సిగరెట్లపై సర్కారు పన్ను పోటు.. కుప్పకూలిన ఐటీసీ, గాడ్‌ఫ్రే షేర్లు
సిగరెట్లపై ప్రభుత్వం కొత్తగా ఎక్సైజ్ సుంకాన్ని విధించడంతో పొగాకు కంపెనీల షేర్లు గురువారం భారీగా పతనమయ్యాయి. ఐటీసీ షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోగా, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఏకంగా 10 శాతం మేర నష్టపోయాయి. ఫిబ్రవరి 1 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.
ముంబై/న్యూఢిల్లీ: కొత్త ఏడాది తొలిరోజే సిగరెట్ ప్రియులకు, ఇన్వెస్టర్లకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. సిగరెట్లపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లో పొగాకు కంపెనీల షేర్లు కుప్పకూలాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో ప్రముఖ దిగ్గజం ఐటీసీ (ITC) షేర్లు ఏడాది కనిష్ట స్థాయికి పడిపోగా, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ (Godfrey Phillips) ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైంది.

ఏడాది కనిష్టానికి ఐటీసీ.. 10 శాతం నష్టంలో గాడ్‌ఫ్రే
కేంద్రం తీసుకున్న నిర్ణయం ఐటీసీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. బిఎస్ఈ (BSE)లో ఐటీసీ షేరు సుమారు 6 శాతం మేర నష్టపోయి రూ. 379 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. దీనికి తోడు కంపెనీలో జరిగిన భారీ బ్లాక్ డీల్ (దాదాపు 4.03 కోట్ల షేర్లు) కూడా అమ్మకాల ఒత్తిడిని పెంచింది. మరోవైపు, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ షేర్లు మరింత దారుణంగా 10 శాతం మేర పతనమై రూ. 2483.15 వద్ద ట్రేడయ్యాయి.
ఎక్సైజ్ సుంకం లెక్కలివే..
కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వుల ప్రకారం.. సిగరెట్ల పొడవును బట్టి ఈ ఎక్సైజ్ సుంకాన్ని నిర్ణయించారు. ప్రతి వేయి సిగరెట్ స్టిక్స్‌పై రూ. 2,050 నుంచి రూ. 8,500 వరకు సుంకం విధించనున్నారు.
ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి 1, 2026 నుండి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న 40 శాతం జీఎస్‌టీ (GST)కి ఇది అదనంగా ఉండనుంది.
"ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సిగరెట్ల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇది నేరుగా అమ్మకాలపై ప్రభావం చూపిస్తుంది" అని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
40 శాతం జీఎస్‌టీతో పాటు అదనపు భారం
నిజానికి గత డిసెంబర్‌లో పార్లమెంటు ఆమోదించిన సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు 2025లో భాగంగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం సిగరెట్లపై ఉన్న కాంపెన్సేషన్ సెస్‌కు బదులుగా ఈ కొత్త ఎక్సైజ్ సుంకం వస్తుంది. ప్రస్తుతం భారత్‌లో సిగరెట్లపై మొత్తం పన్నులు రిటైల్ ధరలో సుమారు 53 శాతంగా ఉన్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన 75 శాతం పన్ను లక్ష్యానికి ఇది ఇంకా తక్కువగానే ఉండటం గమనార్హం.
ఈ పరిణామాల నేపథ్యంలో సిగరెట్ తయారీ కంపెనీల మార్జిన్లు తగ్గవచ్చని, అందుకే ఇన్వెస్టర్లు షేర్లను విక్రయించడానికి మొగ్గు చూపుతున్నారని ట్రేడింగ్ వర్గాలు చెబుతున్నాయి.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


