ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) మార్కెట్లో అనధికారికంగా సాగుతున్న గ్రే మార్కెట్ కార్యకలాపాలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కొరడా ఝుళిపించింది. ఐపీఓలకు సంబంధించిన గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) గణాంకాలను ప్రచురించడం, ఇతరులకు చేరవేయడం తక్షణమే నిలిపివేయాలని మార్కెట్ మధ్యవర్తులు, భాగస్వాములను ఆదేశించింది. నవంబర్ 23 జారీ చేసిన కీలక అడ్వైజరీలో సెబీ ఈ మేరకు స్పష్టం చేసింది. ఒక ఐపీఓ ఏ ధరకు లిస్ట్ అవుతుందో, ఎంత లాభం వస్తుందో అంచనా వేయడానికి జీఎంపీపై ఆధారపడవద్దని ఇన్వెస్టర్లను గట్టిగా హెచ్చరించింది. నియంత్రిత స్టాక్ మార్కెట్ పరిధికి పూర్తిగా వెలుపల జరిగే ఇలాంటి అనధికారిక ప్రీమియం లావాదేవీలకు దూరంగా ఉండాలని సూచించింది.

కొత్త ఐపీఓ రాగానే కంపెనీ ఆర్థిక పరిస్థితిని చూడటం కంటే ముందుగా "జీఎంపీ ఎంత నడుస్తోంది?" అని టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సాప్ ఛానెళ్లు, సోషల్ మీడియాలో వెతకడం చాలామందికి అలవాటుగా మారింది. భారీ ప్రీమియం కనిపిస్తోందని ఆశపడి దరఖాస్తు చేసిన ఎంతోమంది మదుపరులు, తీరా షేర్ లిస్ట్ అయిన రోజున డిస్కౌంట్ ధరకు పడిపోవడంతో భారీగా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి కృత్రిమ హైప్‌నకు అడ్డుకట్ట వేసేందుకే సెబీ రంగంలోకి దిగింది.
జీఎంపీ ప్రచారంపై సెబీ ఆంక్షలు.. మధ్యవర్తులకు స్పష్టమైన ఆదేశాలు!
నియంత్రణ లేని ప్రీ-లిస్టింగ్ ప్రీమియం గణాంకాలు (గ్రే మార్కెట్ ప్రీమియంలు) వెబ్సైట్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, వార్తాపత్రికలు, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయని సెబీ పేర్కొంది. సెబీ వద్ద నమోదైన కొందరు మార్కెట్ మధ్యవర్తులు, భాగస్వాములు సైతం ఇలాంటి గణాంకాలను ప్రచురిస్తుండటంపై నియంత్రణ సంస్థ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల్లో షేర్లు అధికారికంగా లిస్ట్ కాకముందే, అవి ట్రేడ్ అవుతున్నాయంటూ ప్రచారం చేసే అనధికారిక, ధ్రువీకరణ లేని ధరలనే జీఎంపీగా సెబీ అభివర్ణించింది.
సెక్యూరిటీస్ మార్కెట్ వ్యాప్తంగా ఏ రూపంలోనైనా, ఏ ప్లాట్‌ఫారమ్ ద్వారానైనా ఇలాంటి నియంత్రణ లేని ప్రీ-లిస్టింగ్ ప్రీమియంలను ప్రచురించడం, ప్రదర్శించడం లేదా ప్రచారం చేయడం తక్షణమే నిలిపివేయాలని సెబీ తన ప్రకటనలో కోరింది. సెబీ వద్ద నమోదైన అన్ని మధ్యవర్తి సంస్థలు, మార్కెట్ భాగస్వాములు తమ వెబ్సైట్లు, యాప్‌లతో పాటు ఈమెయిల్స్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియా ఖాతాల ద్వారా జీఎంపీ వివరాలను వెల్లడించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
గ్రే మార్కెట్‌పై సెబీ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది?
{{/usCountry}}సెక్యూరిటీస్ మార్కెట్ వ్యాప్తంగా ఏ రూపంలోనైనా, ఏ ప్లాట్‌ఫారమ్ ద్వారానైనా ఇలాంటి నియంత్రణ లేని ప్రీ-లిస్టింగ్ ప్రీమియంలను ప్రచురించడం, ప్రదర్శించడం లేదా ప్రచారం చేయడం తక్షణమే నిలిపివేయాలని సెబీ తన ప్రకటనలో కోరింది. సెబీ వద్ద నమోదైన అన్ని మధ్యవర్తి సంస్థలు, మార్కెట్ భాగస్వాములు తమ వెబ్సైట్లు, యాప్‌లతో పాటు ఈమెయిల్స్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియా ఖాతాల ద్వారా జీఎంపీ వివరాలను వెల్లడించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
గ్రే మార్కెట్‌పై సెబీ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది?
{{/usCountry}}గ్రే మార్కెట్ లావాదేవీలన్నీ గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజ్ వ్యవస్థకు వెలుపల జరుగుతాయని, వాటిపై ఎలాంటి నియంత్రణ సంస్థల పర్యవేక్షణ ఉండదని సెబీ ఎత్తిచూపింది. అధికారిక మార్కెట్ వ్యవస్థల ద్వారా జరిగే లావాదేవీలకు ఉన్నట్లుగా, ఈ అనధికారిక ట్రేడ్లకు సెటిల్మెంట్ గ్యారెంటీ గానీ, ఇన్వెస్టర్ల రక్షణ గానీ ఉండవు. పైగా వీటిలో ధరను నిర్ణయించే శాస్త్రీయ విధానం ఏదీ ఉండదు.
ఇలాంటి ధ్రువీకరణ లేని గణాంకాలను ప్రచారం చేయడం వల్ల ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని, ఇది సెక్యూరిటీస్ మార్కెట్ పారదర్శకత, జవాబుదారీతన సూత్రాలకు విరుద్ధమని సెబీ హెచ్చరించింది. నియంత్రిత తనిఖీ వ్యవస్థ లేకపోయినప్పటికీ, సాధారణ ఇన్వెస్టర్లు ఈ జీఎంపీ అంకెలను ఐపీఓ లిస్టింగ్ ధరలకు, రాబడులకు కచ్చితమైన సంకేతాలుగా నమ్మి మోసపోయే ప్రమాదం ఉందని సెబీ ఆందోళన వ్యక్తం చేసింది.
మోసపోతే సెబీ రక్షణ ఉండదు.. ఇన్వెస్టర్లకు కీలక సూచనలు!
గ్రే మార్కెట్ ప్రీమియంలను ఐపీఓ లిస్టింగ్ ధర లేదా అంచనా రాబడులకు కొలమానంగా భావించవద్దని సెబీ ఇన్వెస్టర్లకు హితవు పలికింది. నియంత్రణ పరిధికి వెలుపల ఉండే జీఎంపీ ఆధారిత లావాదేవీలలో అస్సలు పాల్గొనవద్దని కోరింది. పబ్లిక్ ఇష్యూలలో పెట్టుబడి పెట్టేటప్పుడు కేవలం సెబీ-రిజిస్టర్డ్ మధ్యవర్తులు, అధికారిక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
గ్రే మార్కెట్ లావాదేవీల్లో ఏవైనా వివాదాలు తలెత్తితే, బాధితులకు అధికారిక వివాద పరిష్కార వ్యవస్థల సేవలు అందవని సెబీ గట్టిగా హెచ్చరించింది. సెబీ లేదా స్టాక్ ఎక్స్ఛేంజీల పరిధిలోని ఇన్వెస్టర్ రక్షణ ప్రయోజనాలు, స్టాక్ ఎక్స్ఛేంజీలు నిర్వహించే ఫిర్యాదుల పరిష్కార వేదికలు, ఎక్స్ఛేంజీలు-డిపాజిటరీలు సంయుక్తంగా నడిపే ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ (ఓడీఆర్) పోర్టల్ వంటి ఏ సదుపాయాలూ గ్రే మార్కెట్ బాధితులకు వర్తించవని స్పష్టం చేసింది.
ఐపీఓ ఇన్వెస్టర్లు ఇకపై ఏం చేయాలి?
భారత ఐపీఓ మార్కెట్లో లిస్టింగ్‌కు ముందు రోజుల్లో జీఎంపీ కదలికలను గమనించడం ఒక సాధారణ అంశంగా మారిపోయింది. అనధికారిక మార్కెట్ సెంటిమెంట్‌ను అంచనా వేయడానికి మీడియా కథనాలలోనూ వీటిని తరచూ ప్రస్తావిస్తుంటారు. అయితే ఇలాంటి నియంత్రణ లేని సూచికలపై ఆధారపడటంలో ఉన్న ప్రమాదాలను సెబీ తాజా అడ్వైజరీ కళ్లకు కట్టింది. జీఎంపీ అనేది అనధికారిక మార్కెట్ కార్యకలాపాలపై ఒక అంచనాను మాత్రమే ఇవ్వగలదు తప్ప, అది లిస్టింగ్ పనితీరుకు గానీ పెట్టుబడి రాబడులకు గానీ నమ్మదగిన కొలమానం కాదని సెబీ తేల్చిచెప్పింది.
కాబట్టి ఐపీఓ ఇన్వెస్టర్లు కేవలం గ్రే మార్కెట్ ప్రీమియంలను చూసి సబ్స్క్రిప్షన్ నిర్ణయాలు తీసుకోకుండా, కంపెనీ అధికారిక పత్రాలలోని వివరాలను, వ్యాపార బలాబలాలను క్షుణ్ణంగా పరిశీలించి, అధికారిక మాధ్యమాల ద్వారానే పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం.
ABOUT THE AUTHOR
శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.