...
...
Next Story

Ayatullah Al Khomeini : ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ హతం? ట్రంప్​ సంచలన ప్రకటన..

Ayatullah Al Khomeini dead : ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన సైనిక దాడి తర్వాత ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అల్​ ఖమేనీ మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా దీనిపై బలమైన సంకేతాలు ఇచ్చారు.

Published on: Mar 1, 2026, 05:26:54 IST
Advertisement

అమెరికా- ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన భారీ సైనిక ఆపరేషన్ తర్వాత ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అల్ ఖమేనీ మరణించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ వార్త అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

ఇరాన్​ సుప్రీం లీడర్ అయతొల్లా అల్​ ఖమేనీ..
ఇరాన్​ సుప్రీం లీడర్ అయతొల్లా అల్​ ఖమేనీ..

"చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తుల్లో ఒకరైన ఖమేనీ మరణించారు. ఇది ఇరాన్ ప్రజలకే కాదు, అతని ముఠా చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమెరికన్లకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల బాధితులకు దక్కిన న్యాయం," అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా పేర్కొన్నారు. తమ నిఘా వర్గాలు, అత్యుంత అధునాతన ట్రాకింగ్ సిస్టమ్స్ నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారని, ఇజ్రాయెల్‌తో కలిసి చేసిన ఈ ఆపరేషన్‌లో ఖమేనీతో పాటు ఇతర అగ్రనేతలు కూడా హతమయ్యారని ఆయన ధృవీకరించారు.

ఖమేనా నిజంగా చనిపోయారా? నిర్ధారించని ఇరాన్..

ఖమేనీ హతమైనట్టు ట్రంప్​ చెబుతున్నారు. ఆయన చనిపోయి ఉండొచ్చని ఇజ్రాయెల్​ అంటోంది. కానీ ఇరాన్​ సుప్రీం లీడర్​ అయతొల్లా అల్ ఖమేనీ మరణ వార్తపై ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి ఎన్‌బీసీ న్యూస్‌తో మాట్లాడుతూ, "నాకు తెలిసినంత వరకు ఖమేనీ క్షేమంగానే ఉన్నారు, ఉన్నతాధికారులందరూ బతికే ఉన్నారు," అని ఆచితూచి వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఖై స్పందిస్తూ.. దేనినీ ధృవీకరించే స్థితిలో తాను లేనని, ప్రస్తుతం దేశ సమగ్రతను కాపాడుకోవడంపైనే అందరం దృష్టి సారించామని పేర్కొనడం గమనార్హం.

30 బాంబులతో విరుచుకుపడ్డ క్షిపణులు!

శనివారం తెల్లవారుజామున టెహ్రాన్‌లోని ఖమేనీ అధికారిక నివాసం, కార్యాలయాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఖమేనీ నివాసం ఉన్న కాంపౌండ్ భారీగా దెబ్బతిన్నట్లు శాటిలైట్ చిత్రాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అత్యంత సన్నిహితుడైన జర్నలిస్ట్ అమిత్ సెగల్ కథనం ప్రకారం.. ఖమేనీ బంకర్ లక్ష్యంగా సుమారు 30 బాంబులను ప్రయోగించారు. దాడి సమయంలో ఖమేనీ భూగర్భంలోనే ఉన్నారని, అయితే ఆయన తన సొంత బంకర్‌లో కాకుండా వేరే చోట ఉండి ఉండవచ్చని సమాచారం.

ఇరాన్ ప్రజలకు పిలుపు: 'ఇదే మీ సువర్ణావకాశం'

"మీ స్వేచ్ఛా గడియారం ఆసన్నమైంది. ప్రస్తుతానికి సురక్షిత ప్రాంతాల్లోనే ఉండండి. మేం పని పూర్తి చేశాక, మీ ప్రభుత్వాన్ని మీరే నడుపుకోండి," అని ఆయన పిలుపునిచ్చారు.

నెతన్యాహు కూడా ఇరాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. "మీ అద్భుతమైన దేశాన్ని అధోగతికి తొక్కిన హంతక అయతొల్లా పాలనపై పోరాడాల్సిన సమయం వచ్చింది. మనందరికీ శత్రువు ఒక్కరే," అని వ్యాఖ్యానించారు.

36 ఏళ్ల పాలనకు ముగింపు?

1989లో రుహొల్లా ఖొమేనీ నుంచి బాధ్యతలు స్వీకరించిన అలీ ఖమేనీ, సుమారు 36 ఏళ్ల పాటు ఇరాన్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించారు. అయితే గత కొంతకాలంగా ఆయన పాలన తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఇరాన్ మద్దతు ఉన్న హమాస్, హిజ్బుల్లా గ్రూపులు బలహీనపడటం, దేశంలో ఆర్థిక సంక్షోభంపై నిరసనలు మిన్నంటడం ఖమేనీ పట్టును సడలించాయి. తాజా దాడులతో ఇరాన్‌లో సుదీర్ఘ ఖమేనీ శకం ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా ఈ దాడుల అనంతరం ఇరాన్ కూడా ప్రతిఘటించింది. ఇజ్రాయెల్‌తో పాటు బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలపై క్షిపణులతో దాడులు చేయడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత ముసురుకున్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe