ఇరాన్‌లో ‘కనిపిస్తే కాల్చివేయండి’ ఉత్తర్వులు జారీ చేసిన ఖమేనీ.. 2500 మంది బలి

1979 నాటి విప్లవం తర్వాత ఇరాన్ మళ్ళీ అంతటి భయానక హింసను చూస్తోంది. ఆర్థిక సంక్షోభంపై మొదలైన నిరసనలను అణచివేయడానికి సుప్రీం లీడర్ ఖమేనీ ‘షూట్ ఆన్ సైట్’ ఆదేశాలివ్వడంతో మరణాల సంఖ్య 2,500 దాటింది.

Published on: Jan 14, 2026, 11:45:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

1979 నాటి ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ దేశం మళ్ళీ అంతటి చీకటి రోజులను ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా సాగుతున్న నిరసనల సెగలు రాజధాని టెహ్రాన్ వీధులను నెత్తుటి మడుగులుగా మారుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం కమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తిగా నిలిపివేయడంతో బయటి ప్రపంచానికి తెలియని దారుణాలు, మంగళవారం నిరసనకారులు విదేశాలకు చేసిన ఫోన్ కాల్స్‌తో వెలుగులోకి వచ్చాయి.

నిరసనలు (AP)
నిరసనలు (AP)

శవాల దిబ్బలుగా మారుతున్న వీధులు

నిరసనకారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (HRANA) సమాచారం ప్రకారం.. బుధవారం ఉదయం నాటికి మృతుల సంఖ్య 2,571కి చేరుకుంది. గత కొన్ని దశాబ్దాల్లో ఇరాన్ చరిత్రలో ఇంతటి భారీ స్థాయిలో ప్రాణనష్టం జరగడం ఇదే మొదటిసారి.

‘కనిపిస్తే కాల్చివేయండి’.. ఖమేనీ క్రూరత్వం?

నిరసనకారులను అణచివేయడానికి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నేరుగా రంగంలోకి దిగారు. “నిరసనకారులను కనిపిస్తే కాల్చివేయండి” (Shoot on sight) అంటూ ఆయన భద్రతా దళాలకు ఆదేశాలిచ్చినట్లు ‘ఇరాన్ ఇంటర్నేషనల్’ నివేదించింది. సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనుమతితోనే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), బాసిజ్ దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నాయని, ఈ విషయం ప్రభుత్వ పెద్దలందరికీ తెలుసని ఆ నివేదిక పేర్కొంది.

మరోవైపు, ఇరాన్ ప్రభుత్వం ఈ మారణకాండకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులే కారణమని ఆరోపిస్తోంది. ప్రజలను చంపుతున్నది వీరేనంటూ ఇరాన్ భద్రతా మండలి సెక్రటరీ అలీ లారిజానీ మండిపడ్డారు.

“నిరసనలు ఆపకండి.. సాయం వస్తోంది” : ట్రంప్

ఇరాన్ పరిస్థితులపై డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. “ఇరాన్ దేశభక్తులారా, నిరసనలను కొనసాగించండి.. మీ సంస్థలను చేజిక్కించుకోండి. సహాయం అందుతోంది” అంటూ ట్రూత్ సోషల్ వేదికగా పిలుపునిచ్చారు. అంతేకాకుండా, నిరసనకారుల హత్యలు ఆగే వరకు ఇరాన్ అధికారులతో జరగాల్సిన అన్ని సమావేశాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఇరాన్ దళాలు ‘దుర్మార్గంగా’ ప్రవర్తిస్తున్నాయని ప్రాథమికంగా తెలుస్తున్నా, మరణాలపై పూర్తి నివేదిక వచ్చాకే చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

స్టార్‌లింక్ ద్వారా ప్రపంచానికి చేరుతున్న వార్తలు

దేశంలో ఇంటర్నెట్ బంద్ ఉన్నప్పటికీ, ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్’ ఇరాన్‌లో ఉచిత శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించింది. దీనివల్ల ఇరాన్ లోపల జరుగుతున్న అరాచకాలు ప్రపంచానికి తెలుస్తున్నాయి. “స్టార్‌లింక్ సేవలు ఇరాన్ అంతటా విజయవంతంగా పనిచేస్తున్నాయి. మేము దీన్ని స్వయంగా పరీక్షించాము” అని లాస్ ఏంజిల్స్‌కు చెందిన సామాజిక కార్యకర్త మెహదీ యాహ్యా నెజాద్ తెలిపారు.

ప్రస్తుతం టెహ్రాన్ వీధుల్లో పోలీసులు హెల్మెట్లు, బాడీ ఆర్మర్ ధరించి, టియర్ గ్యాస్, షాట్‌గన్లతో మోహరించారు. నిరసనకారులు మాత్రం “ఖమేనీకి మరణం తప్పదు” అంటూ గోడలపై గ్రాఫిటీలు రాస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More