వాతి స్థానంలో ఉంది. 18 ఏళ్ల తర్వాత తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ.. ఈసారి ఏం చేస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


