...
...
Next Story

రూ. 500 నోట్లు రద్దవుతున్నాయా? సోషల్ మీడియా ప్రచారంపై కేంద్రం క్లారిటీ

రూ. 500 నోట్లను ప్రభుత్వం రద్దు చేయనుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. అయితే ఇవన్నీ పచ్చి అబద్ధాలని, ఇలాంటి పుకార్లను నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వ సంస్థ PIB స్పష్టం చేసింది.

Published on: Jan 02, 2026 05:07 PM IST
Advertisement

సోషల్ మీడియాలో ఏదైనా వార్త కనిపిస్తే చాలు, అది నిజమో కాదో తెలుసుకోకుండానే వైరల్ చేయడం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. తాజాగా రూ. 500 నోట్ల చలామణిపై కూడా ఇటువంటి ఒక తప్పుడు వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. 2026 మార్చి నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 500 నోట్లను ఉపసంహరించుకోబోతోందన్నది ఆ వార్త సారాంశం.

అదంతా ఫేక్.. నమ్మకండి!

రూ. 500 నోట్లు రద్దవుతున్నాయా? సోషల్ మీడియా ప్రచారంపై కేంద్రం క్లారిటీ
రూ. 500 నోట్లు రద్దవుతున్నాయా? సోషల్ మీడియా ప్రచారంపై కేంద్రం క్లారిటీ

ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ అధికారిక విభాగం 'పిఐబి ఫ్యాక్ట్ చెక్' (PIB Fact Check) స్పందించింది. "రూ. 500 నోట్లను నిలిపివేస్తున్నట్లు ఆర్‌బీఐ ఎక్కడా ప్రకటించలేదు. సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు, అది పూర్తిగా అవాస్తవం" అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తేల్చి చెప్పింది.

ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ. 500 నోట్లు చట్టబద్ధమైనవని, వాటిని యధావిధిగా లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ధృవీకరించని సమాచారాన్ని నమ్మవద్దని, ఇతరులకు షేర్ చేయవద్దని ప్రజలను కోరింది.

పాత వీడియోతో తప్పుడు ప్రచారం

నిజానికి ఇలాంటి పుకార్లు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా రూ. 500 నోట్ల రద్దుపై పలుమార్లు తప్పుడు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఒక యూట్యూబ్ ఛానెల్ వీడియోను అడ్డుపెట్టుకుని కొందరు కావాలనే ఈ తప్పుడు ప్రచారానికి తెరలేపారు. ఆ వీడియోలో ఒక న్యూస్ యాంకర్.. 2026 మార్చి నుంచి నోట్లు రద్దవుతాయని చెప్పడం కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం ఈ వాదనను అప్పట్లోనే కొట్టిపారేసింది.

పార్లమెంటులో ప్రభుత్వం ఏం చెప్పింది?

నోట్ల రద్దుపై వస్తున్న ఊహాగానాలపై గతంలోనే కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో వివరణ ఇచ్చారు. రూ. 500 నోట్లను నిలిపివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. బ్యాంకు ఏటీఎంల ద్వారా రూ. 100, రూ. 200 నోట్లతో పాటు రూ. 500 నోట్లు కూడా యధావిధిగా అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe