...
...
Next Story

Strait of Hormuz : -హర్మూజ్ జలసంధి మళ్లీ క్లోజ్- ఇరాన్ సంచలన ప్రకటన! చమురు ధరకు రెక్కలు?

US Iran Strait of Hormuz : అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను ఇరాన్ సైన్యం నిలిపివేసింది! అనుమతి లేని మార్గంలో వెళ్తున్న ఒక నౌకపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరిక కాల్పులు జరపడమే కాకుండా, క్రూజ్ క్షిపణితో దాడి చేయడంతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది.

Published on: Jul 12, 2026, 05:55:31 IST
Advertisement

ఇరాన్‌కు చెందిన శక్తివంతమైన సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (ఐఆర్​జీసీ) నావికాదళం సంచలన ప్రకటన చేసింది. వ్యూహాత్మకంగా ప్రాధాన్యమున్న ‘హర్మూజ్ జలసంధి’ని.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తేల్చిచెప్పింది. ఫలితంగా ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన గల్ఫ్ ప్రాంతంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి!

హర్మూజ్ జలసంధి మూసివేత! (REUTERS)
హర్మూజ్ జలసంధి మూసివేత! (REUTERS)

అనుమతి లేని రహదారి గుండా ప్రయాణించడానికి ప్రయత్నించిన ఒక అంతర్జాతీయ వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ సైన్యం మొదట హెచ్చరిక కాల్పులు జరిపింది. అనంతరం ఆ నౌకపై ఇరాన్ క్రూజ్ క్షిపణితో దాడి చేసినట్టు సమాచారం. గల్ఫ్ తీరంలో అమెరికా జోక్యం పూర్తిగా ముగిసే వరకు ఈ జలసంధి గుండా ఏ ఒక్క నౌకను కూడా వెళ్లనిచ్చేది లేదని ఇరాన్ ప్రభుత్వ అధికారిక బ్రాడ్‌కాస్టర్ ‘ఐఆర్ఐబీ’ స్పష్టం చేసింది.

అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా ఈ ఏడాది మార్చ్ నుంచి మూతపడిన స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్​, కొన్ని వారాల క్రితమే తెరుచుకున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడి చమురులో దాదాపు 20శాతం వాటా ఈ హర్మూజ్ జలసంధి గుండానే సాగుతుంది. ఈ వ్యూహాత్మక మార్గంలో అమెరికా, ఇరాన్ మధ్య రేగిన ఈ సైనిక ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్‌ను కలవరపెడుతున్నాయి. ఈ ఘర్షణలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు తీవ్ర విఘాతం కలిగి, ఇంధన ధరలు భారంగా మారే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ వంటి దేశాల దిగుమతులపైనా దీని ప్రభావం పడే అవకాశం ఉంది.

క్రూజ్ క్షిపణితో దాడి.. ఇరాన్ సైన్యం హెచ్చరికలు!

శత్రుదేశాలు ఈ ఘటనను వంకగా పెట్టుకుని ఏ చిన్న తప్పు చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ప్రాంతీయంగా శత్రువులకు చెందిన కొత్త సైనిక స్థావరాలపై దాడులు చేయడానికి సైతం వెనుకాడబోమని ఐఆర్ఐబీ తన ప్రకటనలో పేర్కొంది.

కొనసాగుతున్న అమెరికా దాడులు..

అంతర్జాతీయ సముద్ర మార్గంలో వాణిజ్య నౌకలపై ఇరాన్ సైన్యం దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణించిన అమెరికా, ఆ దేశంపై భీకర సైనిక చర్యకు పూనుకుంది! హర్మూజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ సైనిక లక్ష్యాలపై అమెరికా బలగాలు ఒకే వారంలో మూడో విడత దాడులు ప్రారంభించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడి ప్రత్యక్ష ఆదేశాల మేరకే ఈ ఆపరేషన్ కొనసాగుతోందని సైన్యం వెల్లడించింది.

ఒమన్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి చర్చలు..

మరోవైపు, వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు, అమెరికా ప్రతీకార చర్యల నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ శనివారం ఒమన్ రాజధాని మస్కట్‌లో ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ బద్ర్ అల్బుసైదీతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఇస్లామాబాద్ అవగాహనా ఒప్పందంలోని ఆర్టికల్ 5 ప్రకారం.. హర్మూజ్ జలసంధి గుండా అంతర్జాతీయ నౌకల సురక్షిత ప్రయాణానికి అవసరమైన తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంపై ఇరు దేశాల మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి కేవలం దౌత్య మార్గాలే శరణ్యమని ఒమన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe