Jio IPO : సబ్‌స్క్రిప్షన్ ముగిసింది.. జియో ఐపీఓ అలాట్మెంట్, లిస్టింగ్ ఎప్పుడు? జీఎంపీ ఎంత?
భారతీయ స్టాక్ మార్కెట్‌లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన 'జియో ప్లాట్‌ఫామ్స్' రూ.30,213 కోట్ల ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ జియో ఐపీఓ అలాట్మెంట్, లిస్టింగ్ తేదీలతో పాటు జీఎంపీ వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ 'జియో ప్లాట్‌ఫామ్స్' మెగా ఐపీఓ దరఖాస్తుల స్వీకరణ ఘనంగా పూర్తయింది. రూ.30,213 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో వచ్చిన ఈ పబ్లిక్ ఇష్యూకు మదుపరుల నుంచి అనూహ్య స్పందన లభించింది. మూడు రోజుల బిడ్డింగ్ ముగిసే సరికి జియో ఐపీఓ భారీగా సబ్‌స్క్రైబ్ అయింది. దీనితో ఇప్పుడు ఇన్వెస్టర్ల దృష్టి అంతా షేర్ల కేటాయింపు, లిస్టింగ్ లాభాలపైనే నెలకొంది.

తెలుగు రాష్ట్రాల్లోని చిన్న, పెద్ద పెట్టుబడిదారులు కూడా భారీగా దరఖాస్తు చేసుకున్న ఈ ఐపీఓ అలోకేషన్ స్టేటస్, గ్రే మార్కెట్ ట్రెండ్, ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ వివరాలను ఒకసారి పరిశీలిద్దాము..
జియో ఐపీఓ అలాట్మెంట్, లిస్టింగ్ డేట్స్..
జియో ఐపీఓ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 26న (సోమవారం) షేర్ల కేటాయింపు ప్రక్రియను ముగిస్తారు. దరఖాస్తు చేసుకున్న ఇన్వెస్టర్లు తమకు షేర్లు దక్కయా లేదో బీఎస్‌ఈ, ఎన్ఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్లతో పాటు ఇష్యూ రిజిస్ట్రార్ 'కెఫిన్ టెక్నాలజీస్' పోర్టల్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
ఇక ఐపీఓ పొందిన మదుపరుల డీమ్యాట్ ఖాతాల్లోకి అక్టోబర్ 27న జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు జమ అవుతాయి. షేర్లు లభించని ఇన్వెస్టర్లకు అదే రోజున సొమ్ము రీఫండ్ అవుతుంది.
అక్టోబర్ 28న ఉదయం 10 గంటలకు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఈ షేర్లు ట్రేడింగ్‌కు రానున్నాయి.
జియో ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ వివరాలు..
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓలో మొత్తం 19.75 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా, మూడు రోజుల్లో ఏకంగా 421.87 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి1 అంటే మొత్తం ఇష్యూ 22.19 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయింది.
పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసే సంస్థాగత ఇన్వెస్టర్లు (క్యూఐబీ) ఈ ఇష్యూపై విపరీతమైన ఆసక్తి చూపిస్తూ తమ కోటాను 70.55 రెట్లు భర్తీ చేశారు. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎన్ఐఐ) విభాగం 14 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 2.72 రెట్లు సబ్‌స్క్రిప్షన్ సాధించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్‌హోల్డర్ల కోటా 7.60 రెట్లు, కంపెనీ ఉద్యోగుల కోటా 2.93 రెట్లు నమోదయ్యాయి.
జియో ఐపీఓ జీఎంపీ ఎంత?
ప్రాథమిక మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. గ్రే మార్కెట్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లకు బంపర్ డిమాండ్ కనిపిస్తోంది. ప్రస్తుతం జియో ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) రూ.250 వద్ద కొనసాగుతోంది.
ఐపీఓ గరిష్ఠ ధర శ్రేణి రూ.1,119 కి రూ.250 ప్రీమియంను జత చేస్తే, అక్టోబర్ 28న ఈ షేరు రూ.1,369 వద్ద మార్కెట్లో ప్రారంభమయ్యే అవకాశముంది. అంటే ఐపీఓ ధర కంటే దాదాపు 22.34 శాతం మేర లిస్టింగ్ లాభాలు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
అయితే గ్రే మార్కెట్ అంచనాలు కేవలం ఊహాగానాల ఆధారంగా ఉంటాయని, లిస్టింగ్ రోజున మార్కెట్ ట్రెండ్ ఆధారంగానే అసలు ధర నిర్ణయమవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
రిలయన్స్ షేరు ఒత్తిడి.. ఐపీఓ నిధుల వినియోగం ఎలా?
ఒకవైపు జియో ఐపీఓ సంచలనం సృష్టిస్తున్నప్పటికీ, మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర మాత్రం బిడ్డింగ్ సాగిన మూడు రోజుల్లో 1 శాతం క్షీణించింది. ఈ ఏడాది జనవరిలో నమోదైన 52 వారాల గరిష్ఠ ధర రూ.1,611.20 తో పోలిస్తే ఆర్‌ఐఎల్ షేరు ప్రస్తుతం 26 శాతం దిగువన ట్రేడ్ అవుతోంది. గడిచిన ఏడాది కాలంలో ఈ షేరు దాదాపు 18 శాతం నష్టాన్ని మూటగట్టుకుంది.
ఈ ఐపీఓ ద్వారా సేకరించిన రూ.30,213 కోట్లలో రూ.27,500 కోట్లను తమ ప్రధాన టెలికామ్ విభాగమైన ‘రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్’ అప్పుల తీర్చేందుకు కంపెనీ ఉపయోగిస్తుంది. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


